వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ పంథానే: కోదండరామ్ పొరపాట్లు ఏమిటి, ఎందుకు?

తెలంగాణ జెఎసి నిర్మాణంలో కోదండరామ్ తెరాస నిర్మాణంలో కెసిఆర్ అనుసరించిన పంథానే అనుసరించారు. దానివల్లనే ఇప్పుడు కోదండరామ్‌కు మద్దతు లభిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ పార్టీ పెడుతారంటూ ఇటీవల విస్తృత ప్రచారమే జరిగింది. కెసిఆర్‌తో పూర్తిగా తెగదెంపులు జరిగిన తర్వాత ఆయన తెలంగాణ ప్రభుత్వంపై సమరానికి నడుం బిగించారు. మల్లన్నసాగర్‌కు భూసేకరణ వంటి పలు అంశాలపై ఆయన కెసిఆర్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఈ సమయంలో ఆయన పార్టీ పెడుతారంటూ ఊహాగానాలు చెలరేగాయి. నిజానికి, కోదండరామ్ ఆ ప్రయత్నాలు చేయకపోలేదు. తన పాత సహచరులను కలిసి పార్టీ పెట్టే విషయంపై చర్చలు కూడా చేశారు. తెలంగాణ జెఎసి తెలంగాణ ఉద్యమ కాలంలో బలమైన శక్తిగా ఉంటూ వచ్చింది.

తెలంగాణ ఉద్యమంలో ఉప ఎన్నికల్లో ఓటమి వంటి వివిధ కారణాల వల్ల కెసిఆర్ వెనక్కి తగ్గిన ప్రతిసారీ కోదండరామ్ ముందుకు నడిపించారు. తెలంగాణ ఉద్యమానికి తిరిగి జీవం పోస్తూ వచ్చారు. కెసిఆర్, కోదండరామ్ సరిజోడుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో ఉంటూ వచ్చింది.

జెఎసి నిర్మాణం....

జెఎసి నిర్మాణం....

తెలంగాణ రాజకీయ జెఎసి నిర్మాణంలో కెసిఆర్ కూడా కీలక పాత్ర పోషించారు. తటస్థుడి పేరు మీద కోదండరామ్ దానికి చైర్మన్ అయ్యారు. తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు అందులో చేరాయి. కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపిలతో సహా చిన్న చితకా పార్టీలు ప్రజా సంఘాలు తెలంగాణ రాజకీయ జెఎసిలో చేరాయి. తెలంగాణ జెఎసి చైర్మన్‌గా పార్టీల మధ్య సయోధ్య కుదర్చడంలో కోదండరామ్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి లభిస్తున్న మద్దతు కారణంగా కూడా రాజకీయ పార్టీలు రాజకీయ జెఎసిలో చేరాయి. ఈ క్రమంలోనే కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అంతకు ముందు తెలంగాణలో ప్రగతిశీల ఉద్యమాల్లో నిర్వహించిన పాత్ర కూడా ఆయనకు ఉపయోగపడింది. విప్లవజాలం గల శ్రేణులు దాదాపుగా ఆయన వెంట నడిచాయి. ఇందులో ముఖ్యంగా ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. మిగతా మేధావివర్గం కూడా ఉంది.

క్రమంగా దూరం....

క్రమంగా దూరం....

తెలంగాణ రాజకీయ జెఎసి నుంచి రాజకీయ పార్టీలు క్రమంగా ఒక్కటొక్కటే తప్పుకున్నాయి. రాజకీయ పార్టీలు దూరం కావడానికి వాటి సొంత కారణాలతో పాటు కెసిఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా పనిచేశాయి. తెలుగుదేశం, కాంగ్రెసు, బిజెపి రాజకీయ జెఎసి నుంచి తప్పుకున్న తర్వాత ప్రజా పంథా అనే పార్టీ, ఇతర ప్రజా సంఘాలతో రాజకీయ జెఎసి నడిచింది. పార్టీలు తప్పుకున్నప్పటికీ అనుచరగణం కారణంగా, ప్రజా మద్దతు వల్ల తెలంగాణ జెఎసి బలంగానే నడిచింది. జెఎసి చేపట్టిన కొన్ని కార్యక్రమాలు తెలంగాణ ప్రజల నుంచి ఎనలేని ప్రశంసలు అందుకున్నాయి. అయితే, రాజకీయ పార్టీలు జెఎసి నుంచి తప్పుకునే క్రమంలో కోదండరామ్‌ను కెసిఆర్ తొత్తుగా అభివర్ణించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత...

తెలంగాణ ఏర్పడిన తర్వాత...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ నేతృత్వంలో వచ్చిన తర్వాత చాలా కాలం కోదండరామ్ మౌనంగానే ఉన్నారు. కెసిఆర్‌ను కలవడానికి ఆయన చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ విషయాన్ని కోదండరామ్ ఒకటి రెండు సార్లు బహిరంగంగానే చెప్పారు. కోదండరామ్‌ను కెసిఆర్ దూరం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు క్రమంగా అర్థమవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కోదండరామ్ కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తుతూ వచ్చారు. రైతు ఆత్మహత్యలపై ఆయన గళం విప్పారు. దీంతో కెసిఆర్‌కు కోదండరామ్‌కు అగాథం ఏర్పడింది.

