సెటై'రిషి'360డిగ్రీలు..

Subscribe to Oneindia Telugu

వ్యంగ్యం అనగానే తెలుగులో దానికి కేరాఫ్‌గా కనిపించే పేరు పతంజలి. డొల్ల రాజకీయాల పేగుల్లో నిక్షిప్తమైన కుళ్లు కుతంత్రాలను తనదైన వ్యంగ్యంతో ఉతికారేశారాయన. ఆయనకు ముందు గురజాడ రాసిన కన్యాశుల్కం తెలుగులో ఓ గొప్ప వ్యంగ్య భాష్యం. రచనాశైలిలో పతంజలి, గురజాడ ఇద్దరూ కథనాత్మకతను అనుసరించినవారే. ఇటీవల చింతపట్ల సుదర్శన్ వెలువరించిన.. సుదర్శన్ సెటైర్స్@తెలంగాణ.కామ్ కూడా ఇదే కోవలోనిది.

అలా కాకుండా ఒక్క వాక్యంలో విషయాన్ని తేల్చిపారేసిన వ్యంగ్యం తెలుగులో అంతగా రాలేదనే అనుకుంటా.. వచ్చినా ఒక పుస్తకంగా మాత్రం వెలువడలేదేమో! కానీ ఇన్నాళ్లకు ఇంగ్లీష్ హ్యూమరిస్ట్ మార్క్ ట్వెయిన్ సెటైర్‌ను తలపించేలా తెలుగులోను ఓ ఏకవాక్య సెటైరిస్ట్ పుట్టుకొచ్చాడు.

జీరో డిగ్రీ వద్ద వలపోతగా మొదలై.. జీవితంలోని 360డిగ్రీలు వ్యంగ్యాన్ని విస్తరించిన ఆ సెటై'రిషి' మోహన్. పరధ్యానం లాగే వ్యంగ్యధ్యానం అనేది మోహన్‌లో ఓ నిరంతర అంతర్లీన ప్రక్రియ. కాబట్టే అలవోకగా అప్పటికప్పుడు సెటైర్ పుట్టించగల సమర్థుడు.

Review on Mohan Rishi's Dimag Kharab book

మోహన్ రుషిలో సెటైర్ అసువుగా పుట్టుకొస్తుందా? అన్న ప్రశ్న వచ్చినప్పుడు.. ఊహ చేయడం.. దాన్నో వ్యూహంలో ఇరికెంచేయడం.. ఆయనకు ఊతప్పతో పెట్టిన విద్యేమో అనిపించింది(సరదాగా..). రోడ్డు మీద నడుస్తున్నప్పుడు.. బస్సులో కండక్టర్ అరుస్తున్నప్పుడు.. ఇలా రకరకాల సందర్భాల్లో.. బహుశా మోహన్‌లో వాస్తవ దృశ్యానికి బదులు వ్యంగ్య దృశ్యమొకటి పరావర్తనం చెందుతుందేమో!. అందుకే క్షణాల వ్యవధిలో ఆయన సెటైర్ల మీద సెటైర్లు పుట్టించేయగలడు.

ఇందులో విచిత్రమేమిటంటే.. నిజానికి వ్యంగ్యానికి బాధితుల సంఘం తప్పకుండా ఉంటుంది. కానీ మోహన్ రుషి సెటైర్‌కు బాధితులు కూడా నవ్వకుండా ఉండలేరు. ఆవిధంగా తన వ్యంగ్యానికి అందరిచేత సమర్థన పొందినవాడు. ద్వంద్వార్థమంటే బూతే అని జనం ఫిక్సయి పోయిన తరుణంలో.. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా క్వాలిటీ సెటైర్స్ ద్వారా ద్వంద్వార్థాన్ని పలికించారు మోహన్. సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలన్నింటి పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతలు ఉన్నట్లే.. ఫేస్ బుక్‌లో మోహన్ ఇప్పుడో వ్యంగ్యాత. నాకు తెలిసి తెలుగులో ఇలాంటి పనిని ముందేసుకున్నది మోహన్ ఒక్కరే. సున్నితమైన భావోద్వేగాలను కవిత్వంగా మలిచిన మనిషి.. ఇంత క్వాలిటీగా సెటైర్ రాసిన సందర్భాలు అరుదేమో!. ఆవిధంగా మోహన్ రుషి బహుముఖీనుడు. వచనాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో నైపుణ్యం సంపాదించినవాడు.

