వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాలుగు దశాబ్దాల సాహితీ ప్రయాణంతో కరచాలనం: సుంకిరెడ్డితో ఇంటర్వ్యూ

తన సాహిత్య ప్రస్థానం గురించి.. తన జీవిత నేపథ్యం గురించి.. ప్రముఖ కవి, పరిశోధకులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వన్ఇండియా.కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ..

|
Google Oneindia TeluguNews

ఒక గోసను కవిత్వంలోకి ఒలికించిండు.. చరిత్రను సోయికి తెచ్చి తెలంగాణపై తీసికట్టు విమర్శల నోళ్లు మూయించిండు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కవిగా, పరిశోధకుడిగా.. వివిధ రూపాలు మారుతూ.. ఇప్పటికీ అలుపెరగని పరిశోధనతో ముందుకు సాగుతున్నారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి.

డిసెంబర్11న హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నాలుగు దశాబ్దాల సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సాహిత్య సమాలోచన సదస్సు జరుగుతున్న నేపథ్యంలో.. తన జీవిత నేపథ్యం.. తన సాహితీ ప్రస్థానం గురించి సుంకిరెడ్డి వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఈ ఇంటర్వ్యూలో..

<strong>భగవద్గీతకి కుడా ఒక పుట్టిన రోజు</strong>భగవద్గీతకి కుడా ఒక పుట్టిన రోజు

నేపథ్యం :

పుట్టింది నల్గొండ జిల్లా పగిడిమర్రి. మా తల్లి పేరు కోటమ్మ, తండ్రి మాధవరెడ్డి. ఆరో తరగతి దాకా అక్కడే చదువుకున్నా. అప్పుడెట్లుండేదంటే.. అన్ని క్లాసులు ఒకే రూమ్ లో ఉండేది..

sunkireddy narayana reddy interview with oneindia telugu

పుట్టింది అగ్రకులంలో కదా!
ఆరోజుల్లో స్కూల్‌కి ఇతర కులాల వాళ్లు వచ్చేవారా? :

బీసీల్లో అగ్రభాగాన ఉన్న పద్మశాలి, వడ్రంగి, కమ్మరి కులాలకు చెందినోళ్లు ఎక్కువగా స్కూల్ కు వచ్చేది. బీసీల్లో వెనుకబడ్డ కులాలకు చెందినోళ్లు అప్పటికీ బడికి వచ్చుడు తక్కువే. నేను చదువుకున్నప్పుడు మా క్లాస్ లో ఇద్దరు ఎస్సీలు కూడా ఉన్నారు.

మా నాన్నకు అంతగా కుల పట్టింపు ఉండేది కాదు, మా అమ్మ మాత్రం నేనెటైనా బయటికి పోయి వస్తే.. స్నానం చేసినంకనే ఇంట్లకు రానిచ్చేది.

సాహిత్యంతో ఎట్లా పరిచయం?:

సాహిత్య పరిచయమంటే.. నా చిన్నతనంలో అసలు లేదనే చెప్పాలె. నల్లగొండకు వచ్చినంకనే కొంత పుస్తకాలు సదువుడు అల్వాటైంది. అయితే ముందునుంచి తెలుగు భాష మీద నాకు చాలా పట్టుండేది.

sunkireddy narayana reddy interview with oneindia telugu

చిన్నతనంలో శారదగాండ్లు చెప్పే కథలు ఎక్కువగా వినేది.. వాళ్లు చెప్పేది వింటున్నప్పుడు దృశ్యమంతా కళ్లముందు కదలాడినట్టుగనే ఉండేది.

... ...

సాహిత్యానికి సంబంధించి గైడ్ అంటూ ఏమ్లేదు.. కానీ నన్ను కూసోబెట్టుకుని మా అమ్మ కథలు చెప్పేది.. బతుకమ్మ పాటలు బాగా పాడేది.అట్లా నాకు తెల్వకుండానే వాటి ప్రభావం ఏమైనా ఉండవచ్చునేమో!