వ్యూహాత్మకంగా కెసిఆర్

వ్యూహాత్మకంగా కెసిఆర్

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కోదండరామ్ వెంట నడిచిన శ్రేణులను చేరదీశారు. రాజకీయ జెఎసిలోనూ తెలంగాణ మేధావుల ఫోరం వంటి అనుబంధ సంస్థల్లోనూ కీలక పాత్ర పోషించినవారిని కెసిఆర్ దగ్గర చేసుకున్నారు. వారికి పదవులు ఇస్తూ వెళ్లారు. ఆ రకంగా సైన్యం లేని సేనాధిపతిగా కోదండరామ్‌ను చేస్తూ వచ్చారు. చివరగా, అరెస్టు సమయంలో వెంట ఉన్న ఇద్దరు ముగ్గురు ముఖ్యులు కూడా కోదండరామ్‌కు దూరమయ్యారు. ఇందులోనూ కెసిఆర్ వ్యూహమే ఉంది.

సుమన్ వంటి నేతలతో....

సుమన్ వంటి నేతలతో....

కోదండరామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రమంలో పార్లమెంటు సభ్యుడు సుమన్ వంటి నాయకుల చేత తీవ్రమైన ఎదురు దాడి చేయించారు. కోదండరామ్‌పై వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటే, కొద్ది మంది తెరాస నాయకులు, మంత్రులు కూడా నొచ్చుకున్న సందర్భాలున్నాయని అంటారు. అయితే, కోదండరామ్‌పై గౌరవంతోనో మరో కారణంతోనో ఆయనను అభిమానించేవారు మాత్రం ఎదురుదాడికి దిగలేదు. హరీష్ రావు వంటి మంత్రులు కూడా సున్నితంగానే కోదండరామ్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

కోదండరామ్ చేసిన తప్పేమిటి...

కోదండరామ్ చేసిన తప్పేమిటి...

తెలంగాణ జెఎసిలను నిర్మించే క్రమంలో కోదండరామ్ పూర్తిగా తనకు అనుకూలమైన వారిని మాత్రమే తీసుకుంటూ వచ్చారు. వారికే పదవులు అప్పగిస్తూ వచ్చారు. తెరాసలో కెసిఆర్ చెప్పిందే జరిగినట్లుగా జెఎసిల్లో తాను చెప్పిందే జరిగే విధంగా ఆయన జాగ్రత్త పడ్డారు. తెలంగాణ కోసం పనిచేసిన, చేస్తున్న ముఖ్యులను ఆయన పక్కన పెట్టారు. జెఎసిలకు కన్వీనర్లను పెట్టే సందర్భంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం తెలంగాణ కోసం పనిచేసేవారు నిష్క్రియా పరులుగా మిగిలిపోయి, ఆయన వెంట నడిచినవారు ప్రభుత్వంలో చేరిపోయారు. ఇది కోదండరామ్ ఉద్యమ కాలంలో చేసిన పొరపాటు.

ఇప్పుడు మరో పొరపాటు...

ఇప్పుడు మరో పొరపాటు...

కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నడిపే క్రమంలో కోదండరామ్ మరో తప్పు చేశారు. ఆయన వెనక కాంగ్రెసు ఉందనే అభిప్రాయం కలిగించే విధంగా ఆయన వ్యవహరించారు. ఆయన ఉద్యమాలకు తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెసు నేతలు మద్దతు పలుకుతూ వచ్చారు. జానారెడ్డితో సహా మిగతా కాంగ్రెసు నేతలంతా ఆయనకు మద్దతు ఇస్తూ వచ్చారు. అది కాంగ్రెసు కార్యక్రమం మాదిరిగా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా, వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కూడా కావడం వల్ల మద్దతు కష్టంగా మారింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు పట్ల ఉన్న అభిప్రాయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు.

పార్టీ పెడుతారా....

పార్టీ పెడుతారా....

కెసిఆర్‌ నుంచి విడిపోయిన ప్రతి ఒక్కరూ తటస్థులుగా మిగిలిపోయినవారిని కలుపుకుని పనిచేయాలని చూస్తూ వస్తున్నారు. అయితే, కెసిఆర్‌తో ఉన్నంత సేపు వారిని కలుపుకుని పోవడానికి వారెంత మాత్రం ఇష్టపడలేదు. వారు వ్యతిరేకించాలన్నప్పుడు వ్యతిరేకించడం, మద్దతివ్వాలన్నప్పుడు మద్దతు ఇవ్వడం ఇష్టం లేని శ్రేణులు కెసిఆర్‌కూ దూరంగా ఉన్నప్పటికీ వారి వెంట నడిచేందుకు సిద్ధంగా లేరు. కోదండరామ్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ స్థితిలో కోదండరామ్ పార్టీ పెట్టేందుకు అంత సుముఖంగా లేరనే మాట వినిపిస్తోంది.

English summary
According to political analysts - Telangana JAC chairman Kodandaram has followed the strategy of Telangana Rastra samithi (TRS) chief and CM K Chandrasekhar Rao (KCR)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X