వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నివాళి: తెలుగు కథకు తీరని లోటు

By Pratap
|
Google Oneindia TeluguNews

ప్రముఖ కథా రచయిత ఎన్‌కె రామారావు మరణించారనే వార్త ఓ వెలితిని కలిగించింది. విషాదం కలగడం కన్నా హృదయంలో వెలితి ఏర్పడడం భరించడానికి కాస్తా కష్టమే. ఓ సాహితీవేత్త సహృదయుడు కూడా అయితే ఎలా ఉంటాడో ఎన్‌కె రామారావు అలా ఉండేవారు. మంచి కథా రచయిత మంచి మనిషి కూడా కావడం అరుదైన విషయం. రాసిన కథలు పిడికెడే అయినా పదునైనవీ, ఎల్ల కాలం గుర్తుంచుకునేవి. సమాజం పట్ల నిబద్ధతతో ఆయన కథా రచన చేశారు.

ఆయన కథా రచన రెండు విడతలుగా సాగింది. కాంచనపల్లి చినవెంకట రామారావు, బోయ జంగయ్య వంటి నల్లగొండ జిల్లా సీనియర్ కథరచయితలతో ఆయన ప్రారంభమయ్యారు. వారితో పాటు ఓ విడత కథలు రాసి ఆ తర్వాత వదిలేశారు. నేను నల్లగొండకు వెళ్లిన తర్వాత తిరిగి కథా రచన ప్రారంభించారు. నేను ఆంధ్రప్రదేశ్ టైమ్స్ అనే ఆంగ్ల పత్రికకు నల్లగొండ జిల్లా కరస్పాండెంట్‌గా వెళ్లాల్సి వచ్చింది. నాకు ఇంగ్లీష్ వాక్య రచనలో అంతగా ప్రావీణ్యం లేదు. దాంతో మిత్రులను అడిగితే ఇద్దరి పేర్లు చెప్పారు. ఒకరు నల్లగొండ కోర్టులో సూపరింటిండెంట్‌గా పనిచేస్తున్న ఎన్‌కె రామారావు కాగా, రెండోవారు జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న బైరెడ్డి కృష్ణా రెడ్డి.

వారి వద్ద ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించి ఇంగ్లీష్ జర్నలిజంలోకి వెళ్లిపోవాలని నేను పథకం వేసుకున్నాను. ఆ ఉద్దేశంతోనే వారిద్దరితో పరిచయం పెంచుకున్నాను. ఆ పరిచయం సన్నిహిత స్నేహంగా మారిపోయింది. నా ఇంగ్లీష్ భాషాభ్యసనం పక్కకు పడిపోయి, బైరెడ్డి కృష్ణా రెడ్డి కవిత్వం రాయడం, ఎన్‌కె రామారావు కథలు రాయడం ప్రారంభించారు. అలా నా వ్యూహాన్ని దెబ్బ కొట్టినవారిలో రామారావుగారు కూడా ఉన్నారు.

Homage: A creative short story writer and good human being

బైరెడ్డి కృష్ణా రెడ్డి ఆంగ్ల కవిత్వం గురించి చెబుతుంటే, రామారావు గారు కథల గురించి చెప్పేవారు. దేశదేశాల కథల గురించి అత్యంత ఆసక్తికరంగా ఆయన చెబుతూ ఉండేవారు. కథారచనలోని మెలుకువలు కూడా ఆయన మాటల్లో ఉండేవి. కథలు రాయడంలోనే కాదు, కథలు చెప్పడంలో కూడా రామారావు దిట్ట. ఆయన దేశవిదేశాల్లోని ఉత్తమ కథల గురించి చెబుతుంటే ఏ మాత్రం విసుగు వచ్చేది కాదు.

రామారావు మంచి హాస్యప్రియుడు. హాస్యం ఆయన నోటి వెంట ఆయాచితంగా జారిపడేది. హాస్యం, వ్యంగ్యం ఆయన చాలా ఇష్టం. అందుకే ఆయన శ్రీరమణను చాలా ఇష్టపడేవారు. అలాగే, బాపురమణల జంటకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడు. బాపు రామారావు బొమ్మ కూడా గీశారు. ఆయన విద్యుల్లత కథాసంపుటికి కవర్ పేజీ బొమ్మ కూడా గీసి పెట్టారు. కవర్ పేజీల బొమ్మలు గీయడం మానేసిన తర్వాత బాపు రామారావు కోసం ఆ పని ప్రత్యేకంగా చేసి పెట్టేవారంటే ఆ అభిమానం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ముళ్లపూడి రమణ రచనలను విపరీతంగా అభిమానించేవారు. వ్యంగ్య, హాస్య కథలు కూడా రామారావు రాశారు. అయినా, ఆయన తన సామాజిక నిబద్ధతను వదిలిపెట్టలేదు.

ఆయన కథలు చెప్పడం గురించి అనుకున్నాం. విప్లవ గేయం రాసిన ఎన్‌కె అనుకుని తనను పోలీసులు నిర్బంధించిన తీరు, తాను తిరిగి బయటకు రావడానికి చేసిన ప్రయత్నాలను ఆయన అత్యంత ఆసక్తికరంగా చెప్పారు. అలాగే, శ్రీశ్రీ, రావిశాస్త్రి నల్లగొండకు వచ్చినప్పటి వివరాలను కూడా కథలు కథలుగా చెప్పేవారు. రావిశాస్త్రి రాచకొండ చూద్దామని పట్టుబడితే వెళ్లారట. తమ పూర్వీకుల నివాసం ఈ రాచకొండనే అని రావిశాస్త్రి చెప్పారని రామారావు చెప్పారు. ఆ ఉదంతాన్ని రాయాల్సిందిగా నేను సుప్రభాతం ఎడిటర్‌గా ఉన్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి పెడితే రామారావు రాసిచ్చారు.

సాహిత్యలోకానికి సంబంధించి ఆయనకు కచ్చితమైన ఇష్టానిష్టాలుండేవి. శిల్పం లేని కథలను ఆయన ఏ మాత్రం అంగీకరించేవాడు కాదు. రచనలోనే కాదు, వ్యక్తిత్వంలోనూ నిండుతనం ఉండాలని ఆయన భావించేవారు. ఆయన లోటు భర్తీ అయ్యేది కాదు. అంతటి పదునైన రచయిత తెలుగు సాహిత్య లోకంలో చాలా అరుదు. అయన రాసిన కథలు తక్కువే అయినా, గంగిగోవు పాలు గరిటెడు చాలు అనే రీతిలో ఆస్వాదించవచ్చు.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
Homage: A creative short story writer and good human being
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X