హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కుప్పకూలిన 7అంతస్తుల భవనం: చిన్నారి ఆర్తనాదాలే కాపాడాయి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నానక్‌రాంగూడలో కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీసే ప్రక్రియ శనివారం కొనసాగుతూనే ఉంది. కాగా, గురువారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో లోపలి వైపు నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. నాలుగో గదిలో నుంచి చిన్నారి అరుస్తున్నట్లు గుర్తించి శిథిలాలను తొలగించడంతో చిన్న రంధ్రం కనిపించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఈ చిన్న రంధ్రంలో నుంచి బాధితుల్ని గుర్తించే(విక్టిమ్‌ లొకేట్‌) కెమెరాను లోపలికి పంపించారు.

చిన్నారితోపాటు మహిళ బతికే ఉన్నట్లు తేలడంతో.. ఆ ప్రాంతంలో కట్టడం మరింత కూలకుండా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5.45 ప్రాంతంలో శిథిలాలను తొలగించి మూడేళ్ల చిన్నారి దీపక్‌ను, తర్వాత దీపక్‌ తల్లి రేఖనూ రక్షించి ఆసుపత్రికి తరలించారు. రేఖ భర్త శివ అప్పటికే ప్రాణాలు వదిలినట్లు గుర్తించారు. శుక్రవారం ఉదయం 9.15 గంటల ప్రాంతంలో మొదటి గదిలో నుంచి పైడమ్మ, ఆమె కుమార్తె గౌరీశ్వరి మృతదేహాల్ని వెలికితీశారు.

మధ్యాహ్నం నుంచి పైడమ్మ భర్త సాంబయ్య, తర్వాత వెంకటలక్ష్మితోపాటు మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శిక్షణ పొందిన జాగిలాలను శిథిలాల్లోకి పంపించారు. అలా లోపలికి వెళ్లిన ఓ జాగిలం శుక్రవారం ఉదయం మనిషి బతికే ఉన్నాడనేందుకు గుర్తుగా బిగ్గరగా అరిచింది. అయితే అటువైపున్న మరో భవనం కూలిపోయేలా ఉండడంతో సహాయచర్యలకు వెళ్లినా ముప్పేనని గుర్తించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో మరోసారి జాగిలాన్ని లోపలికి పంపించగా అది స్పందించకపోవడంతో ఆ ప్రాణం కూడా పోయిందని నిర్ధారణకు వచ్చారు.

మరోవైపు భవన యజమాని సత్యనారాయణసింగ్‌ అలియాస్‌ సత్తూసింగ్‌పై 304 పార్ట్‌ 2 సెక్షన్‌(హత్య కాని మరణం) కేసు నమోదు చేశారు. అక్రమ నిర్మాణంపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి.. సర్కిల్‌-11కు చెందిన ఉప కమిషనర్‌ మనోహర్‌, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ కృష్ణమోహన్‌లను సస్పెండ్‌ చేశారు. సహాయక కార్యక్రమాలను మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు.

పొట్టకూటికోసం వచ్చి..

పొట్టకూటికోసం వచ్చి..

పొట్టకూటి కోసం వలస వచ్చిన కూలీల ప్రాణాలు అక్రమార్కుల కాసుల వేటలో కడతేరిపోయాయి. ఉపాధి వేటలో జిల్లాలు, రాష్ట్రాలు దాటి వచ్చిన అభాగ్యులను అధికార యంత్రాంగంలోని అవినీతి బలితీసేసుకుంది. అక్రమాల పునాదుల మీద అడ్డగోలుగా కట్టేసిన ఏడంతస్తుల భవనం నిట్టనిలువునా కుప్పకూలి 11 నిండు ప్రాణాలను మింగేసింది.

కుటుంబ పెద్దను పోగొట్టుకుంది

కుటుంబ పెద్దను పోగొట్టుకుంది

సంక్రాంతి పండగొచ్చేస్తుంది.. కూలి చేసి పోగేసుకున్న డబ్బులతో కొత్త బట్టలు కొనుక్కుని సొంతూళ్లకు వెళ్లాలని సంబరపడుతున్న ఆ బడుగుల ఆశలను గురువారం రాత్రి జరిగిన ప్రమాదం చిన్నాభిన్నం చేసింది.11 మంది కూలీలు మృతి చెందారు. ఓ తల్లీ బిడ్డా ప్రాణాలతో బయటపడినా కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డునపడ్డారు.

11మంది కూలీలను బలిగొంది

11మంది కూలీలను బలిగొంది

హైదరాబాద్‌ శివారులోని నానక్‌రాంగూడలో గురువారం రాత్రి ఏడంతస్తుల భవనం కుప్పకూలిపోయిన దుర్ఘటన 11మంది కూలీల ప్రాణాలు బలిగొంది. గురువారం రాత్రి 9.20 గంటల సమయంలో భవనం కుప్పకూలింది. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సైబరాబాద్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌), వైద్యసిబ్బంది సహాయచర్యలు ప్రారంభించారు. శిథిలాల తొలగింపు చేపట్టారు.

హుటాహుటిన సహాయక చర్యలు

హుటాహుటిన సహాయక చర్యలు

శిథిలాల్లో చిక్కుకున్న వారి పరిస్థితి తెలియకపోవడం, రాత్రి సమయం కావడంతో జాగ్రత్తగా పనులు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్య, మేయర్‌ రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి దగ్గరుండి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. శుక్రవారం ఉదయం ఘటనాస్థలికి వచ్చిన పురపాలక మంత్రి కేటీఆర్‌ సాయంత్రం వరకు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఖర్చుతో వైద్యం, రూ.లక్ష పరిహారం అందిస్తామన్నారు.