నల్లగొండకు ఎప్పుడొచ్చారు?:

ఏడు, ఎనిమిది తరగతులు నల్లగొండల్నే చదివిన. అప్పుడే కోమటిరెడ్డి లైబ్రరీలో పుస్తకాలు చదివే అలవాటు ఏర్పడ్డది. పుస్తకాలే లోకం అన్నంతగా చదివేది అప్పుడు. ఎట్లా ఉండేదంటే.. ఇగ నేనెక్కడికి పోయినా.. ఎడ్లకాడికి.. గొర్లకాడికి.. ఏదో ఒక పుస్తకం వెంబడి పెట్టుకపోయేది.

పుస్తకాలు చదవడం మొదలైన తొలినాళ్లలో..
చదివినవి ఏమైనా గుర్తున్నాయా?

అందరు చదివినయే.. నేను చదివిన
బాలమిత్ర, చందమామ, మధుబాబు, షాడో,యుగంధర్.. ఇట్లా..

sunkireddy narayana reddy interview with oneindia telugu

ఒక్కోసారి లైబ్రరీ నుంచి దొంగతనంగా పుస్తకాలు తెచ్చుకుని మరీ చదివేది. చదువుడైనంక మళ్లా లైబ్రరీలో పెట్టి వచ్చేది.

భాష మీద ఎంత పట్టుండేదంటే!:

నేను నల్లగొండలో పదో తరగతి చదువుతున్నప్పుడు నాతో పాటు డిగ్రీ చదివేవాళ్లు రూమ్ మేట్స్ గా ఉండేది. నేనే వాళ్లకు గ్రామర్ చెప్పేది.. అంత పట్టుండేది నాకు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడనుకుంటా. ఓ నాటకం కూడా వేసినం. అప్పుడంతా గోడ పత్రికలే..

నల్లగొండలో ఎవరైనా రచయితల్ని కలవడం,
సాహిత్య కార్యక్రమాలకు వెళ్లడమేమైనా..?

లేదు.. లేదు.. ఎప్పుడు ఎక్కడికి పోలేదు.. అసలు రచయితల గురించి, సాహిత్య కార్యక్రమాల గురించి అప్పటికీ తెల్వదు కూడా. ఇంటర్ లో ఉన్నప్పుడు మా కాలేజీ వార్షికోత్సవానికి రచయిత్రి లతా వచ్చారు. ఓ రచయిత మాట్లాడింది వినడం అదే మొదలేమో!..

ఇంటర్ తర్వాత?

ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ చేయాలన్నది మా నాన్న కోరిక. కానీ నేను డిగ్రీ ఆర్ట్స్ లో జాయిన్ అయిన. కోపంతోని మా నాన్న డబ్బులు కూడా ఇవ్వలేదు. మా అమ్మమ్మ దగ్గర డబ్బులు తీసుకుని డిగ్రీలో జాయిన్ అయిన.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాహితీ ప్రస్థానం:

యూనివర్సిటీలో చేరినంక వామపక్ష భావజాలం బాగా ప్రభావితం చేసింది. సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, జింబో, సలాంధ్ర,కందుకూరి శ్రీరాములు,వారాల ఆనంద్.. లాంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడ్డది. ప్రగతిశీల కవిత్వంతోనే నా సాహితీ ప్రస్థానం మొదలైంది.

sunkireddy narayana reddy interview with oneindia telugu

తొలినాళ్లలో శివారెడ్డి,వడ్లమూడి లాంటి వ్యక్తుల ప్రభావం నా కవిత్వంపై ఉండేది.

పీడీఎస్.యూ,ఆర్.ఎస్.యూ బలంగా ఉండేదప్పుడు..
ఇంటలెక్చువల్స్ అంతా ప్రోగెసివ్ థింకింగ్ తో ఉంటే.. సాంప్రదాయ వాదులంతా ఏబీవీపీలో ఉండేది.

ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండేది?

పేరుకు రెడ్డి కుటుంబమే అయినా.. డబ్బులుండకపోయేది.. ఇంట్లో ఇయ్యకపోయేది. ఆస్తులు ఉంటే ఉండవచ్చు కానీ లిక్విడ్ క్యాష్ ఉండకపోయేది.

1970లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్ మొదలుపెట్టిన్రు కదా!
అది మీ కవిత్వ రచనకు origin అనుకోవచ్చా?

ఇంటర్లో ఉన్నప్పుడు ఓ కవిత రాసినట్టున్నా.. కానీ అంతగా గుర్తులేదు. పీజీలో ఉన్నప్పుడు మా క్లాస్ లో సుభాష్ అనే ఓ మిత్రుడు ఉండేది. అతను పొయెట్రీ బాగా రాసేది. అతన్ని చూసినంక నాకు కూడా రాయాలనిపించింది.

ఆ క్రమంలోనే ఉస్మానియా రైటర్స్ సర్కిల్స్ పెట్టుకున్నం. దానికో ఎజెండా ఉంది.. మార్క్సిస్ట్ దృక్పథం బలంగా నాటుకుపోయి ఉన్న రోజులవి. మార్క్సిజం ఓ అద్భుత ఆలోచన.. అదే ప్రపంచాన్ని మారుస్తుదన్న నమ్మకం బలంగా ఉండేది.

sunkireddy narayana reddy interview with oneindia telugu

అట్లా.. ప్రగతిశీల కవిత్వం రాయాలనే ఉద్దేశ్యంతోనే ఉస్మానియా రైటర్స్ సర్కిల్ ఏర్పాటు చేసినం.

ప్రేమ కవిత్వం ఎప్పుడు రాయాలనిపించలేదా?
ఒక సామాజిక లక్ష్యం పెట్టుకుని పనిచేయడం ఇండ్విడ్వాలిటీని కోల్పోయినట్టు అనిపించలేదా?

కోల్పోయినా పర్వాలేదనే అనుకున్నం..

ప్రేమ కవిత్వం రాయలేదు కానీ ప్రేమ వివాహమే చేసుకున్నరు?
మీ ప్రగతిశీల పంథాకు వివాహం అడ్డంకి అనుకోలేదా?

ప్రగతిశీల కవిత్వం రాసినం కానీ మేం ప్రధాన కార్యకర్తలం కాదు. అట్లానే.. ప్రేమ కవిత్వానికి/సామాజిక కవిత్వానికి వైరుధ్యం ఉంది. కానీ ప్రేమించడానికి, సామాజిక కార్యచరణకు వైరుధ్యం లేదు. పైగా ఇద్దరం కలిసే పనిచేయవచ్చు కదా అనిపించింది.

ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకున్నారా?

లేదు.. మా నాన్న ప్రత్యక్షంగా నాతో చెప్పకపోయినా.. చాలామందితో చెప్పించిండు. నేను మాత్రం ప్రేమ వివాహమే చేసుకున్న. స్టేజ్ మ్యారేజీ.

ఉస్మానియా రైటర్స్ సర్కిల్ తరుపున క్షేత్రస్థాయిలో వర్క్ ఏమైనా..!

చేసినం.. గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసినం.. జలగం వెంకట్రావు మీద కాళోజీ నారాయణరావు పోటీకి నిలబడ్డప్పుడు ప్రజాస్వామికవాదులుగా ఆయన తరుపున సత్తుపల్లిలో ప్రచారం చేసినం.

సాహిత్య కార్యక్రమాలు.. ఎట్లా ప్లాన్ చేసేది?

సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సారస్వత పరిషత్, ఆర్ట్స్ కాలేజీల్లో.. ఎక్కడో ఓ చోట నెలనెలా ఓ సాహితీ కార్యక్రమం పెట్టుకునేది. క్యాంపస్ లో సిధారెడ్డి రూమ్ లో.. చెట్ల కింద కూర్చోని కూడా చాలాసార్లు మీటింగ్స్ పెట్టుకున్నం.

ఏదైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు.. దానికి ప్రచారం కూడా నేనే చేసేది. ఓ 'లై' (గోధుమపిండితో చేసిన జిగురు వంటి) డబ్బా..ఓ సైకిల్ పట్టుకుని కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సారస్వత పరిషత్, ఆర్ట్స్ కాలేజీ, ఇరానీ హెటల్స్ వద్ద గోడ పత్రికలు అతికించేది. ఒక్కన్నే చేసేది.. ఒక్కోసారి యాష్టకొచ్చేది..

ఈతరం యుద్ద కవిత కోసం ప్రయత్నాలు:

ఉస్మానియా రైటర్స్ సర్కిల్ తరుపున ఈతరం యుద్ద కవిత తీసుకురావడం నేనిప్పటికీ గర్వంగా ఫీల్ అవుతా. 1977నుంచి 1983వరకు రైటర్స్ సర్కిల్ బాధ్యతలు నేనే చూసుకున్న. అప్పుడే ఈతరం యుద్ద కవిత తీసుకురావాలని నిర్ణయించుకున్నం.

sunkireddy narayana reddy interview with oneindia telugu

దీనికోసం పేపర్ లో స్టేట్మెంట్ ఇస్తే.. చెత్త కవితలు, మంచి కవితలు చాలానే వచ్చినయి. అయితే అవన్నీ వేస్తే.. సంకలనం చరిత్రలో నిలబడదని అర్థమైంది. ఇగ ఇట్లా కాదని.. నేనే పదేళ్ల క్రితం నాటి డైలీస్ అన్ని తిరగేసి.. అందులోంచి మంచి కవితల్ని కలెక్ట్ చేసి.. ఆ దశాబ్ది కాలంలో వచ్చిన ప్రగతిశీల కవిత్వాన్ని ముద్రించినం.

అప్పట్లో.. డబ్బులకు ఇబ్బందే కదా! సంకలనం ఎట్లా తీసుకొచ్చిన్రు..

యూనివర్సిటీ అడిటోరియంలో ఓ హిందీ సినిమా వేయించినం. టికెట్ ఒక్క రూపాయి. ఆ సినిమాతోని కలెక్ట్ అయిన డబ్బుల్తో సంకలనం తీసుకొచ్చినం. చెరబండరాజు చనిపోయిన తర్వాత మొదటి సంతాప సభ పెట్టి.. దాన్ని ఆయనకు అంకితమిచ్చినం.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మీరు
ఉస్మానియా రైటర్స్ సర్కిల్ ను లీడ్ చేయడం పట్ల అభ్యంతరాలేమి రాలేదా?

లేదు.. అట్లా ఎప్పుడు జరగలేదు.

ఉస్మానియా నుంచి శ్రీకాకుళం :

83లో ఎంఫిల్ కంప్లీట్ చేసినంక క్యాంపస్ నుంచి బయటపడ్డ. 84లో లెక్చరర్ పోస్టు.. శ్రీకాకుళంలో..

... అక్కడికి పోయినంక ప్రగతి సాంస్కృతిక సంస్థ ఏర్పాటు చేసి సాహితీ చర్చలు జరిపేది. అయితే అప్పటికీ కొంత మార్క్సిస్ట్ దృక్పథం నుంచి బయటకొచ్చిన. శ్రీకాకుళంలో ఉన్నప్పుడే 'జముకు' సాహితీ బులెటిన్స్ తీసుకొచ్చినం. 1985లో విపశ్యన తీసుకొచ్చినం. మార్క్సిజం మీద చర్చ లేవనెత్తినం.

