వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెలివాడ రాసుకున్న వ్యథాక్షరం.. నినదించే దళిత ధిక్కారం: డా.పసునూరి రవీందర్‌తో ఇంటర్వ్యూ..

ఇవాళ రాజ్యాధికార కాంక్ష అంటే.. అధికారం చుట్టూ తిరగడానికి అలవాటుపడ్డ సమూహాలకు, అగ్రవర్ణాలకు ఉన్న కాన్షియస్ వేరు.

|
Google Oneindia TeluguNews

తకతా లెల్లె లెల్లే అరితా లెల్లే మా లెల్లే... అనాది రాగాల ఉచ్ఛరణకు కొంటెతనమేదో అడ్డం పడింది. వేల ఏండ్ల మూలవాసి చరిత్రను కనికట్టు చేసిన మాయా సాహిత్యం పొరలుపొరలుగా బహుజన చూపును కమ్మేసిన చోట.. అద్.. గదిగో.. ఇప్పుడో ధిక్కారం.. మాటతో..పోరాటంతో పదునుదేలిన అక్ష‌రంతో.. 'పసునూరి రవీందర్'

కూలీ కుటుంబ నేపథ్యమే.. అయితేనేం.. తన జాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన అక్షరం పసునూరి సొంతం. ఉద్యమాలు.. యూనివర్సిటీల వీధుల గుండా పిడికిలెత్తి తన అస్తిత్వాన్ని నినదిస్తున్నాడు. పిడికెడు ఆత్మగౌరవం నుంచి మొలకెత్తి.. వేల పిడికిళ్లతో రాజ్యాధికారం దిశగా కదులుతున్నాడు.

పసునూరి గమనాన్ని.. లక్ష్యాన్ని.. తనదైన వ్యక్తీకరణతో మీ ముందుంచే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ..:

Interview with Bahujan writer Pasunuri Ravinder

పుట్టి పెరిగిందంతా చారిత్ర‌క వ‌రంగ‌ల్ గ‌డ్డ మీదే..
ఎదిగొచ్చింది ఉద్య‌మాల‌ సాంస్కృతిక నేపథ్యం నుంచి..
ఇప్పడు బహుజన అస్తిత్వ ఉద్యమంతో ప్రయాణం..
ఈ మొత్తం ప్రయాణంలో మీకు కనిపించిన వైరుధ్యత.. ఇప్పుడు మీకున్న స్పష్టత?..

1920ల కాలంలో ఎంఎన్ రాయ్ వంటి వ్యక్తులు భారతదేశంలో మార్క్సిజాన్ని అప్లై చేసే ప్రయత్నం జరిగింది. అయితే ఇవాళ మార్క్సిజం అనేది అగ్రవర్ణాల చేతుల్లోకి పోయింది. ఆ అగ్రవర్ణాలకు ఊడిగం చేసేటటువంటి వారిగా మార్క్సిస్టులు తయారైన్రు.

1920 నుండి నేటిదాకా చూసుకుంటే.. మార్క్సిస్టు సిద్దాంతానికి-కార్యాచరణకు నడుమ చాలా అగాథం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.

... ....

ఇక బ‌హుజ‌న‌ ఉద్యమాల గురించి మాట్లాడేటప్పుడు అస్తిత్వ‌ చైతన్యం అనే మాట ఉపయోగించడం పట్ల నాకు అభ్యంతరం ఉంది. అస్తిత్వ‌వాదాల ప‌రిధి విశాల బ‌హుజ‌న నేప‌థ్య‌ పరిధిని కుదిస్తుందనే నేను భావిస్తున్నా..

నాకు తెలిసి తెలుగు సమాజంలో అస్తిత్వ ఉద్యమాలకు 40ఏళ్ల చరిత్ర ఉన్నది. అది స్త్రీవాదం కావచ్చు.. దళితవాదం కావచ్చు.. తెలంగాణవాదం కావచ్చు.. ఏదైనా..

... ఈవిధంగా చూసుకున్నప్పుడు మహాత్మపూలే 1870నాటికే అద్భుతమైన కావ్యాలు రాసిండు. దాన్ని అస్తిత్వ వాదంగానే చూడలేం. బుద్దుడి నుంచి అంబేడ్కర్ దాకా మూలవాసులు రాస్తూ వచ్చిన సాహిత్యానికి ఓ సుదీర్ఘమైన సాంస్కృతిక చరిత్ర ఉన్నది. కాబట్టి దళిత సాహిత్యాన్ని ఆ కోణంలో చూడాలె.

..... ....

అన్ని దశలు దాటి ఇప్పటి దృష్టి నుంచి చూసినప్పుడు.. మనువు వారసులకు.. మూల వాసులకు మధ్య జరుగుతున్న ఉద్య‌మ‌మే ఈ దేశ చ‌రిత్ర‌... ఈ పాయింట్ బేస్ నుంచి చూస్తే మనకు సమాజం స్పష్టంగా అర్థమవుతుంది.

ఆఫ్రికన్ రచయిత చినువా అచెబి ఒక మంచి మాట చెప్పిన్రు..

'సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనన్ని రోజులు
వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది'

.. కాబట్టి రెండు వేల ఏళ్లుగా చరిత్రపై బ్రాహ్మణవాదులు చేసిన కుట్ర తెలియంది కాదు. బ‌హుజ‌న జాతుల‌ చరిత్రను అంగీకరించే ప్రజాస్వామిక దృష్టికి వారికి లేదు.

ఇక్కడొక మాట చెప్పాలె..

రెండున్నర పర్వాలు అనువదించిన నన్నయ్యను ఆదికవిని చేసిన్రు. శ్రీశ్రీని మహాకవిగా మన ముందు పెట్టిన్రు. దళితుల మీద, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మీద ఒక్క అక్షరం కూడా రాయని శ్రీశ్రీని నరనరాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేసిన్రు.

ఒక విషయం గమనిస్తే..

శ్రీశ్రీ శ‌త జయంతి.. సుద్దాల హన్మంతు శ‌త‌జయంతి ఒకే సంవ‌త్స‌రం అయినప్పుడు శ్రీశ్రీ ఎందుకు మీకు గుర్తున్నడు? సుద్దాల హన్మంతు ఎందుకు గుర్తులేడు?

Interview with Bahujan writer Pasunuri Ravinder

మూలవాసులకు-మనువు వారసులకు మధ్య పోరాటం
అంటున్నారు కాబట్టి.. దీనికి మీరిచ్చే డెఫినిషన్?

సింధు హరప్ప నాగరికత నిర్మాతలు మూలవాసులు.
యురేషియా ప్రాంతం నుంచి వచ్చి, ఇక్కడున్న మూలవాసులను దొంగదెబ్బ తీసి.. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవారు ఆర్యన్లు. భార‌త దేశ ఆదిమ‌కాలంలో కులం లేదు వాస్తవానికి.., బ్రాహ్మ‌ణీయ మ‌నువాద వ్య‌వ‌స్థ‌ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక రిలీజియన్ అవసరం అనేది గుర్తించి చాతుర్వర్ణ వ్యవస్థను ముందుకు తీసుకొచ్చిన్రు.

మూలవాసులంటే.. జాంబవంతుని వారసులని,
వాళ్లు హిందువుల్లో భాగమనేనని, వాళ్లంతా కచ్చితంగా బొట్టు పెట్టాలె అని.. ఇట్లా చాలా రకాలుగా సామాజికవేత్తల పేరిట కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నరు.. ఇదే ముసుగులో క్రైస్తవ, ముస్లిం వ్యతిరేక ప్రచారం కూడా జరుగుతున్నది. దీనికి మీరేమంటరు?

పుక్కిటి పురాణాలతో కింది కులాలను తమ ఆధిపత్యానికి అట్టిపెట్టుకునే క్రమంలో భాగంగా చరిత్రను వ్ర‌కీక‌రించే కుట్ర ఇది. దళితుల జీవితం ఈనాడు ఇట్లా తయారవడానికి కారణం.. హిందూ మతమే. కాబట్టి హిందు మతాన్ని వీడాలన్నాడు బాబా సాహెబ్ అంబేద్క‌ర్‌...

వీహెచ్‌పి, ఆర్ఎస్ఎస్ క్రైస్తవ, ముస్లిం మతాల మీద వ్యతిరేకతను ప్రచారం చేసే కుట్ర చేస్తున్నయ్. బహుజనులంతా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలె.. తిప్పికొట్టాలె..

బుద్దుడు ప్రతిపాదించిన స్వేచ్చ-సమానత్వం-సౌభ్రాతృత్వం అనే విలువ‌ల ప్రాతిపదిక మనకు ఉన్నది కాబట్టి దాన్ని ప్రధానంగా చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరమున్నది.

Interview with Bahujan writer Pasunuri Ravinder

నేపథ్యం:

అమ్మ-నాయిన‌ వరంగల్ గ్రీన్ మార్కెట్లో కూలీలు.
హమాలీగా మారడం కన్నా ముందు మా నాయిన‌ రిక్షా తొక్కేటోడు. మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడవద్దని అమ్మ-నాయిన‌ మమ్మల్ని స్కూల్ కు పంపించిన్రు.

మా అమ్మ ఒక మాట చెప్పేది..
'మనకు ఆస్తులు అంతస్తులేమి లేవ్ బిడ్డా..చదువే బువ్వ పెడ్తది' అని..

మా నాయ్న కూడా ఎప్పుడూ ఒక మాట చెప్పేది..
'మంచిని పదిచ్చి కొనుక్కోవాలె.. చెడును పది ఇచ్చయినా వదులుకోవాలె' అని..

అట్లా.. అమ్మ-నాయ్న చెప్పిన మంచి మాటలు నాకు తర్వాత్తర్వాత ఉపయోగపడ్డయ్.

.... .....

నేను పుట్టి పెరిగిన శివనగర్ లో సీపీఐ, సీపీఎం ప్రభావం ఎక్కువ. అట్లా విప్లవోద్యమాలను, అభ్యుదయ వాదాలను చాలా దగ్గరగా చూసినవాడిని నేను. వాళ్లతో కలిసి మెలిసి తిరిగినవాన్ని.

Interview with Bahujan writer Pasunuri Ravinder

సాహిత్యంతో పరిచయం.. పాటగాడిగా మారడం..
వీటి గురించి?..

మా అమ్మ జాన‌ద‌ప గాయ‌కురాలు. అట్లా నాకు పాట వారసత్వంగా వ‌చ్చింది. బతుకమ్మ పాటలు, జానపదాలు పాడుతుండేది అమ్మ‌. ఒకరకంగా మౌఖిక సాహిత్యంతో అది నాకు తొలి పరిచయం. రాయడం, పాడటం రెండూ కూడా స్కూల్ స్థాయి నుంచే ఉన్నయ్.

మా గల్లీలో ఉండే లోకల్ పాలిటిక్స్ ను జాగ్రత్తగా గమనిస్తున్న క్రమంలో.. అప్పట్లోనే నాకు తోచిన విధంగా ఏవో నాలుగు లైన్లు రాసుకున్న. ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టు పార్టీలతోను పాటగాడిగానే మొదలైన.

సాహిత్యం గురించి చెప్పాలంటే.. కాకతీయ యూనివర్సిటీలో చేరినంక పుస్తక ప‌ఠ‌నం అలవాటు చేసుకున్న. 2002లో ఎంఏ తెలుగు చదువుతున్న సమయంలో.. అప్పటికే డిగ్రీ స్థాయిలో సాహిత్యాన్ని చదవడం, రాయడం అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 'upper cast dominated literature'నుంచి కథా సాహిత్యాన్ని విపరీతంగా అధ్యయం చేసిన.

2002లో వలస పక్షులు మొదటి నా కథ..

... .... ...

హెచ్.సి.యూలో చేరిన తర్వాత బహుజన సాహిత్యానికి.. వామపక్ష అభ్యుదయ సాహిత్యానికి మధ్య ఉన్న తేడాను గుర్తించగలిగిన. బహుజన సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు.. అందులో ఒక ఆర్తి, ఆవేదన మనకు కనిపిస్తది. కాబట్టి.. మున్ముందు బహుజన సాహిత్యానికి నావంతుగా కృషి చేయాల్సిన అవసరమున్నది.

సాహిత్యంలో పలానా వస్తువునే స్వీకరించాలన్న స్పృహ ఎట్లా కలిగింది?

వరంగల్ వైపు ఉన్న వాతావరణం ఈ విషయంలో నాకు ఉపయోగపడింది. డిగ్రీలో అభ్యుదయ, విప్లవ సాహిత్యాన్ని చదువుకున్న. ఎట్లుండేదంటే పరిస్థితి.. అభ్యుదయం, విప్లవం అనే కోణంలో
మనల్ని ట్యూన్ చేసేస్తరంతే.

అలాంటి ఒక దశ నుంచి వచ్చిన నేపథ్యంలో.. నా కోణం నుంచే రాసుకోవాలె.. అనుభవానికి దగ్గరగా ఉండేటువంటి రచన చెయ్యాలె అన్న స్పృహ కలిగింది. నేనొక ప్రశ్న అడుగుతున్నా.. 'wounded people life' సాహిత్యానికి రాయదగ్గ వస్తువు కాదా?.. అది గుర్తించాలె.

Interview with Bahujan writer Pasunuri Ravinder

'కులం' అనేదొక నగ్నసత్యం అన్నది మీ కథల్లో చాలా స్పష్టంగా కనిపిస్తది..
అయితే కథలన్ని 'కులం' చుట్టూ అల్లుకున్నవే ఉండాలా? అన్న విమర్శ కూడా మీపై ఒకటున్నది!.. దాని గురించి?..

మిగిలిన రచయితలు ఎట్లనన్న రాసుకొనియ్.. వేల ఏళ్లుగా అంట‌రానిత‌నాల్ని, అవ‌మానాల్ని భ‌రిస్తుంటే, నేను రాసిన కొన్ని రచనలకే బెంబేలెత్తిపోతున్నరా?.. నేనేమంటున్నా అంటే.. అసలు మేం ఏం రాయాల్నో చెప్పడానికి వాళ్ల‌కు ఏం హ‌క్కు ఉంది?

ఓ మంగళి వ్యక్తి ఆయన బాధల గురించి కష్టాల గురించి రాసుకుంటడు.. ఇంకేదో కులపు ఆయన తన బాధలను తాను పడ్డ కష్టాల గురించి రాసుకుంటడు. వాళ్లను రాయొద్దంటే ఎట్లా?.. దళిత బహుజన సాహిత్యంలో వస్తువు-శిల్పం గురించి మాట్లాడుకున్నప్పుడు వస్తువే ముఖ్యమని చెప్తా.

బేసికల్ పాయింట్ ఏందంటే.. సమాజాన్ని మనం చూసే దృష్టి మీదనే ఇదంతా ఆధారపడి ఉంటది. నాది స్పష్టమైన పూలే-అంబేడ్కర్ దృష్టి. కాబట్టి వాస్తవాలను విస్మరించి గాల్లో మేడలు నిర్మించడమనేది అసాధ్యం అన్న విషయం గుర్తించాలి.

