వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీవితమే కవిత్వం!

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆత్మవిశ్వాసానికి ప్రతీక రాజేశ్వరి కవిత్వం. సిరిసిల్లాలోని ఆకాశం కింద తొలకరి చినుకు రాజేశ్వరి. తెలంగాణా మట్టితల్లి కన్న మరో ముద్దుబిడ్డ. ఆమె మాటల్లోనే చెప్పాలంటే...

నా రూపాన్ని వైకల్యం చుట్టుకున్నంత మాత్రాన
నాలోని సాహిత్యకళ ఆగదు
వెలుగుతున్న చంద్రునికి కళ్లు లేవు
అయినా వెలుగుతూనే ఉంటాడు
పారే జలపాతానికి కాళ్లు లేవు
అయినా జలజల పారుతూనే ఉంటుంది
నాకు చేతులు లేవు. అయినా కానీ
నాలో కవిత సాగుతూనే ఉంటుంది.ఃః

అభివ్యక్తిలో కొత్తదనముంది. ఆమె పడే మానసిక సంఘర్షణకు నిదర్శనం ఈ కవిత్వం. జీవితం, జీవితానుభవాలు, వేదన, నిర్వేదం, అశాంతి, అలజడి, కన్నీళ్లు, శరీరసహాయ నిరాకరణోద్యమం... ఇవన్నీ రాజేశ్వరి కవిత్వంలో కన్పించే సజీవచిత్రాలు.

ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఆత్మకథే ఇది. జీవితమంతా కవితాత్మగా పరుచుకుని, పాఠకుల్ని వేదనకు గురిచేస్తుంది. ఒకచోట -
నీటిలోని చేప కన్నీరు
ఎవరికి తెలుస్తుంది - అని సూటిగా ప్రశ్నిస్తుంది.

బతుకంతా ఈదుతున్న తనను చేపతో పోల్చుకుని, తనచుట్టూ కన్నీరే నిండివుందన్న ధ్వనిని వినిపిస్తూ, కన్నీరు ఎవరికి తెలుస్తుంది? అని చాలా సునాయాసంగా తేలిక మాటల్తో అనేస్తుంది. ఈ చిన్నారి కవిత్వకూన రాబోయే కాలంలో గొప్ప కవయిత్రి తప్పకుండా అవుతుంది.

పక్షితో, లేగదూడతో, కోకిలతో, సెలయేరుతో తనను పోల్చుకుంటూ, వాటిలో జీవించలేకపోతున్నాను. మనిషినైతే పదిమందికి సాయపడాలి కానీ, సేవ చేయించుకోకూడదు అంటుంది. తెలంగాణా ఉద్యమ పోరాటం మీద రెండు కవితలున్నాయి. బియాస్‌ నది వరదల్లో కొట్టుకుపోయిన 24 మంది గురించిన కవితతో పాటు, ఇటీవలే జరిగిన స్కూలు బస్‌ రైల్వే క్రాసింగ్‌ దుర్ఘటనలో పిల్లల, తల్లుల, తండ్రుల ఆర్తనాదాలను హృదయం కదిలేట్లుగా వర్ణించింది.

Shilalolitha on Siricilla Rajyalakshmi's poetry

తల్లిదండ్రుల కోట్ల ఆశలన్నీ
పుస్తకాల సంచుల్లో మోసుకుని
నవ్వుతూ బస్సెక్కారుఃః అంటుంది.
ఓటమి గురించి రాస్తూ -

ఓటమి అమ్మలాంటిది
దెబ్బ కొట్టినా మళ్లీ జీవితాన్ని ఇస్తుందిఃః అనే జీవన సత్యాన్ని చెప్పింది.

జీవితచక్రంలో వచ్చే రకరకాల బాధ్యతల్నీ, జీవనగమనాన్ని ఏడవ ఎక్కంలో కుదించి చూపింది.

హైకూలలాగా అలవోకగా చెప్పే గుణం ఈమె కవిత్వంలో ఎక్కువ. మచ్చుకి కొన్ని...

మనస్సుకు మబ్బు ముసిరితే కన్నీరవుతుంది
ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది
....జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది

కవిత్వం తనకెంత ఇష్టమో! అసలు తాను కవిత్వమెందుకు రాస్తుందో చాలాచోట్ల వివరిస్తూ పోయింది.

కన్నీళ్లను కలం చేసి / మనసును అక్షరాలుగా మలిచి / బాధను భావంగా తలచి/ రాస్తున్నాను ఈ కావ్యాన్ని / కవిత కోసం నేను పుట్టాను / కాంతికోసం కలం పట్టాను / వడగాడ్పు నా జీవితమైతే / వెన్నెల నా కవిత్వం.

ఈమెలోని ఆప్టిమిజానికి నిదర్శనంగా - చూపుల మధ్య అడ్డు తెరలు తొలగించు / మూసిన మనస్సు కిటికీలు తెరిచి / వెలుతురును ఆహ్వానించు / చీకటి క్షణాన్ని నక్షత్రాలతో మాట్లాడించు / ఒంటరితనాన్ని వెన్నెల దారుల్లో నడిపించు.

