‘ ఫాంహౌజ్‌లో పడుకుంటే నెం. 1?: పని చేసే బాబుకు ఏడా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్‌ను నంబర్‌వన్ సీఎంగా ఎందుకు ఎంపిక చేశారో చెప్పాలని గాలి ముద్దకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు.
సర్వే చేసిన వీడీపీ అసోసియేషన్స్ సంస్థ అసలెక్కడ ఉందో ఎవరికీ తెలియదన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న చంద్రబాబుకు ఏడో ర్యాంక్, ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్‌కు మొదటి ర్యాంక్ రావడం విడ్డూరంగా ఉందన్నారు.

చంద్రబాబు అద్భుతంగా పనిచేస్తున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీయే మెచ్చుకున్నారని గుర్తు చేశారు. బ్రిటిష్ వాళ్లు సికింద్రాబాద్‌ను నిర్మిస్తే.. చంద్రబాబు హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్ ఆదాయాన్ని 60శాతం పెంచారని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. అందుకే హైదరాబాద్ మీద చంద్రబాబుకు హక్కు ఉందన్నారు.
ఇది ఇలా ఉండగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసీఆర్ వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అజెండాతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఎవరు చేసినా తాము చేయి కలుపుతామని స్పష్టం చేశారు.
సీపీఎం చేపట్టిన ఈ పాదయాత్రకు మద్దతుగా చేపట్టిన సంఘీభావ యాత్రకు బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సమస్యలపై సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని రేవంత్‌రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications