వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లంబాహై సఫర్: దిలావర్‌తో ఇంటర్వ్యూ

By Pratap
|
Google Oneindia TeluguNews

దిలావర్‌ సార్‌ని నేనెప్పుడూ 'మామ'గా చూడలేదు. ఆయన కూడా నన్ను స్కైసాబ్‌ అని సంబోధిస్తారు. నన్నొక కవిగానే గౌరవిస్తూ వచ్చారు. ఆయన కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా తన జీవితంలో భాగం చేసుకున్నాడనేది నన్నెప్పుడూ కదిలించే అంశం.

ఆయన ఒక ముస్లింగా, అందులోనూ దూదేకుల కమ్యునిటీ నుండి స్వయంకృషితో ఎదిగొచ్చిన కవి. ఎందరో ప్రముఖ కవులు తన ముందే కవిత్వపు కొత్త పోకడలు అందుకోలేక వెనకబడిపోయినా తాను మాత్రం నిరంతరం తనను తాను రిఫ్రెష్‌ చేసుకుంటూ సరికొత్త కవిత్వం రాస్తూ రావడం వీరిలోని సృజనకారుడి లక్షణం. తెలుగు సాహిత్యంలోని గొప్ప గొప్ప అవార్డు గ్రహీతలకన్నా దిలావర్‌ సార్‌ స్థానం విలువైనది. ఆయన తెలంగాణ కవిత్వం రాశారు, ముస్లింవాద కవిత్వం రాశారు. ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు స్పందించారు. ఎప్పటికప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా కవిత్వం రాస్తూనే వచ్చారు.

ముస్లిం సాహిత్యకారుల్లో స్మైల్‌, ఎమ్‌టి.ఖాన్‌ లాంటి వారిని ఒక వేడుకలాగా గౌరవించుకోలేక పోయామని, వారి భావాలన్నింటినీ ఇంటర్వ్యూల రూపంలో రికార్డు చేయలేకపోయామని బాధనిపిస్తుంటుంది. దిలావర్‌ సార్‌ విషయంలో ఆ వెలితి వెంటాడకూడదనే షాజహానా, షంషాద్‌ సహకారంతో ఆ పని చేయడానికి సాహసించాను.

ఎన్నోమార్లు ఆత్మకథ రాయమని, ఫలానా విషయాలు రికార్డు చేయమని దిలావర్‌ సార్‌ని విసిగించాను. ఎందుకనో ఆయన కొన్నిటిని రాయడానికి ఇష్టపడరు. ఆయన ఎల్లప్పుడూ సృజనాత్మక సాహిత్యాన్ని రాయడానికే ఇష్టపడతారు. జ్ఞాపకాలను రాయడమంటే ఇష్టపడని నైజం ఈ కవిది. దిలావర్‌ సార్‌ను చూస్తే కొన్ని తరాల సాహిత్య సంపదను చూసినట్లు.. ఎన్నెన్నో అనుభవాల గుమ్మిని చూసినట్లు ఉంటుంది.

మొదట్నించి ఆయన చాలా క్రమశిక్షణ పాటించే మనిషి. ఆ క్రమశిక్షణ, అమితమైన ఆత్మాభిమానం షాజహానా, షంషాద్‌ లకు కూడా వారసత్వంగా ఇచ్చారు. ఒక్కమాట పడే తత్వం కాదు. అలాగే ఒక మాట ఎవరినీ అనడం కూడా ఇష్టపడరు.

దిలావర్‌ సార్‌ తండ్రి, తాత, అమ్మ, అమ్మమ్మల నుంచి సంక్రమించిన జీన్స్‌ ఎంత బలమైనవంటే వీళ్లు అన్నదమ్ములు, వీళ్ళ పిల్లలు, చివరికి షంషాద్‌ పిల్లలు సైతం కవిత్వం రాస్తున్నారు.

భారతిలో కవిత అచ్చుకావడమే గొప్ప విషయంగా భావించే రోజుల్లో దిలావర్‌ సార్‌ కవితలు భారతిలో వరుసగా అచ్చయ్యేవట. కాని ఆయన ఏనాడూ తానొక ప్రముఖ కవిననే అహంకారం ప్రదర్శించడం చూడలేదు. ఇప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కవిత రాసినప్పుడు ప్రసవ వేదన పడుతూనే ఉండడం ఆయనలోని జీవ లక్షణం.