Interview with Bahujan writer Pasunuri Ravinder


తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 'లడాయి'(కవిత్వం) తీసుకొచ్చిన్రు.
బహుజన మూమెంట్ లోకి వచ్చాక 'అవుటాఫ్ కవరేజ్ ఏరియా...ఆ త‌రువాత తెలంగాణ ఉద్య‌మపాట ప‌రిశోధ‌న‌....
రచనా ప్రక్రియ ఏదైనా సరే.. పలానా రచన చేసే ముందు మీ లోపల మొదలయ్యే ఆలోచన ఎట్లా ఉంటది?

ఏ రచనకైనా సరే కొంతమంది సెలక్టెడ్ రీడర్స్ ఉంటరు. నాకున్న చరిత్ర రీడర్స్ బహుజనులు. కాబట్టి వాళ్లను ఎడ్యుకేట్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను రచనలు చేస్తుంటా. అట్లాగే నాకన్నా ముందు రాసినవాళ్లను inspiration గా తీసుకుని రచనలు చేస్తా.

... ... .....

యాక్టివిజమ్, రచనా ఈ రెండూ చాలా ఇంపార్టెంట్. రెండూ జాతిని ముందుకు నడిపించేవిగానే ఉండాలె.

తెలంగాణ వచ్చిన తర్వాత కవులు, రచయితలకు
ఒక శూన్య స్థితి ఉన్నదనే మాట ఎక్కువగా వినిపిస్తున్నది.
కొంతమంది తప్పుకున్న పరిస్థితి కూడా.. దీని గురించి?

డెఫినెట్లీ.. తెలంగాణ వచ్చిన తర్వాత కవులు, రచయితలు రెండు శిబిరాలుగా విడిపోయారు. ఒకరు ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి, ప్రభుత్వ ప్రయోజనాల మేరకే రాస్తున్నరు. కొంతమంది వీఆర్ఎస్(స్వచ్చంద విరమణ) తీసుకున్నరు. నేనీ వీఆర్ఎస్ మాటంటే చాలామందికి కోపమొస్తంది..(నవ్వుతూ...)

తెలంగాణ రావడంతోనే పనైపోలేదు. ఇంకా ఎక్కువగా ప్రజల తరుపున నిలబడాల్సిన అవసరమున్నది. తెలంగాణ ఉద్యమంలోను మనం కోరుకున్నదేంది?.. 'సామాజికి తెలంగాణ' కావాలనే అనుకున్నాం.. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నాం..అందుకు కార‌ణం తెలంగాణ‌లో బ‌హుజ‌నుల జ‌నాభా 93 శాతం. అగ్ర‌వ‌ర్ణాలు కేవ‌లం 7శాతమే.

తెలంగాణ వచ్చాక జరిగింది కేవలం ఆంధ్రా అగ్ర కుల వర్గాల నుంచి తెలంగాణ అగ్ర కుల వర్గాలకు అధికార బదలాయింపు మాత్రమే. కాబట్టి దళిత బహుజనలు అధికారంలోకి వస్తేనే అసలైన సామాజిక తెలంగాణ సాధ్యమవుద్ది.

అందుకే మేం బ‌హుజ‌న ర‌చ‌యిత‌ల సంఘం పెట్టినం(డా.జిలుక‌ర శ్రీ‌నివాస్‌గారు, నేను ఇంకా కొంత‌మంది మిత్రులం). ఈ సంఘం ఆధ్వ‌ర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల్లో 'బహుజన సాహిత్యం-రాజకీయ విముక్తి ' పేరుతో స‌ద‌స్సులు పెడుతున్నం. ఈ ప్రయాణంలో.. ఏం రాస్తున్నవ్? ఎందుకు రాస్తున్నవ్? ఏ దృక్పథంతో రాస్తున్నవ్?.. ఇవి మూడు చాలా ముఖ్యం అని బోధిస్తున్నం.

ఇప్ప‌టిదాకా తెలుగు సాహిత్యంలో ప్రామాణికంగా తీసుకుంటున్నవంటి తూనికరాళ్లు కోస్తాంధ్ర మూలాల్లో ఉన్నాయి. అందుకే కిందికులాల సాహిత్యానికి ఎంతో అన్యాయం జ‌రిగింది. కాబట్టి ఇక్కడ అంబేడ్కర్ చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలె..

'ఆటలో గెలవాలంటే ఆటగాళ్లను మార్చడం కాదు..
ఆట రూల్స్ నే మార్చాలి..'

Interview with Bahujan writer Pasunuri Ravinder

రాజ్యాధికారమే అన్ని సమస్యలకు అంతిమ పరిష్కారం అంటున్నరు కదా..
వాస్తవ పరిస్థితులను గమనిస్తే.. నిజంగా కిందికులాలకు రాజకీయ కాంక్ష ఉన్నదా?

బాబాసాహెబ్ అంబేడ్కర్ ఏం చెప్పిన్రు..

'రాజ్యాధికారం లేని జాతులు త్వరగా ఉనికిలో లేకుండా పోతాయి..' అని. ఇవాళ రాజ్యాధికార కాంక్ష అంటే.. అధికారం చుట్టూ తిరగడానికి అలవాటుపడ్డ సమూహాలకు, అగ్రవర్ణాలకు ఉన్న కాన్షియస్ వేరు. దళిత బహుజనులకు ఉన్న దృక్పథం వేరు.

ప్రస్తుతం తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్నటువంటి దశలో బహుజన దృక్పథం నుంచి రాజ్యాధికారం దిశగా సమాయత్తం కావాల్సిన అవసరమున్నది.

అస్తిత్వ ఉద్యమాలకు రాజకీయ పునాది.. సాంస్కృతిక నేపథ్యం, అది అందించే చైతన్యం..
కానీ సాహిత్యాన్ని-రాజకీయాన్ని ముడిపెట్టి చూడవద్దు అన్నప్పుడు మీ స్పందన?

'ది కల్చరల్ మూమెంట్స్ విల్ లీడ్ పొలిటికల్..' అంబేడ్కర్ చెప్పిన మాట ఇది. కాబట్టి సాంస్కృతిక చైతన్యాన్ని విస్తరించే పరిధిలో కచ్చితంగా రాజకీయ లక్ష్యంతోనే పనిచేస్తం. రాజకీయాలకు ముడిపెట్టకుండా ఏ విషయమూ ఉండదన్న సంగతి ముందు గుర్తించాలె.

బ్రాహ్మణీయులకు ఆ స్పృహ ఉండబట్టే కదా.. వేల ఏళ్లుగా వాళ్ల సాహిత్యాన్నంతా మన నరనరాన ఇంకించిన్రు. అందుకే సాహిత్యం-రాజకీయం రెండూ వేర్వేరు కాదని చెప్తా నేను. ప్రతీ బహుజన రచయిత రాస్తున్నదంతా రాజకీయమే.

అరిస్టాటిల్ ఒక మాటంటడు.. 'మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ అనిమల్' అని.
కాబట్టి శుద్ద రాజకీయం, శుద్ద సాహిత్యం రెండూ వేర్వేరుగా ఉండవు. దూరం ఉంటే ఎప్పటికీ దూరంగా ఉండేవాడిగానే మిగిలిపోతవ్ తప్ప ఇంకేమి ఉండదు. రాజకీయ స్పష్టత లేని సాహిత్యం ప్రజలకు మేలు చేయదు.

'కులం' గురించి మాట్లాడుకుంటున్నప్పుడు..
దళితులు కుల వివక్షను అగ్ర వర్ణాల నుంచి గాక బీసీల నుంచి కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి..
దీన్నెట్లా చూడాలె?

భారతీయ సమాజంలో బీసీల జనాభా ఎక్కువ. కానీ దామాషా ప్రకారం వారికి దక్కాల్సిన వాటా దక్కట్లేదు. ఈనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలిస్తే.. దేశంలో 85శాతం జనాభా వారిదే. అదే తెలంగాణకు వస్తే.. 93శాతం. ఇందులో బీసీలు 51శాతం.

కాబట్టి దళిత బహుజనల మధ్య ఐక్యత సాధించడానికి చ‌రిత్ర‌ను తెలుసుకోవాలి. చ‌రిత్ర‌లో బ‌హుజ‌నుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని తెలుసుకుంటే చాలు, మ‌నమంతా ఒక్క‌టే అనే ఫీలింగ్ ఏర్ప‌డుతుంది. అలాగే కల్చరల్ మూమెంట్స్ దోహదపడుతయ్. చదువుకున్న సామాజిక స్పృహ అందరిలో వచ్చిననాడు ఐక్యత అనేది సాధ్యమవుతది. బీసీలకు దళితులు తమ స్నేహితులే అన్న సంగతి తెలియాలె.

ఉత్తరప్రదేశ్ లో కాన్షీరాం.. 'మేమెంతనో మాకంత వాటా' అన్న ప్రాతిపదిక ఎంత విజయం సాధించిందో తెలిసిందే. కాబట్టి ఇదంతా జరగాలంటే ముందు బహుజనులు తమ చరిత్రను తాము తెలుసుకోవాలి. నిజమైన చరిత్రను ప్రచారంలోకి వచ్చిననాడు ఐక్యత సాధ్యపడుతది.. ఇందుకోసం మేం బహుజన రచయితల సంఘంగా పనిచేస్తున్నాం.

తొలి కవితా సంపుటి లడాయి గురించి.. :

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో నేను తెలంగాణ ఉద్య‌మ కాలంలో జాయింట్ యాక్షన్ కమిటీకి కో-కన్వీనర్ గాను.. సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆవిర్భావంలోను కీలక పాత్ర పోషించాను. 2009లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కాలంలో హెచ్.సి.యూ లో రాసిన దీర్ఘకవిత 'లడాయి'. అయితే ఇందులోను గమనించాల్సిందేంటంటే.. బహుజన దృక్పథం నుంచి చూసేటువంటి సోయి దీనిలో కనిపిస్తది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. అప్పటి ఆకాంక్షలకు ప్రతికూలతలు ఏర్పడుతున్న తరుణంలో.. 'లడాయి ఇంకా మిగిలే ఉంది' పేరుతో మరో క‌వితా సంపుటిని పబ్లిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నా..