పకడ్బందీగా శిథిలాల తొలగింపు

పకడ్బందీగా శిథిలాల తొలగింపు

భవనం కూలిపోయిన తీరు భయానకంగా కనిపించింది. అయితే ఒక్కరు బతికున్నా కాపాడాలనే లక్ష్యంతో సహాయ చర్యలు చేపట్టారు. భవన నమూనాను, లోపల ఉన్నవారి వివరాలు సేకరించారు. 15-20 మంది కూలీలు ఉంటారని, వారంతా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పార్కింగ్‌ కోసం వదిలిన స్థలంలో పిల్లర్ల మధ్యలో అట్టపెట్టెలు, ప్లాస్టిక్‌ కవర్లతో గదుల్లా కట్టుకుని నివసిస్తున్నారని తెలిసింది. ఇలా ఐదు గదుల్లో ఐదు కుటుంబాలు నివసిస్తున్నట్లు తేలింది. భవనం కూలినప్పుడు వీటిలో 13 మంది ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు సహాయచర్యలు ముమ్మరం చేశారు. భవనం కుప్పకూలడంతో పక్కనున్న మరో అంతస్తు భవనానికి పగుళ్లు వచ్చాయి. అందులో ఉన్న కుటుంబాన్ని ఖాళీ చేయించారు. కూలిన భవనాన్ని ఆనుకుని మరోవైపు ఉన్న ఇల్లు సహాయచర్యలకు అడ్డుగా ఉండడంతో దాన్ని కూలగొట్టారు.

మృతుల్లో 10మంది విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులే..

మృతుల్లో 10మంది విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులే..

మృతి చెందిన వారిలో విజ‌య‌న‌గ‌రం జిల్లా వాసులే ప‌ది మంది ఉన్నారు. బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గం బ‌లిజ‌పేట మండ‌లం సుభ‌ద్ర గ్రామానికి చెందిన పిరిడి పోలినాయుడు, ఆయ‌న భార్య నారాయ‌ణ‌మ్మ‌, కుమారుడు మోహ‌న్ మృతి చెందారు. నారాయ‌ణ‌మ్మ గ‌ర్భ‌వ‌తిగా ఉన్న‌ట్టు బంధువులు తెలిపారు. చిల‌క‌ల్లిగ్రామానికి చెందిన సాంబ‌య్య‌, పైడ‌మ్మ‌తో పాటు వారి కుమార్తె గౌరి మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు. చిల‌క‌ల్లి గ్రామానికి చెందిన కె.పోలినాయుడు, వెంక‌ట‌ల‌క్ష్మి మృతి చెందారు. వీరి ఇద్ద‌రి పిల్ల‌ల‌ను వూర్లో చ‌దివిస్తున్నారు. త‌ల్లిదండ్రులిద్ద‌రూ చ‌నిపోవ‌డంతో పిల్ల‌లు అనాథ‌ల‌య్యారు. మ‌రో ఇద్ద‌రు యువ‌కులు శంక‌ర్‌, దుర్గారావు మృత‌దేహాల‌ను చివ‌రికి బ‌య‌ట‌కు తీశారు.శిథిలాల నుంచి సుర‌క్షితంగా రేఖ ఆమె కుమారుడు దీప‌క్ బ‌య‌ట‌ప‌డిన‌ప్ప‌టికీ భ‌ర్త శివ మృతి చెందాడు. చ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన శివ కుటుంబంతో వ‌చ్చి కూలీగా ప‌నిచేస్తున్నాడు.

ప్రమాణాలు పాటించకపోవడం వల్లే..

ప్రమాణాలు పాటించకపోవడం వల్లే..

ప్రమాణాలు పాటించకపోవడం, అనుమతులు లేకుండా 180 గజాల్లోనే బహుళ అంతస్తుల భవనం నిర్మించడం, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. సహాయచర్యలను పర్యవేక్షించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి తదితరులను ఘటన స్థలానికి వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భవన నిర్మాణాన్ని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపకమిషనర్‌ మనోహర్‌, ఏసీపీ కృష్ణమోహన్‌లను వెంటనే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గ్రేటర్‌ కమిషనర్‌కు సూచించారు.

 అధికారుల దురాశతోనే..

అధికారుల దురాశతోనే..

ప్రభుత్వం ఎంత కఠిన నిబంధనలు తెచ్చినా కొందరు దురాశతో నిర్మాణాలు చేపట్టి ప్రాణాలు బలిగొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన యజమానిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు సూచించామన్నారు. భవన యజమాని కుమారుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. భవన యజమానికి ఓ మంత్రితో సంబంధం ఉందన్న విమర్శలపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ఏ మంత్రితో సంబంధం ఉన్నా, మంత్రి కుటుంబసభ్యుడైనా బాధ్యులను వదిలేది స్పష్టం చేశారు. ఫిలింనగర్‌ క్లబ్‌ పోర్టికో కూలడం తదితర ఘటనలతో పాఠాలు నేర్చుకుని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

English summary
The toll in the Hyderabad building collapse rose to 11 on Saturday. Rescue authorities pulled out two people from the debris of the under-construction structure. The owner of the seven-storey building has also been arrested, ANI reported. All those caught in the building collapse are workers who lived in its cellar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X