దిలావర్‌ సార్‌కు తల వంచి సలాములతో.. 75 వసంతాల ముబారక్‌లతో.. నా తరఫున.. షాజహానా, షంషాద్‌ తరఫున, 'నసల్‌' కితాబ్‌ ఘర్‌ తరఫున ఈ నెల 26వ తేదీన (శుక్రవారం) సభ... లంబా హై సఫర్ కవిత్వ పుస్తకం.. ఆయనతో ఈ సందర్బంగా ఇంటర్వ్యూ

Dr Dilavar

1. మీ సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో మీరు ఎలాంటి ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు?

చాలానే ఎదుర్కొన్నాను. సాహితీ రంగంలో ఉన్నంత మాత్సర్యం మరెందులోనూ లేదనిపిస్తుంది. నా ఎదుగుదల ఓర్వలేని కొందరు మా జిల్లావాళ్ళే నన్ను అణగదొక్కాలని చాలా చాలా ప్రయత్నించి విఫమయ్యారు.

2. మీకు ఇన్సిపిరేషన్‌ ఎవరు? మీరు కవిత్వం రాయగలరని ఎప్పుడు గుర్తించారు? ఎలా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాల్సి వచ్చింది? జిల్లాల్లో ఉండే వారి పట్ల నగరాల్లో చిన్నచూపు ఉండడం నిజమేనా?

-మా తాత, తండ్రుల దగ్గర నుంచి కొంత, ఉపాధ్యాయుల నుంచి కొంత ఇన్సిపిరేషన్‌ పొందాను. అప్పుడు 'తాజ్‌మహల్‌' అన్న పద్యాలు స్కూల్‌ మేగజైన్‌లో అచ్చయ్యాయి. ఆ తరువాత పదో తరగతిలో 'ఆకలి' అన్న కథ అచ్చయింది. స్కూల్లో అంతా పొగడుతూ ఉంటే మరిన్ని రాయాలనుకున్నాను. ఆ దిశలో నా ప్రయాణం మొదలయింది. నిజమే కావచ్చు. నేను మాత్రం నగర కవులతో ఎప్పుడూ చిన్న చూపు చూడబడలేదు.

3. మారుమూల పల్లెల్లో టీచర్‌గా పనిచేస్తూ మీ సాహితీ సేద్యాన్ని కొనసాగించడానికి మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మీ మనసు మీ మాట విననప్పుడు ఏం చేసేవారు? మీ కవిత అచ్చుకు, ప్రచురణకు ఎలాంటి ప్రయాసలు పడ్డారు? ప్రముఖ కవులను కలవడం కోసం, వారి సాంగత్యం కోసం ఎలా తపించేవారు?

-మారుమూ పల్లెటూళ్ళో పనిచేస్తున్నా రాయాలన్న తపన మాత్రం ఉండేది. కీ.శే.సోమసుందర్‌ గారితో పరిచయం పల్లెటూళ్ళో ఉన్నప్పుడే జరిగింది. వారి దిశా నిర్దేశకత్వం నాకు బాగా ఉపకరించింది. మనసు మాట విననప్పుడు పుస్తకాలు చదువుతూ గడిపే వాణ్ణి. నిజానికి కవితల్ని పోస్టు చేయడానిక్కూడా ఒక్కోసారి డబ్బులుండేవి కావు. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా అప్పటి పత్రికలు- ముఖ్యంగా భారతి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రచనలకు పారితోషికాలు కూడా యిచ్చేవి. ఇక మొదటి పుస్తకం వెలుగుపూలు వేయడానికి ఉన్నదాంట్లోనే కొంత కేటాయించ వలసి వచ్చింది. ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా నాలోని 'తపన' ఊర్కోనిచ్చేది కాదు. అలాగే క్రమంగా మరి కొన్ని పుస్తకాలు వెన్నెల కుప్పలు, జీవన తీరాలు, కర్బలా మొదలైనవి ప్రచురించాను.