తాత్వికత స్తబ్దత.. అభ్యదయ-విప్లవ వాదాలకు ఒక సంధి దశలో, విప్లవ కవిత్వానికి-అస్తిత్వ ఉద్యమాలకు సంధి దశలో విపశ్యన తీసుకొచ్చినం.

శ్రీకాకుళం వెళ్లినంక నేను తీసుకున్న ఫస్ట్ క్లాస్ లో అడిగిన ప్రశ్నలు..

అక్కడ పాఠాలు చెప్పుడు మొదల్వెట్టినంక.. ఫస్ట్ క్లాస్ లోనే అక్కడి స్టూడెంట్స్ ను కొన్ని ప్రశ్నలు అడిగిన. పంచాది కృష్ణమూర్తి, ఆదిభట్ల కైలాసం, ఛాగంటి భాస్కరరావు(ఫస్ట్ ఎన్ కౌంటర్ లో అమరుడు) తెలుసా అని అడిగిన.

అంతా తెలియదనే సమాధానం చెప్పిన్రు. కనీసం ఆ ప్రభావ అవశేషాలు కూడా కనిపించలేదు.

ఏపీసీఎల్సీతో అనుబంధం :

శ్రీకాకుళంలో ఉన్నప్పుడే ఏపీసీఎల్సీతో కలిసి పనిచేసిన. బాలగోపాల్ వచ్చిన తర్వాతే శ్రీకాకుళం, విజయనగరంలో ఏపీసీఎల్సీ పునరుద్దరణ జరిగింది. ఆ క్రమంలో ఓసారి అరెస్టు కూడా అయిన. అప్పుడే అనిపించింది.. మార్క్సిస్ట్ సిద్దాంతం ఫెయిల్యూర్ అవుతుందన్న భావన కలిగింది. సిద్దాంతంలోనే ఏదో ప్రాబ్లమ్ ఉందనిపించింది.

అయితే ఆ ఆలోచన మనసులో ఉన్నా.. వాళ్లతోనే కలిసి పనిచేసిన..

అప్పటికీ రష్యా విచ్చిన్నం, తూర్పు యూరప్ దేశాల పతనం, చైనా సోషలిస్ట్ పంథా నుంచి తప్పుకోవడం వంటి పరిణామాలతో.. మార్క్సిజం అసలు ఇండియాలో సక్సెస్ అవుతుందా అన్న అనుమానం మొదలైంది.

సొంత రచన.. తోవ ఎక్కడ? గురించి కొన్ని మాటలు:

తోవ ఎక్కడ..? విప్లవ కవిత్వానికి భిన్నంగా రాసే ధైర్యంతో చేసిన ప్రయత్నమది. ఇదో నిశ్చయాత్మక సంపుటి అని చెప్పుకోవచ్చు.

నిశ్చయాత్మకంగా రాయడానికి ముందే..
సూర్య కిరణం అన్నిచోట్లకు వెలుగును ప్రసరించిందా?
నడిచొచ్చిన తోవ సరైందేనా?..
అన్న ప్రశ్నలు వేసుకున్న..

శైలిపరంగా తోవ ఎక్కడ..? గురించి:

విప్లవోద్యమం తర్వాత ఓ తాత్విక అన్వేషణ మొదలై.. మార్క్సిస్ట్ సంవేశాల నుంచి బయటకొచ్చాక.. 79-94వరకు వివిధ దశల్లో.. నేను రాసుకున్న పొయెట్రీ అంతా ఇందులో ఉంటది.

'ముల్లుగుచ్చుకున్న పాదమే గొంతు విప్పాలి
అరిటాకు తీర్పు చెప్పాలి..' అన్న ధోరణితో అస్తిత్వవాదాలను సమర్థిస్తూ వెలువరించిన సంపుటి ఇది. అభివ్యక్తి కన్నా వస్తువుకే ప్రాధాన్యం ఇస్తూ రాసిన కవిత్వం.. అయితే శిల్పానికి సంబంధించిన శ్రద్ద కూడా ఇందులో కనిపిస్తది.

