వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌కు పోటీ: తమ్మినేని ప్రకటనలో పస ఎంత?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై పోరాటంలో తామే ప్రత్యామ్నాయంగా మారామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నిజానికి, తెలంగాణలో ప్రతిపక్షాల బలం, పట్టు, సామర్థ్యం ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది. తెరిపి లేకుండా కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ కెసిఆర్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తున్నారనేది చూడాల్సే ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే శక్తులు ఎప్పుడూ ఉంటాయి. ఆ శక్తులకు ఉన్న బలం ఏపాటిదనేది తెలంగాణకు వచ్చే సరికి చర్చనీయాంశంగా మారుతోంది.

కెసిఆర్ వ్యూహం ముందు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కకావికలమవుతున్నాయి. కాంగ్రెసు సీనియర్ నేతలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లోకి వలసలు పోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ఆగినట్లు కనిపిస్తున్నప్పటికీ నోటుకు ఓటు కేసు నుంచి అది ఏ మేరకు బయటపడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నోటుకు ఓటు కేసు తెలుగుదేశం పార్టీని నైతికంగా తెలంగాణలో తీవ్రంగా దెబ్బ తీసింది.

నాయకుల మధ్య అనైక్యత కాంగ్రెసు పార్టీని పట్టిపీడిస్తోంది. సమన్వయం చేసుకుని నాయకులను కలుపుకుని పోవడంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ విఫలమైందనే అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంలో నిజం కూడా లేకపోలేదు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు టిఆర్ఎస్‌ను దెబ్బ తీసే స్థాయిలో లేవనేది తెలిసిపోతూనే ఉంది. అయితే, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేదు. అదే సమయంలో వరంగల్ లోకసభకు జరిగే ఉప ఎన్నిక కూడా వాటి బలాన్ని కొంత మేరకు తెలియజేసే అవకాశం ఉంది.

Will left become a main opposition in Telangana?

కాగా, వామపక్షాలు - ముఖ్యంగా సిపిఐ, సిపిఎం తెలంగాణలో బలంగానే ఉన్నాయి. నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఆ పార్టీలకు చెప్పుకోదగిన క్యాడర్ ఉంది. మొత్తంగా తొమ్మిది వామపక్షాలు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేసే కార్యక్రమాలను తీసుకుంటున్నాయి. ఈ విఫల ప్రయోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగాయి.

సిపిఎం, సిపిఐ తెలంగాణలో వామపక్ష ఐక్యతకు పునాదులు వేయాల్సి ఉంటుంది. కానీ, వివిధ సందర్భాల్లో అవి విభేదించుకుని ఇతర పార్టీలతో సంబంధాల విషయంలో వేరు దారులు పట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా, సిపిఎం, సిపిఐ చేపట్టిన కార్మిక ఉద్యమాలు రాజకీయ రూపం తీసుకోవడం లేదు. ఆర్థిక డిమాండ్లను సాధించుకునే వరకు కార్మికులకు సిపిఐ, సిపిఎంలు ఒక సాధనంగా పనికి వస్తున్నాయి.

వామపక్షాలు మొత్తం దేశవ్యాప్తంగా సృజనాత్మకంగా వ్యవహరించడంలో, ఆ సృజనాత్మక మేరకు ఆచరణను సరిదిద్దుకోవడంలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. అదే తెలంగాణకు కూడా వర్తిస్తుంది. ఆచరణలో మార్పు చేసుకుని, కొత్త శక్తులకు - ముఖ్యంగా తటస్థ మేధావుల సలహాలను పాటించి ముందుకు సాగితే కాంగ్రెసు, టిడిపిలను దాటి వామపక్షాలు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు వచ్చే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి. అయితే, అందుకు వామపక్షాలు సిద్ధపడుతాయా అనేది ప్రశ్న.

English summary
Will left become a main force in Telangana state to fight against Telangana CM K Chandrasekhar Rao (KCR) government?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X