4. కవిత్వం మీకు ఏమిచ్చింది? మీకేమైనా స్వాంతన నిచ్చిందా? ఎలాంటి అనుభూతులను మీరు మూటకట్టుకోగలిగారు?

-కొంత అశాంతినీ, అలజడినీ, నిద్రలేని రాత్రులనూ యిచ్చినా ఏదో అవ్యక్తమయిన తృప్తి- మానసికానందం మాత్రం కవిత్వం వల్ల కలిగేది.

5. కవులు కాని వారు, ఒక కొత్త ప్రతీక వేయలేనివారు, అధునాతన పోకడ పోలేనివారు కవులుగా చెలామణి అవడాన్ని ఎలా చూస్తారు? అప్పట్లోనే ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడుందా?

-కవులు గానివారు, భాష మీద పట్టు లేనివారు, అసలు కవిత్వమంటే ఏమిటో తెలియనివారు కవులుగా చెలామణి అవుతుంటే, అందలాలు ఎక్కుతుంటే హాస్యాస్పదమనిపించేది. ఏమూలనో కించిత్‌ బాధగా కూడా అనిపించేది.

6. జీవితంలో కవిత్వం సాహిత్యం మీకేమిచ్చిందని భావిస్తున్నారు?

-జీవితంలో కవిత్వం లేదా సాహిత్యం చాలానే యిచ్చింది. మానసిక ఉల్లాసాన్నీ, మానసికానందాన్ని మొదట చెప్పుకోవాలి. కొంత పేరు రావడం కూడా సంతోషకరమే కదా. సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నా గొప్ప ఆనందాన్ని, వికాసాన్ని పొందినట్లు అనిపిస్తుంది.

7. మీ నాన్న, మీ తాత ప్రభావమేదైనా ఉందా మీమీద? వారి జీన్స్‌ ఏమైనా?

-మా తాత మహ్మద్‌ అబ్దుల్‌ నబి సాహెబ్‌. మావూళ్ళో మంచి పేరున్న భూస్వామి. దాంతో పాటు ఆయనకు భారత రామాయణాలు కంఠోపాఠంగా వచ్చేవి. మావూరి పటేలు కూడా ఆయనే కాబట్టి పంచాయతీలు తీర్మానం చేసేటప్పుడు సందర్భానుసారంగా వాటిలోని పద్యాలను ఉటంకించే వాడు. ఇక మా అబ్బాజాన్‌ మహ్మద్‌ నిజాముద్దీన్‌ గారిక్కూడా ఆ విద్య అలవడింది. ఇంకొక్క ఆకు ఎక్కువే చదివాడని చెప్పాలి. భాగవత పద్యాలను కూడా వల్లెవేసేవాడు. నా చిన్నప్పుడు నన్ను కూడా వాటిని కంఠస్థం చేయమనే వాడు. పద్యాలకు అర్ధం చెప్పమని అడిగేవాడు. అట్లా వారివల్ల వారసత్వంగా నాకు సంప్రదాయ కవిత్వం మీద మక్కువ కలిగింది. అదే వారసత్వం నాకు సంప్రదాయ కవిత్వం మీద మక్కువ కలిగింది. అదే క్రమంగా నేను కవిత్వం రాయడానికి దోహదపడింది. వారి జీన్స్‌ నాలో తప్పకుండా ఉంటాయి.

Dilavar poet

8. కాలి నడకన బడికి వెళ్లారు.. పేదరికం చూశారు.. కుటుంబ భారం మోశారు.. వ్యవసాయం చేశారు.. ఉద్యోగం సంపాదించుకొని ఊరూరా తిరిగారు.. ఎంఏ పిహెచ్‌ డీ చేసి లెక్చరర్‌ అయ్యారు.. ఈ అనుభవాలన్నీ మీ రచనలపై ఎలాంటి ప్రభావం చూపాయి?