Interview with Bahujan writer Pasunuri Ravinder


కవిత్వం-కథ రెండు ప్రక్రియల్లోను సృజన చేస్తున్న వ్యక్తిగా..
ఈ రెండింటి మధ్య ఉన్న విలక్షణత గురించి చెప్పండి?

కవిత్వమనేది తక్షణ స్పందన. గాఢత ఎక్కువ..
కథకు విస్తృతి ఎక్కువ.. ఒక జీవితం మొత్తాన్ని క‌థ‌లోకి తీసుకురావ‌చ్చు. ఓ ముగింపు ఇవ్వవచ్చు.

ఉదాహరణకు నా అవుటాఫ్ క‌వ‌రేజ్ ఏరియా క‌థ‌ల్లో పెంజీకటి అనే కథ ఉంది. ఇందులో 'రామస్వామి' కథను మూడు భాగాలుగా రాసిన. అదే కవిత్వంలో రాయాల్సి వస్తే.. దానికొక ముగింపు లేకుండా కొనసాగించాల్సి వస్తది.

Interview with Bahujan writer Pasunuri Ravinder


దళిత బహుజన సాహిత్యం కథ రూపంగా కన్నా..
కవిత్వ రూపంలోనే ఎక్కువగా వ్యక్తమవుతున్న పరిస్థితి?

దళితుల్లో అక్షరాస్యత శాతం తక్కువ.. అందులో సాహిత్యంలోకి వచ్చేవాళ్లు ఇంకా తక్కువ. ఆసక్తితో వస్తున్నవాళ్లను సరిగా నడిపించలేకపోతే వారికి అభిలాష ఏర్పడదు.

ఇక కవిత్వ రూపమే ఎందుకు ఎక్కువ వస్తుంది? కథారూపం ఎక్కువగా ఎందుకు రావట్లేదు అంటే.. కథ రాయడానికి కొంత స్థిమిత వైఖరి కావాలె. వ‌న‌రులు లేక‌పోవ‌డం వ‌ల్ల‌ దళితుల జీవితం స్థిమితంగా, కుదురుగా ఉండదు. అయితే వేముల ఎల్లయ్య, గోగు శ్యామల, జూపాక సుభద్ర వంటివారు ఆ లోటును తీర్చినవారే.

Interview with Bahujan writer Pasunuri Ravinder

దళిత బహుజన సాహిత్య పరంపరలో..
ఒక మద్దూరి.. ఒక కలేకూరి.. ఒక కొలుకలూరి.. ఒక ఎండ్లూరి.. ఇప్పుడు 'పసునూరి'..?, మిమ్మల్ని అదే లైన్ లో భావించవచ్చా?

అయ్యో.. అట్లేమి లేదు. వాళ్లంతా చాలా చేసిన్రు. నేను చేసింది చాలా తక్కువ. వాళ్లు తమ జీవితాలను సైతం ధారపోసి ఎంతో రాసిన వ్యక్తులు. నేను ఇంకా స్టార్టింగ్ స్జేజ్‌లోనే ఉన్నా. నాది నేర్చుకుంటున్న ద‌శ‌. కాబట్టి వాళ్లతో నన్ను నేను పోల్చుకోవడానికి ఇష్టపడను. కానీ వాళ్లను ఆదర్శంగా తీసుకుని ముందుకుపోతా..

ప్రపంచీకరణ సాహిత్య విమర్శ(ఎం.ఫిల్) చేసిన్రు..
తెలంగాణ ఉద్య‌మ‌పాట మీద (పీహఎచ్.డి) చేసిన్రు..
ఒకటేమో చిధ్రమవుతున్న పల్లె జీవన వ్యథ.. ఇంకొకటి అస్తిత్వ వ్యథ..
దీని గురించి..?

ఇవి రెండూ రీసెర్చ్ బేస్డ్ వ‌ర్క్సే..

తెలంగాణ పాటను అగ్రవర్ణ కోణం నుంచి చూస్తే.. వేరుగా కనిపిస్తది. దళిత కోణం నుంచి చూస్తే వేరుగా కనిపిస్తది. ప్రపంచీకరణ విషయానికొస్తే.. గ్లోబలైజేషన్ కన్నా ముందునుంచే తెలంగాణ పల్లె ధ్వంసమైపోయింది.

పాట గురించి చెప్పాలంటే.. ఉద్యమం ఉన్నప్పుడు పాట పదునుదేలి ఉంటది. అందుకే ఇప్పుడు మళ్లీ అంత శక్తివంతమైన పాట పుట్టట్లేదు. పాటగాళ్లు కూడా అదే భావనలో ఉన్నరు. కళాకారులు మెల్లమెల్లగా ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న పరిస్థితి.

Interview with Bahujan writer Pasunuri Ravinder

ఒక బలమైన రాజకీయ తాత్విక పునాది కోసం
'భీమ్ భూమికి జై' లాంటి నినాదాలను కంచె ఐలయ్య లాంటి సామాజికవేత్తలు ప్రతిపాదించారు. యాక్టివిజమ్ లో స్లోగన్స్ పాత్ర?

