బాబు అండగా నిలిచారు, రేవంత్‌ది దూకుడైనా: భార్య గీత ఉద్వేగం, ఈ రోజు విడుదల
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో ఆయన కుటుంబం, అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలారు. రేవంత్ రెడ్డి సాయంత్రం లోగా చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యే అవకాశముంది.
ఈ నేపథ్యంలో బెయిల్ వచ్చిన విషయం తెలిసి అప్పుడే చర్లపల్లి జైలు వద్దకు పెద్ద ఎత్తున అనుచరులు వచ్చారు. జైలు వద్ద సందడి నెలకొంది. రేవంత్ రెడ్డి అభిమానులు బాణాసంచా కాలుస్తూ డ్యాన్సులు చేశారు. రేవంత్ రెడ్డిని భారీ ర్యాలీతో తీసుకెళ్లాలని అభిమానులు భావిస్తున్నారు.
హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు రేవంత్ రెడ్డి న్యాయవాదుల చేతికి వస్తాయి. వారి చర్లపల్లి జైలు అధికారులకు ఇవ్వనున్నారు. బెయిల్ పేపర్లు అందాక చర్లపల్లి జైలు అధికారులు విడుదల ప్రక్రియను ప్రారంభిస్తారు. దీంతో మూడు గంటల తర్వాత విడుదలయ్యే అవకాశముంది.
రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిందనే విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం వారు మిఠాయిలు పంచుకున్నారు. నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి జైలులో ఉన్నారు. ఆయన ఇంటి వద్ద అభిమానుల సందడి కనిపించింది.
రేవంత్ రెడ్డి అరెస్టు అనంతరం తెలంగాణ టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు అంతా తమకు అండగా నిలిచారమని రేవంత్ రెడ్డి సతీమణి గీత చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో దూకుడు రేవంత్ నైజమన్నారు. రేవంత్ పోరాటానికి తమ కుటుంబం అండగా ఉంటుందని, దూకుడైనా ప్రజలకు రేవంత్ అండగా నిలుస్తారని గీత ఉద్వేగంతో చెప్పారు.
కుట్ర అని చెబుతూనే ఉన్నాం: రావుల
రేవంత్ రెడ్డిని కుట్రతో ఇరికించారని తాము మొదటి నుండి చెబుతున్నారమని తెలంగాణ టీడీపీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో న్యాయమే గెలిచిందన్నారు. న్యాయవ్యవస్థ పైన తమకు విశ్వాసం ఉందని చెప్పారు.