వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరుగారిపోయిన కేసీఆర్: అసెంబ్లీ సీట్ల పెంపుపై కొత్త పల్లవి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఇక పూర్తిగా తెరపడింది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ఇక పూర్తిగా తెరపడింది. ఇక ఇది ముగిసిన అధ్యాయమేనని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఈ విషయమై బుధవారం సాయంత్రం పార్లమెంటు హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశంలో వెల్లడైంది.

కానీ ప్రధానితో భేటీ తర్వాత సీఎం కే చంద్రశేఖర్‌రావు మాత్రం తమకు ఆ విషయం అంత ప్రాధాన్య అంశం కాదని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. తాము ప్రస్తావించిన జాబితాలో అది ఆరవదని అజెండా పత్రాలను మీడియాకు చూపారు. అసలు సంగతేమిటంటే విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ప్రధాని వద్ద కేసీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

మోదీ మాత్రం దీనిపై స్పందించకుండా జవాబు దాటవేశారని తెలిసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అసెంబ్లీ సీట్లు పెంచితే ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తాము కూడా లాభపడతామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్‌ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాల్సిన గురుతర బాధ్యత కేంద్రానిదే.

అదే అమలు చేయాలని మూడేళ్లుగా ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని కోరుతున్నాయి. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఎంతగా ఒత్తిడి చేస్తున్నా కేంద్రం మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చింది. మరోవైపు.. అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని ఉటంకిస్తూ నియోజకవర్గాల పునర్విభజనకు 2026 వరకు అవకాశం లేదని ఎన్నికల సంఘం సూచించింది. తాజాగా ప్రధాని మోదీ సైతం ఈ అంశంపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఇది ముగిసిన అధ్యాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు

టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు

కానీ 2014లో తెలంగాణలో కొలువు దీరిన తొలి ప్రభుత్వానికి సారథ్యం వహించిన టీఆర్ఎస్ అధినేత - రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. అప్పటివరకు తన పార్టీపై ఉన్న ఉద్యమ పార్టీ ముద్ర తుడిచివేసేందుకే ప్రయత్నించారు. ‘బంగారు తెలంగాణ' నినాదం మాటున అధికారం అండతో ఇతర పార్టీల నుంచి ప్రత్యేకించి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన టీడీపీ నుంచి 12 మంది అధికార టీఆర్ఎస్ పక్షాన చేరిపోగా, 20 స్థానాలతో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గణనీయ స్థాయిలోనే ఎమ్మెల్యేలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. అంతెందుకు? 2004 నుంచి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన దర్మపురి శ్రీనివాస్ వంటి వారిని కూడా కారెక్కించడంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యం తెలంగాణ రాష్ట్ర సమితిది. ఈ ఫిరాయింపుల్లో కొన్ని రాజకీయ అవసరార్థం జరిగినవైతే.. మరికొన్ని రాజకీయంగా విపక్షాలను దెబ్బ తీయడానికి సాగినవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
కేంద్రం తీరుతో క్లిష్టంగా మారిన రాజకీయం

కేంద్రం తీరుతో క్లిష్టంగా మారిన రాజకీయం

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించినప్పుడల్లా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయని, అందరికీ సీట్లు సర్దుబాటు చేయవచ్చునని సీఎం కేసీఆర్ గులాబీ శ్రేణులకు సంకేతాలిస్తూ వచ్చారు. కానీ పరిస్థితి ఇప్పుడు తిరగబడినట్లు అర్థమవుతున్నది. దాదాపు 30 స్థానాల్లో విపక్షాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొన్నది. వచ్చే ఎన్నికల్లో అందరూ గెలుస్తారన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే పలు దఫాలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు విపక్ష ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హైకోర్టుపై కేంద్రం కప్పదాట్లు ఇలా