నినాదం అనేది బాధిత స‌మూహాల‌కు కొత్త శ‌క్తినిస్త‌ది. తెలంగాణ ఉద్యమంలోను ఆ పని చేసినం. ఇప్పటి సాంస్కృతిక నేపథ్యాలకు అనుగుణంగా నినాదాలు పుట్టుకొస్తయ్. అయితే వాటికొక బేస్.. ఫిలాసఫికల్ డెప్త్ అనేది ఉండాలె. రాజ్యాధికారం దిశగా సాగుతున్నటువంటి క్రమంలో ఆయా సందర్బాలకు అనుగుణంగా వీటిని తీసుకురావాల్సిన అవసరమున్నది.

Interview with Bahujan writer Pasunuri Ravinder

ఈమధ్య చాలామంది గాంధీ-అంబేడ్కర్ మధ్య పోలిక తెచ్చి..
గాంధీ స్వాతంత్య్రం తీసుకురాకపోతే.. అంబేడ్కర్ రాజ్యాంగం రాసి ఉండేవాడా? అని ఆయన్ను కేవలం రాజ్యాంగ నిర్మాత పాత్రకే పరిమితం చేస్తున్నరు.. దీనిపై..?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల తర్వాత.. గడిచిన 20ఏళ్లుగా ఇప్పుడిప్పుడు అంబేడ్కర్ పేరు బలంగా వినిపిస్తున్నది. చాలా ఏళ్లు అంబేడ్కర్ ను పుస్తకాల్లోకి ఎక్కించకుండా కుట్ర చేసిన్రు. ఎక్కిస్తే.. 'రాజ్యాంగ నిర్మాత' అని ఆయన చేసిన కృషిని కుదించి అక్కడికే పరిమితం చేసే కుట్ర చేసిన్రు.

ఒకప్పుడు అంబేడ్కర్ ను దళిత నాయకుడు అన్నరు. ఇప్పుడు రాజ్యాంగ నిర్మాత అంటున్నరు. ఇక్కడినుంచి ఇంకొంచెం ముందుకు పోవడానికి సమయం పడుతది.

Interview with Bahujan writer Pasunuri Ravinder

హేతువాద మార్గంలో నడిచి.. హిందుయిజంలోని
మూఢ విశ్వాసాలను ప్రశ్నించినందుకు.. ధబోల్కర్, పన్సారే, కల్బుర్గీ లాంటి వారిని హత్య చేసిన పరిస్థితి. హిందుయిజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న క్రమంలో.. మీరెదుర్కొంటున్న ప్రతికూలతలు?

ఎదుర్కోవడమే మా పని కదా..(న‌వ్వుతూ)

నా కథలు దిన‌ప‌త్ర‌క‌ల్లో ప్రచురితమైనప్పుడు.. ఒక్కోసారి 100-200 ఫోన్‌కాల్స్ వస్తయ్. అప్పుడు నా క‌థ‌లోని ప్రతినాయకుడి కులానికి చెందిన సామాజిక వ‌ర్గం వారు, ఆయా కులానికి ప్రతినిధులం అని చెప్పుకునేవాళ్లు ఫోన్లు చేసి బెదిరించడం చాలాసార్లు జరుగుతూనే ఉంది.

సభలల్లో ప్రసంగిచేటప్పుడు.. నేను ప్రస్తావించే అంశాలను తట్టుకోలేనివారు లేచి నిలదీయడానికి ప్రయత్నిస్తరు. అందుకే బహుజన సాంస్కృతిక ఉద్యమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా.. దేనికైనా సిద్దమే.

మీకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు
దేశమంతా 'మత అసహనం' మీద గొడవలు జరుగుతున్నయ్..
చాలామంది రచయితలు అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్న పరిస్థితి..
వీటి నడుమ మీరు అవార్డు స్వీకరించడానికి సంఘర్షణ పడలేదా?

నా దృష్టిలో అవార్డులు అనేవి చాలా చిన్న విషయం. ఆచరణే అన్నింటి కన్నా ముఖ్యమని భావించే వ్యక్తిని నేను. అయితే అప్పుడున్న పాలిటిక్స్ ను వ్యతిరేకించడానికి అవార్డులను వెనక్కి ఇచ్చేసిన వారిమీద నాకు గౌరవం ఉంది. అదొక నిరసన రూపం.

గమనించాల్సిందేంటంటే.. చాలా ఏళ్లుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు దళితులు 'అవుటాఫ్ కవరేజ్ ఏరియా' గానే ఉన్నరు కదా.. రాక రాక చిన్న అవార్డు వస్తే.. దాన్ని స్వీకరించకుండా ఎట్లా ఉంటం..

మత అసహనం, గో రక్షక సమితి దాడులు, బీఫ్ బ్యాన్ కు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేసినం. అమలాపురంలో దళితుల మీద దాడి జరిగినప్పుడు స్వయంగా వెళ్లి దాన్ని నిరసించినం. కాబట్టి దళిత బహుజనులను ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు సాగడమే ప్రధాన ధ్యేయం. ఈ క్రమంలో అవార్డులనేవి చిన్నపాటి గౌరవం లాంటివని భావిస్తా తప్ప అంతకుమించి ఇంకేమి లేదు.