-ఆ రోజుల్లో మా వూళ్ళో బడిలేదు. నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న డోర్నకల్‌ వెళ్ళి చదువుకునే వాణ్ణి. పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. అప్పట్లో దాశరధి రంగాచారి గారు, శ్రీనివాసాచారిగారు, జార్జిగారు, బెంజిమెన్‌గారి లాంటి గొప్ప ఉపాధ్యాయులు డోర్నకల్‌ స్కూల్‌లో ఉండేవారు. దాశరధి రంగాచార్య గారు తెలుగు భాష మీద మక్కువ కలిగిస్తే మిగిలిన వారు సాంస్కృతిక కార్యకలాపాల్లో యిష్టం కలిగించారు.

ఇక కుటుంబ భారం పెద్ద కొడుకుగా నా మీద పడటం సహజమే కదా. హమాలీగా చేశాను, రైల్వే రైలు కట్టల మీదున్న మోరీలకు కాపలాదారునిగా పని చేశాను. వ్యవసాయంలో మా అబ్బాజాన్‌కు అన్నివిధాలా చేదోడువాదోడుగా నిలిచాను. ఊరూరా తిరిగాను. ఉపాధ్యాయునిగా చేస్తూనే స్వయం కృషితో P.U.C, B.A, B Ed, M.A, Ph D చేశాను. తప్పకుండా ఇవన్నీ నా సాహిత్య సృజనకు ఉపకరించాయి. ఆ అనుభవాలు నా కవిత్వంలోనూ, కథల్లోనూ స్పష్టంగా కనిపిస్తాయి.

9. మీరు చిన్న సన్న విషయాకే సంతోషపడతారు.. త్వరగా సంతృప్తి పడిపోతారు.. ఈ స్వభావం మీ రచనపై ప్రభావం చూపే అవకాశముంది కదా..

-నిజమే. చిన్నచిన్న విషయాలకే సంతోషపడతాను. త్వరగా సంతృప్తి పడిపోతాను. ఈ స్వభావం నా రచనపై తప్పకుండా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు లాభం కలిగిస్తుంది. కొన్నిసార్లు నష్టం కలిగిస్తుంది.

10. మీ కాలం రచయితలంతా ఇంటి, ఒంటి పనుల విషయంలో భార్య మీద ఆధారపడడం ఎక్కువ. మా కాలానికి స్త్రీవాదం, సమానత్వం లాంటివి రావడం మా సమయం ఎంతో కోల్పోతున్నాం కదా.. ఏమంటారు?

-ఇందులో నా శ్రీమతి యాకూబ్బి సహకారం మరచి పోలేనిది. నా సాహిత్య ప్రస్థానంలో ఆమె ప్రోత్సాహం మరువలేనిది. నాతోపాటు పేదరికాన్ని సంతోషంగా భరించింది. ఆమె సాహచర్యమే లేకుంటే నా సాహిత్య ప్రస్థానం కాని, ఉన్నత చదువు కాని సాధ్యపడేవి కావు.

11. మీ అమ్మాయిలు గొప్ప కవిత్వం రాస్తుంటే ఎలా ఫీలవుతున్నారు? షాజహానా కవిత్వం మీద వ్యాసం రాయాలని ఎందు కనిపించింది?

-నా కుమార్తెలు గొప్ప కవిత్వం రాస్తుంటే తండ్రిగా గర్వంగా ఉంటుంది. అనేక అవార్డులూ, రివార్డులూ పొందుతుంటే హృదయం ఉప్పొంగి పోతుంది. అయితే పత్రికల్లో షాజహానా కవిత్వం మీద రావసినన్ని సమీక్షలు రాలేదనిపించింది, జరగవలసినంత చర్చజరగలేదనిపించింది. నేనే రాస్తే బాగుంటుంది కదా! అనుకున్నాను. అందుకే 'మిసిమి'లో ఒక వ్యాసం రాశాను.

12. ఖమ్మం జిల్లాలో అప్పట్లో అంతా పద్యాలు రాస్తున్న కాలంలో ఫ్రీవర్స్‌ రాస్తున్న ఇద్దరు ముగ్గురిలో మీరొకరు.. అలా ఎలా సాధ్యమయింది మీకు?

