కేసీఆర్‌కు వీరితో తలనొప్పేనా?: కేకే తర్వాత డీఎస్‌ ల్యాండ్ స్కాం!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/మేడ్చల్‌: కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుకు తలనొప్పిగా మారుతున్నారా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న నయీమ్ కేసు, మియాపూర్ భూముల వ్యవహారంలో వారి ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కె కేశవరావు దండుమైలారం భూముల రిజిస్ట్రేషన్‌ వివాదంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఆ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ పై భూ కుంభకోణం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూమిని ఆయన దొడ్డిదారిన తన ఆధీనంలోకి తెచ్చుకొని రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

D Srinivas allegedly involved in land scam

మేడ్చల్‌ జిల్లా మేడ్చల్‌ మండలం గిర్మాపూర్‌ గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని డీఎస్‌ కొనుగోలు చేశారు. అంతకుముందు ఎంత మంది ఆ భూమిని కొనేందుకు ముందుకువచ్చినా.. ప్రభుత్వ భూమి అంటూ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అధికారులు ఒప్పుకోలేదు. అయితే డీఎస్‌ కొనుగోలు చేయగానే వారు రిజిస్ట్రేషన్‌ చేసేయడం గమనార్హం.

ఈ వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌ మండలం గిర్మాపూర్‌ గ్రామ పరిధిలో గౌడవెల్లి - రాయిలాపూర్‌ రోడ్డులో సర్వే నంబరు 221లో 8.9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో ఈ ప్రభుత్వ భూమిని గిర్మాపూర్‌ గ్రామానికి చెందిన నిరుపేద ముదిరాజ్‌లకు కేటాయించారు. ఈ భూమిని 1972-73లో అదే గ్రామానికి చెందిన బొక్క యాదిరెడ్డి అనే రైతు ముదిరాజ్‌ల నుంచి కొనుగోలు చేశాడు. మూడేళ్ల తర్వాత యాదిరెడ్డి నుంచి అతడి సోదరుడు రాజిరెడ్డి ఈ భూమిని కొన్నాడు.

అప్పటి నుంచి ఆ భూమిలో రాజిరెడ్డి కుటుంబసభ్యులు వ్యవసాయం చేస్తూవచ్చారు. రాజిరెడ్డి మృతి చెందిన తర్వాత ఈ భూమిని అతడి కుమారులు సాయిరెడ్డి, బల్వంత్‌రెడ్డి, రఘుపతిరెడ్డి పేర్ల మీద విరాసత్‌ చేయించారు. అసైన్డ్‌ చట్టం ప్రకారం ఆ భూములపై హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. అసైన్డ్‌దారులు ఆ భూమిని అనుభవించడానికే వీలుంటుంది తప్ప ఇతరులకు విక్రయించేందుకు వారికి ఎలాంటి హక్కులు ఉండవు.

అయితే అసలు అసైన్డ్‌దారుల నుంచి చేతులు మారిన ఈ భూమిని పీవోటీ కింద వెనక్కి తీసుకునేందుకు అధికారులు గతంలో నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే సమయంలో భూమిని అనుభవిస్తున్న సాయిరెడ్డి, బల్వంత్‌రెడ్డి, రఘుపతిరెడ్డి నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌, ఆయన అనుచరుడు ఎ.వి.సత్యనారాయణ.. సర్వే నంబరు 221లో గల ప్రభుత్వ భూమిని 2015లో కొనుగోలు చేశారు. డీఎస్‌ పేరిట 4 ఎకరాలు (డాక్యుమెంటు నంబరు 4873/15), ఎ.వి.సత్యనారాయణ పేరిట 2 ఎకరాలు (డాక్యుమెంటు నంబరు 4872/15) మేడ్చల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేశారు.

అనంతరం ఈ ఏడాది జనవరిలో మ్యుటేషన్‌ కోసం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, రెవెన్యూ అధికారులు మాత్రం విచారణ నిర్వహించిన అనంతరం మ్యుటేషన్‌ చేయడానికి నిరాకరించారు. అంతేకాక చేతులు మారిన అసైన్డ్‌ భూములను వెనక్కి తీసుకునేందుకు మరోసారి జనవరిలో పీవోటీ నోటీసులు జారీ చేశారు. అయితే.. రెవెన్యూ రికార్డుల్లో డీఎస్‌, ఎ.వి.సత్యనారాయణ పేర్లు ఇంకా నమోదు కాకపోవడంతో మొదట ప్రభుత్వం కేటాయించిన వారి పేరిటనే ఈ నోటీసులను జారీ చేశారు.

'మీకు ప్రభుత్వం కేటాయించిన స్థలం అన్యాక్రాంతమైంది. దీనికి వెంటనే 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలి' అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. గౌడవెల్లి - రాయిలాపూర్‌ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ భూమికి భారీ డిమాండ్‌ ఉంది. ఇక్కడ ఎకరా భూమి బహిరంగ మార్కెట్లో రూ. కోటి వరకు పలుకుతోంది. ఈ భూమి నగరానికి అతి సమీపంలో ఉండటంతో ఈ మార్గం కమర్షియల్‌గా బాగా అభివృద్ది చెందింది. సాయిరెడ్డి, బల్వంత్‌రెడ్డి, రఘుపతిరెడ్డి నుంచి ఈ భూమిని డీఎస్‌ ఆయన అనుచరుడు ఎకరాకు రూ.14 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఇంకా కొంత డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్లు, దానికి సంబంధించిన చెక్కులు కూడా భూమిని విక్రయించిన వారి వద్ద ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ సర్వే నంబరు 221 పక్కనే గల 222-ఏలో కూడా ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు బడాబాబులు కొనుగోలు చేశారని, దాన్ని ఏదో విధంగా పట్టాగా మార్చుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ గ్రామస్తులే తెలపడం గమనార్హం.

English summary
It is said that TRS leader and MP D Srinivas allegedly involved in land scam in Medchal district.
Please Wait while comments are loading...