Interview with Bahujan writer Pasunuri Ravinder

పుస్తకాలు-దుస్తులు.. ఆత్మగౌరవం విషయంలో ఈ రెండింటికి
అంబేడ్కర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సింబాలిక్ గా మీరు కూడా కోటు ధరించడం వెనుక మీ ఉద్దేశ్యం?

బట్టలే లేని తనం నుంచి ఆత్మగౌరవంతో నిలబడే ప్రయత్నంలో ఎవరికంటే తక్కువ కావద్దనే ఉద్దేశ్యమే కోటు ధరించడానికి కారణం. కోటు కార్పోరేట్ కల్చర్ అని విమర్శించేవాళ్లు కూడా ఉంటరు. అలాంటివారు పైపైనే కాదు, లోపలి వ్యక్తిత్వాన్ని కూడా చూడాలె. సూట్‌ని నేను సెల్ఫ్‌రెస్పెక్ట్‌లో భాగంగా చూస్త‌.

రచనా ప్రక్రియ కావచ్చు.. రాజ్యాధికారం దిశగా ప్రయాణం కావచ్చు..
బహుజన రచయితల సంఘం నుంచి
ఇప్పటిదాకా ఇంకా బలమైన స్త్రీ గొంతుక రాలేదనే అనిపిస్తున్నది?

కొత్తగా రాస్తున్నవాళ్లతో మరింత చైతన్యంతో రాయించే ప్రయత్నం చేస్తున్నం. కానీ బయటవున్న కొన్ని ప్రభావాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తోన్న మాట వాస్తవం. సావిత్రిభాయ్ పూలే వారసత్వాన్ని కొనసాగించడానికి రానున్న రోజుల్లో తప్పకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తాం.

బహుజన సాంస్కృతిక ఉద్యమంలో అగ్రవర్ణాలను కూడా కలుపుకుని పోవచ్చు కదా? అన్న విమర్శ ఉంది కదా.. దాని గురించి..

ముందు అగ్ర‌వ‌ర్ణాలు డీ-క్యాస్టిఫై కావాలె.
మానసిక పరివర్తన అనేది అగ్రవర్ణాల్లో జరగాలె. వేల ఏండ్లుగా తాము పెత్తనం చెలాయించిన సమూహాల్లో పుట్టామనే ఎరుక ఉండాలె. అవుటాఫ్ కవరేజీ ఏరియా సంపుటిలోని చాలా కథలను కొంతమంది డీ-క్యాస్టిఫై అయిన అగ్రకులాల వారు అక్కున చేర్చుుకున్నరు.

పుట్టుక మన చేతుల్లో లేదు..అని చేతులు దులుపుకోవ‌డం ఎస్కేపిజం అవుతుంది. కానీ ఆచరణ మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి బాధితుల పక్షాన నిలబడి వారు దాన్ని ఆచరించి చూపించినప్పుడు కచ్చితంగా మీరన్నట్టు జరుగుతది.

Interview with Bahujan writer Pasunuri Ravinder

ఎస్సీ వర్గీకరణపై మాలల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఓవైపు మీరు బహుజనలందరిని ఐక్యం చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో..
మాలల నుంచి నిరసన గళం వినిపించడం.. మీలో మీకే విబేధాలున్నాయన్న సంకేతాలను బయటి సమాజంకు పంపిస్తే.. అది మీకు నష్టం చేకూర్చడమే కదా?

అంబేడ్కర్ ఇచ్చిన హక్కులు న్యాయంగా అందరికీ దక్కాలంటే వర్గీకరణ తప్పనిసరి. వర్గీకరణ ఉద్యమం అనేది ప్రజాస్వామిక ఉద్యమం. 23ఏళ్ల పోరాట చరిత్ర దానికున్నది. వర్గీకరణే ఐక్యతను పెంచుతదని బలంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి గతంలో కన్నా ఇప్పుడు మాలల్లోను వర్గీకరణ మద్దతుదారులు పెరిగిన విషయాన్ని కూడా గుర్తించాలె.

సాహిత్యం, ఆక్టివిజం రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్న‌రు?

నాకు ఈ రెండూ ముఖ్య‌మే. నా జాతుల‌ను న‌డిపించ‌డం కోసం నేను ఈ రెండింటిని నా జీవనవిధానంలో భాగం చేసుకున్నాను. దీని వ‌ల్ల నేను చాలా సంఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాను. అయినా స‌రే మ‌నం జీవించి ఉన్న కాలంలో మ‌నం చేయాల్సిన‌ ప‌ని స‌మ‌ర్ధ‌వంతంగా చేయాలి. అందుకోసం కొన్ని కోల్పోవ‌డానికి కూడా నేను సిద్ధ‌మే !!

Inteview by: శ్రీనివాస్ సాహి

English summary
Pasunuri Ravinder is a new expression in Telugu dalith bahujan literary. Its an interview with him regarding his entire life journey
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X