-ఖమ్మం జిల్లాలో కౌముదిగారు మంచి పేరున్నకవి. వారు తమ యింట్లో సాహిత్య గోష్ఠులు నిర్వహించేవారు. అప్పటికే నేను ప్రగతి మొదలైన పత్రికలో రాస్తున్నాను. అది తెలుసుకొని దావూద్‌గారి ద్వారా నన్ను తన యింటికి ఆహ్వానించారు. అప్పట్నించి ఆ గోష్ఠుల్లోనైతేనేమీ, ఖమ్మంలో జరిగే సభలూ సమావేశాల్లోనైతేనేమి విస్తృతంగా పాల్గొనేవాడిని. అట్లా వచన కవిత్వం మీద మక్కువ కలిగింది.

13. కౌముది, కవిరాజమూర్తి గార్లతో మీ సాన్నిహిత్యం, మరువలేని అనుభవాలు చెప్పండి..

-కౌముది, కవిరాజమూర్తిగారలిద్దరూ నాపై వాత్సల్యం చూపించేవారు. మొదట ఖమ్మం జిల్లాలో ఎదుగుతున్న యువకవిగా నన్ను గుర్తించింది వారిద్దరే. మారు మూల గ్రామమైన కిష్టాపురంలో నా రెండో కవితా సంపుటి 'వెన్నెల కుప్పలు' ఆవిష్కరణకు వారు మిగతా కవులను కలుపుకొని వచ్చి సహకరించిన విషయం ఎన్నటికీ మరచిపోలేను.

14. కవిత్వం గురించి మీరు జెన్యూన్‌గా ఫీయ్యే అంశాలు చెప్పండి..

-మనలోని సంవేదనలనూ, వేదనలను, ఆలోచనలనూ, అనుభూతుల్నీ, ఉద్వేగాలనూ రస, భావయుక్తంగా కవిత్వీకరించడంలో గొప్ప ఆనందముంది. సంక్లిష్ట ఉద్వేగాలనూ, భావాలనూ కవిత్వంలో చెప్పినంత అందంగా మరే యితర ప్రక్రియలోనూ చెప్పలేము.

Dilavar with daughters

15. కవిత్వానికి, కథకు మీ అనుభవంలోంచి వ్యత్యాసం చెప్పండి..

-కవిత్వంలో గాఢత- సాంద్రతతో కూడిన అల్లిక ముఖ్యం. అందువల్ల కొంత అనిర్దిష్టత, నైరూప్యతా ఉండటానికి ఆస్కారముంటుంది. కథకు అలాంటి సంక్లిష్టత అవసరంలేదు. వాస్తవికతను ప్రతిఫలించడంలో ఒక స్నేహితునిలా, సంతోషాన్నీ, ఉద్వేగాన్నీ వివరించవచ్చును. సామాన్య ప్రజానీకానిక్కూడా కథ చేరే అవకాశం ఎక్కువ.

16. ఇప్పటి కవుల్లో మీరు గమనించిన పాజిటివ్‌, నెగెటివ్‌ అంశాలేంటి?

-అస్తిత్వ సృజనే సర్వస్వం అనుకునే వాళ్ళు కొంతమంది. మార్క్సిజమే అన్నిటికీ మందు అనుకునే వాళ్ళు కొందరు. అది ఏ ధోరణి అయినా మానవుని ఉన్నతీకరించేందుకు ప్రయత్నించే పాజిటివ్‌ ఆలోచనల్ని కలిగివున్న కవులు కొందరు.

17. సెల్‌ వాడకమే తెలియని ప్రముఖ కవులెంతోమంది మనకున్నారు.. మీరు ఫేస్‌బుక్‌ కూడా వాడుతున్నారు.. ఏంటి రహస్యం?

-సెల్‌ వాడకమైనా, ఫేస్‌ బుక్‌ వాడకమైనా- వాటిపై యిష్టం పెంచుకోవడమే కారణం. అయిష్టత ఉన్నప్పుడు దేన్నీ సాధన చేయలేం.

18. మీకు నచ్చిన కవులు, వారిలోని గొప్ప గుణాలు చెప్తారా..

