పవన్‌వి తుచ్ఛ రాజకీయాలు, కేటీఆర్! సవాల్‌కు సిద్ధమేనా?: కిషన్ నిప్పులు

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ పార్టీ, కేంద్రంపై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌, తెలంగాణ మంత్రి కేటీ రామారావు, ఎంపీ కవితలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ పార్టీ, కేంద్రంపై విమర్శలు చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌, తెలంగాణ మంత్రి కేటీ రామారావు, ఎంపీ కవితలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వీరిపై విమర్శలను ఎక్కుపెట్టారు.

ఉత్తరప్రదేశ్ లో రైతుల రుణమాఫీ చేస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే అయినప్పటికీ... అది కేంద్ర ప్రభుత్వ నిధులతో జరగదని, యూపీ రాష్ట్ర నిధులతోనే జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు.

తుచ్ఛ రాజకీయాలంటూ పవన్‌పై..

ఈ మధ్య కాలంలో కొత్త నాయకుడు వచ్చాడని, ఏ మాత్రం అవగాహన లేకుండా సోషల్ మీడియాలో తుచ్ఛ రాజకీయాలు చేస్తున్నాడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన విరుచుకుపడ్డారు. తుచ్ఛ రాజకీయాల వల్ల ఉపయోగం లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలని సూచించారు. కేవలం వార్తల్లో ఉండేందుకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం సరైన పద్ధతి కాదని చెప్పారు.

ఇదేం న్యాయమంటూ పవన్..

ఉత్తరప్రదేశ్ లో రైతుల రుణమాఫీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. యూపీలో రుణమాఫీ చేసినప్పుడు... తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల్లో రుణమాఫీ ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. ఉత్తర భారతదేశంపైనే ప్రేమను చూపిస్తున్న కేంద్ర పాలకులు... దక్షిణాది రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే, పవన్‌పై కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కవితకు ఏం పని?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తాము అంతర్గతంగా చెబుతుంటే... టీఆర్ఎస్ ఎంపీ కవిత మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో కవితకు ఏం పని అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా ఆదుకుంటోందని చెప్పారు. కేవలం రాజకీయం చేయడానికే కవిత ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు ఏ మాత్రం సంతోషంగా లేరని విమర్శించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి చెప్పినట్టు తెలంగాణలో బాహుబలి వస్తాడని చెప్పారు.

కేటీఆర్ వ్యాఖ్యలు దురదృష్టకరం

ప్రధాని మోడీ గురించి తెలంగాణ శాసనమండలిలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మండిపడ్డారు. యూపీలో రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన మోడీ... తెలంగాణ రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయరంటూ కేటీఆర్ ప్రశ్నించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ ఉన్న సంగతి నిజమేనని... అయితే, అది కేంద్ర ప్రభుత్వ నిధులతో కాదనే విషయాన్ని కేటీఆర్ తెలుసుకోవాలని సూచించారు.

కేటీఆర్‌కు కిషన్ సవాల్

రుణమాఫీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇంత మాత్రం అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడటం... ఆయన తెలివి తక్కువ తనానికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. గద్వేల్ కు వందల కోట్ల రూపాయల నిధులను ఇస్తున్నారని, ఎర్రవల్లిలో మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారని... మిగిలిన వేలాది గ్రామాల్లో ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. మీకు నిజంగా నిజాయతీ ఉంటే దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. దీనిపై చర్చకు కేటీఆర్ సిద్ధంగా ఉండాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

English summary
BJP MLA Kishan Reddy on Saturday fired at Janasena Party president Pawan Kalyan, Telangana minister KTR and MP alvakuntla kavitha for critising BJP.
Please Wait while comments are loading...