చాలావరకు కవిత్వమంతా తనను బాధిస్తున్న మానసిక ఒంటరితనాన్ని జయించడానికే యుద్ధం చేసింది. యుద్ధమన్నాక ఘర్షణ తప్పదు. గెలుపు ఓటములూ తప్పవు. ఐనా ఆమె ఆలోచన ఆగలేదు. శరీరమెంత సహకరించకపోయినా, చేతులు మౌనంగా నిలిచిపోయినా, కాలివేళ్ల మధ్య కలాన్ని ఉంచి కవిత్వమై మనముందు నిలబడింది. ఆమె పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, సాహిత్యకాంక్షకు ఎంతైనా అభినందనీయురాలు. భాషాపాండిత్యమెప్పుడూ కవిత్వం కాదు. కవిత్వానికి చదువుల కొలమానాలు అవసరం లేదు. బతుకు గుహను తొలిచినప్పుడల్లా రాలిపడ్డ రాళ్లముక్కలు, దారులే కవిత్వమై నిలబడిపోతాయి.

బాగా చదువుకున్నామనుకునే కొందరిపై రాజేశ్వరి వ్యంగ్యోక్తి - ఆలోచన లేకుండా అధ్యయనం / చేయడం పరమదండగ / అధ్యయనం చేయకుండా ఊరికే ఆలోచించడం శుద్ధ దండగ

స్నేహమంటే మక్కువ ఎక్కువ. అందుకే చాలా కవితలు రాసింది. ప్రేమ గురించి ఒకచోట - ఃఃప్రేమంటే రెండు కళ్లు - ఒకే చూపుఃః అంటుంది.

కలల గురించి చెప్పినప్పుడు - మనిషి కలలు కనాలి కానీ, ఆ కలలలోనే జీవించకూడదు!ఃః అనే వాస్తవాన్ని చెప్పింది. తన బతుకు కొలిమిలో మండిన బాధలన్నీ, నిజాలన్నీ జీవనసత్యాలై కవితాక్షర దేహాన్ని ధరించాయి.

నిరాశామేఘం తనను కమ్మేసి బతుకుని అంధకారం చేసినా, మబ్బులు తాత్కాలికమని నమ్మి, వెలుగుకోసం నిరీక్షించే సంయమనశీలి ఆమె. తన బతుకు దీపం లాంటిదనీ, దీపం చుట్టూ వెలుగు వున్నా, దానికింద మాత్రం బాధ అనే చీకటే వుంటుంది. ఐనా ఃకవిత్వమే నా తోడుః అంటుంది. దేవుడి వివక్షను, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఃఃపైనున్నవాడా! - అంటూ రెండు కవితల్ని రాసింది. ఃఃరూపంలేని దేవుడు / నా రూపాన్ని ఎందుకు / ఇలా మలిచాడు? - అని సూటిగా ప్రశ్నించింది.

అంగవైకల్యంమీద, ఒంటరితనంమీద, అమ్మమీద, తడి మనసుమీద జడివానలా కురిసే కవితాక్షరాలున్నాయి. ఃఃఋతువులన్నీ మారుతున్నాయి / కానీ నా రూపం మాత్రం మారడం లేదుఃః అంటుందొకచోట. నైరాశ్యం, వేదన పరాకాష్ఠకు చేరిన వేళ సైతం, ఆ ఊబిలోంచి తల బైటికి పెట్టి, రాజేశ్వరి పలవరిస్తుందిలా... "చెట్టునైనా కాకపోతిని పదిమందికి / నీడను ఇచ్చేదాన్ని"

నలుగురితో సంతోషంగా గడపాలన్నదే ఆమె జీవనకాంక్ష. ఃఃనీటిలో బండరాయి / తాను మునుగుతూ / అలలను నిదురలేపినట్టు / నా మనసు ఎంత బాధగా ఉన్నా / పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉంటానుఃః. కలలు కనేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి / కలల తీరం చేరాలంటే / నిప్పుల బాటలో నడవాలి మరి / అక్షరం పక్కన అక్షరం చేర్చి నడిచాను / గమ్యం చేరేసరికి అది మధుర కావ్యమై నన్ను చేరుకుందిఃః.

రాజేశ్వరికున్న ఆలోచనాశక్తి ఎంత పదునైందో, ఆమె వేదన ఎంత బరువైందో, వేదాంత ఛాయలు ఆమెను అలుముకున్న తీరు అబ్బురపరుస్తాయి. "బ్రతకడం వేరు / జీవించడం వేరు / బాధపడటం వేరు / అనుభవించడం వేరు" - అని. మనం సహానుభూతిపరులం మాత్రమే. బతుకుతున్నాం, బాధపడ్తున్నాం. అంతవరకే - కానీ ఆమె మాత్రం జీవిస్తోంది, అనుభవిస్తోంది. ఇంతకంటే ఎవరు మాత్రం ఏం చెప్పగలరు?

చివరగా, స్త్రీల పట్ల వివక్షను, అమానుషాన్ని ప్రశ్నిస్తూ మారని లోకాన్ని విసుక్కుంది. నేతన్నమీద అద్భుతమైన కవిత రాసింది. ఆత్మహత్య నిర్ణయం సరైంది కాదనీ, చేతులే లేని నేను ఎంత జీవనకాంక్షతో బతుకుతున్నాను. చేతులున్న మీరు...

"చిరునవ్వులతో బతకాలి
ఆత్మతృప్తితో బతకాలి
అందరికోసం బతకాలి
అందరినీ బతికించాలి"

- ఈ చివరి కవితా పాదం రాజేశ్వరి మొత్తం కవితాత్మకు తార్కాణం. రాజేశ్వరిలాంటి నిప్పురవ్వలు, జీవితాలు ఎందరికో మరెందరికో ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ, జీవనకాంక్షనీ ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. రాజేశ్వరి కవిత్వం నాలో కలిసిపోయి నిలిచిపోతుందెప్పటికీ...

- డాక్టర్ శిలాలోలిత

English summary
An eminent Telugu literary critic and poet Shilalolitha describes the essence of Siricilla Rajeswari's poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X