-మాకంటే ముందు తరంలో శ్రీశ్రీ, సోమసుందర్‌, సి.నారాయణరెడ్డిగారు, దాశరధిగారు ఇప్పటి తరంలో అఫ్సర్‌, షాజహానా, మందరపు హైమవతి, వర్ధమాన యువతరంలో మెర్సీ మార్గరెట్‌ మొదలైన వారు నాకు నచ్చిన కవులు. ఎందకంటే ఒక్కొక్కరిమీద ఒక్కొక్క పుస్తకమే రాయొచ్చు.

19. నేటి తరం కవులకు మీరు ఇచ్చే సూచనలు.. సలహాలు..

-నేటితరం కవులు నాకంటే ఫాస్ట్‌గానే ఉన్నారు. ఎవరు నమ్మిన ధోరణిలో వారు నిష్ణాతులే. అయితే సరైన అధ్యయనం మాత్రం లేదని ఘంటాపథంగా చెబుతాను. అధ్యయనముంటే ఇంకా అద్భుతమైన సృజన జరుగుతుందని నమ్ముతున్నాను.

20. జీవిత కాలమంతా సాహిత్యంతో నడిచారు.. మీకు సంతృప్తి ఉందా? మీకు రావసినంత పేరు రాలేదనే అసంతృప్తి ఉందా?

-సంతృప్తిగానే ఉంది. పేరును 'అడుక్కొని' తీసుకురాలేంకదా, ఇప్పటికి వచ్చినంత పేరుతోనే తృప్తిపడుతున్నాను.

21. ఇంకా ఏమైనా రాయాలనుకున్నవి, మీరు మాత్రమే రాయగలిగినవి మిగిలిపోయాయనుకుంటున్నారా? రాస్తారా?

-కులీకుతుబ్‌షా ప్రేమను చారిత్రక నవలగా రాయాలని ఉంది. నా ఆత్మకథను కూడా రాసే యోచన ఉంది. నేను మాత్రమే రాయగలిగింది ఉన్నదని అనుకోవడంలేదు.

22. కథను, కవిత్వాన్ని, విమర్శను నిర్వహించారు, ఏది మీకిష్టం...ఇలా రెండు మూడు ప్రక్రియలు నిర్వహించడం మన సృజనను బలహీన పరుస్తుందంటారు...నిజమేనా? ఒక్కదానిపై దృష్టి పెట్టడం వల్ల ఎక్కువ శక్తివంతంగా రాస్తామనేది నిజమేనా?

-మీరన్నది నిజమే, అయినా కొన్ని సమయాల్లో మినహాయింపులు కూడా ఉన్నాయి. గొప్ప కవిత్వం రాస్తూనే గొప్ప వచనం రాసిన వాళ్ళున్నారు. గొప్ప విమర్శను కూడా రాసిన వాళ్ళూ ఉన్నారు. అయితే నా పట్ల మాత్రం మీరు చెప్పింది నిజమే. ఏ ఒక్క ప్రక్రియ మీదో దృష్టి పెట్టి సాధన చేస్తే యింకా బాగా రాసి ఉండే వాణ్ణేమో.

23.మీ పుస్తకాల్లో మీకు ఇష్టమైనది? ఎందుకని?

-నాకు నా పుస్తకాల్లో అన్నీ యిష్టమే. ఎందుకంటే ఏం చెబుతాం? మీ సంతానంలో ఎవరిష్టం అంటే ఏం చెబుతాం? ఒక్కో కారణంతో ఒక్కొకటి యిష్టంపడతాం కదా.

24.మీ పిల్లలు, మీ తమ్ముడు, షంషాద్‌ పిల్లలు సైతం కవిత్వం రాయడం గురించి ఏమంటారు?

-ఏమంటాను? మా పూర్వీకుల నుండి సంక్రమించిన గొప్ప వారసత్వం అన్నితరాల్లో వృద్ధి చెందడం సంతోషంగా ఉంది. తరతరానికి సమున్నతంగా అభివృద్ధి చెందడం చాలా ఆనందంగా ఉంది.

-ఇంటర్వ్యూ: స్కైబాబ

English summary
A prominent Telugu writer has been interviewd on his contribution to Telugu literature and society by another Telugu writer Skybaba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X