హైకోర్టుపై కేంద్రం కప్పదాట్లు ఇలా

ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతతో వ్యవహరించడానికి ప్రధాన కారణం రాజకీయంగా, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు తలెత్తరాదన్నదే ప్రధాన వ్యూహం. నిధుల విడుదల కోసం ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతే తెలంగాణకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందే తప్ప.. ప్రత్యేకంగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. హైకోర్టు రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యతన అమలు చేయడంలోనూ కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సందర్భంగా నెల రోజుల్లో హైకోర్టు అంశం పరిష్కరిస్తామని అప్పటి న్యాయశాఖ మంత్రి సదానందగౌడ హామీ గుప్పించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన తర్వాత మాట మార్చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాత్కాలికంగా హైదరాబాద్ నగరంలో భవనం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రతిపాదించినా.. కేంద్రం కిమ్మనలేదు. మరోవైపు ఆగమేఘాల మీద అమరావతి నగరంలో అసెంబ్లీ, సచివాలయ నిర్మాణం చేపట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వ్యూహాత్మకంగానే హైకోర్టు నిర్మాణం సంగతి విస్మరించారు.

అందరి కంటే ముందు సీఎం కేసీఆర్

అందరి కంటే ముందు సీఎం కేసీఆర్

ఇటీవల నల్లగొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజులు పర్యటించి తెలంగాణ ప్రభుత్వంలో, ప్రత్యేకించి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ఇలా అమిత్ షా పర్యటన ముగించుకుని హైదరాబాద్ నుంచి వెళ్లి వెళ్లక ముందే మీడియా ముందు వివరణ ఇచ్చిన సీఎం కేసీఆర్.. పరుగుపరుగున రాజ్ భవన్ కు చేరుకుని అమిత్ షా పై ఫిర్యాదు చేసినట్లే చేసి.. కేంద్రానికి షరతులతో కూడిన మద్దతు ఇచ్చిన తర్వాత అమిత్ షా ఆరోపణలు చేయడమేమిటని అన్నట్లు వార్తలు వచ్చాయి. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేస్తున్నాం, సమావేశానికి రావాలని కాంగ్రెస్ పార్టీ పంపిన ఆహ్వానాన్ని తోసి రాజని అందరికన్నా ముందే బీజేపీకి, ఎన్డీయేకు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన నేపథ్యం టీఆర్ఎస్, దాని అధినేత - సీఎం కేసీఆర్‌ది. ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలియదనుకుంటే అంతకుమించిన పొరపాటు మరొకటి ఉండదు. ఏ ఆలోచనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారో సీఎం కేసీఆర్ తెలంగాణ సబ్బండ వర్ణాలకు వివరించాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నారు.

 తమకు లాభమేమిటన్న కోణంలో బీజేపీ గేమ్ ప్లాన్

తమకు లాభమేమిటన్న కోణంలో బీజేపీ గేమ్ ప్లాన్

వాస్తవానికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో తెలంగాణ, ఏపీలో అధికార పార్టీలు ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు ఎడాపెడా ఫిరాయింపులను ప్రోత్సహించాయి. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్య ఉండదని భావించాయి. కానీ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజ్యాంగ సవరణతో కూడుకున్న అంశం కావడంతో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ దీనిపై అంత ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు అసెంబ్లీ స్థానాలు పెంచడం వల్ల తమకు లాభించే అంశాలేమిటన్న కోణంలోనూ కేంద్రం, కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఆలోచిస్తున్నది. అయినా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇన్నాళ్లూ తమ ప్రయత్నాలు కొనసాగించాయి. కానీ తాజా పరిణామాలతో ఇక నియోజకవర్గాల పెంపు ఉండకపోవచ్చన్న సంగతి స్పష్టంగా తేలిపోయింది.

English summary
Telangana Chief Minister K Chandrashekar Rao met Prime Minister Narendra Modi on Wednesday in New Delhi. The CM discussed important issues related to the state with the PM. One of the central point of the discussion was to increase the assembly seats in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X