*మోహన్ రుషి 'దిమాఖ్ ఖరాబ్' పుస్తకం చదవుతున్నప్పుడు.. ఓ తెలుగు సినిమా డైలాగ్ గుర్తొచ్చింది.

'కోత మొదలైంది.. రాత రాసిన బ్రహ్మదేవుడు దిగొచ్చినా కాపాడలేడు'.. ఇదీ ఆ డైలాగ్.

కానీ, ఇదే డైలాగ్ మోహన్ రాయాల్సి వస్తే.. ఇలా మారిపోతుందేమో!.. 'రాత మొదలైంది.. ఎంతటి కోతలరాయుడైనా వ్యంగ్యం కొక్కేనికి వేలాడాల్సిందే'.

దడదడలాడించే డైలాగ్ నైనా తన వ్యంగ్యంతో కుయ్యి కుయ్యిమంటూ మూలిగే స్థాయికి దించగలడు మోహన్. 'సమయం లేదు మిత్రమా.. మరణమా.. శరణమా!' అన్న డైలాగ్‌ను మోహన్ రుషి వ్యంగ్యంగా మలిచిన తీరు ఇందుకు నిదర్శనం. సమయం లేదు ప్రేక్షకుడా.. ! అంటూ.. సదరు సోకాల్డ్ డైలాగ్‌ను సోయి తప్పేలా ఉతికేశాడు.

మైకుల ముందు.. మాటల్ని బౌండరీలు దాటించే రాజకీయ నాయకుల ప్రేలాపనల్ని సైతం మోహన్ తన వ్యంగ్యార్కర్‌లతో క్లీన్ బౌల్డ్ చేశాడు. శుక్రవారం తక్కెడలో తూకం తేలిపోయిన సినిమాల్ని అదే వ్యంగ్యంతో బ్యాలెన్స్ చేసి భళా అనిపించాడు.

"రోజుకు 18గంటలు కష్టపడుతున్నాం.. మైకులు పట్టుకుని.."
"బిచ్చగాడు బ్రహోత్సవం చేసుకోవడం.. బ్రహోత్సవం ప్రొడ్యూసర్ బిచ్చగాడవడమే జీవితం.." అన్న సెటైర్స్ పైన చెప్పుకున్న విషయాలకు సరిగ్గా సరిపోతాయి.

చివరగా చెప్పొచ్చేదేంటంటే!.. వ్యంగ్యానికి వెటకారానికి మధ్య తేడా స్పష్టంగా గుర్తెరిగినవాడు కాబట్టే.. మోహన్ రుషి వ్యంగ్యం ఎవరి మనోభావాలను ఢీకొట్టలేదు. దీనికి మరో కారణం.. అందరి మనోభావాలకు దగ్గరగా ఈ వ్యంగ్యం చేరుకోగలగడమే. ఎంతటి నిర్వేదంలో ఉన్న మనిషైనా.. ఒక్కసారి ఈ పుస్తకాన్ని అలా తిరగేస్తే.. కోల్పోయిన నవ్వుల స్థానంలో కొన్ని కొత్త నవ్వుల్ని భర్తీ చేసుకోగలడు. అందుకు 'దిమాక్ ఖరాబ్'కు అది పురుడు పోసుకున్న మోహన్ రుషి దిమాక్‌కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేం.

                          థ్యాంక్యూ మోహన్ రుషి భయ్యా...

-శ్రీనివాస్ సాహి

'దిమాక్ ఖరాబ్'లోంచి మచ్చుకు కొన్ని సెటైర్స్:

మీరంత నెగటివ్ గా ఉంటే పాజిటివ్ హోమియోపతి ఎలా పనిచేస్తుంది.

తిరుగులేని విజయాలు.. బయట తిరగలేని విజయాలు అని రెండు రకాలు..

అది ఎన్.డి.ఎ జరిపిన డి.ఎ.ఏ టెస్టు

వార్తలో నిజం లేదు.. నిజంలో వార్త లేదు..

ప్రతిపక్ష నాయకుడిగా మన ఎమ్మెల్యేనే పెట్టుకునే వీల్లేదా?

అర్థవంతమైన చర్చల్ని అర్థరాత్రి తర్వాత ప్రసారం చేస్తారు.

ఒంటరి పురుషులకూ ఫించన్లు ఇస్తే బాగుండు..

English summary
Its a review written by Srinivas Saahi on Telugu Poet and Satirist Mohan Rishi's latest book Dimag Kharab.
Please Wait while comments are loading...