మార్క్సిజానికి, అస్తిత్వ ఉద్యమాలకు పొత్తు ఎందుకు కుదర్లేదు?

మార్క్సిస్టులు అస్తిత్వవాద ఉద్యమాలను అంగీకరించలేదు. నా తర్వాత సతీష్ చందర్, జి.లక్ష్మీనర్సయ్య, లాంటివాళ్లు కూడా అంబేడ్కరిజానికి మార్క్సిజానికి పొత్తు కుదర్చడానికి ప్రయత్నం చేసిన్రు కానీ కుదర్లేదు. రెండు వర్గాలు ఒకరిని ఒకరు అంగీకరించలేదు..

ఒకరకంగా క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించలేకపోవడం మార్క్సిస్టుల వైఫల్యమే.

శ్రీకాకుళం నుంచి నల్లగొండకు
మార్క్సిజం నుంచి అస్తిత్వ వాదం వైపుకు..:

మార్క్సిస్ట్ ధోరణిని పూర్తిగా వదిలేసి అస్తిత్వవాదాలను సమన్వయపర్చాలన్న స్పష్టత నల్లగొండకు వచ్చేప్పటికీ నాలో ఉంది. ఇదే క్రమంలో 1996లో నీలగిరి సాహిత్య సమితి ద్వారా బహువచనం సంకలనం తీసుకొచ్చినం.

బహువచనం తర్వాత మీరు కూడా కుల విమర్శ ఎదుర్కొన్నరు కదా?

అది అపోహ మాత్రమే. వ్యక్తిగతంగా, ఆబ్జెక్టివ్ గా నేనెప్పుడూ అగ్రకులం వాన్ని కాదు. భూస్వామ్య వ్యవస్థలో నేనూ ఓ శూద్రున్నే. లీడ్ చేయడం వరకే కానీ అహంభావ ధోరణి ఎప్పుడు ప్రదర్శించలే.. అప్పటికి ఉన్నవాళ్లలో మిగతావాళ్ల కన్నా సంపాదకత్వం వహించడానికి అన్ని అర్హతలు ఉన్నవాడిగా నేనున్నాను కాబట్టి.. లీడ్ చేశాను తప్పితే వేరే దృక్పథం లేదు.

అస్తిత్వ ఉద్యమాలతో తోవ దొరికిందా?

అంతిమ పరిష్కారం లభిస్తుందో.. లభించదో తెలియదు గానీ ఎంతో కొంత పొందడం మాత్రమే సాధ్యమైంది. సాంఘీకంగా.. ఆర్థికంగా.. రాజకీయంగా..

మార్క్సిజం, అస్తిత్వ ఉద్యమం,తెలంగాణ ఉద్యమం..
వీటిల్లో ఎక్కువ సంతృప్తినచ్చింది?

తెలంగాణ ఉద్యమం

అస్తిత్వ ఉద్యమాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మలుచుకోబడుతున్నాయా?

వ్యక్తికి-సమాజానికి మధ్యలో.. సమూహం-కులం-రాజకీయ ఉద్యమం.. ఇట్లా విభిన్నత ఉంటది.
సామూహిక ప్రయోజనాలను కెరీరిజాన్ని ఒక్కటిగా చేసుకున్నప్పుడు ఏ ఉద్యమానికైనా విజయం వర్తిస్తుంది.

1998లో తెలంగాణ సాంస్కృతిక వేదిక:

ఏర్పాటైంది 98 నవంబర్ లో గానీ.. దానికి రెండేళ్ల ముందునుంచే సైద్దాంతిక చర్చలు జరిపినం. అంతకుముందు 92నుంచే నాలో తెలంగాణ సోయి మొదలైంది. ఒకరకంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నేను కొంతముందుగానే గుర్తించిన.

1998లో కాసుల ప్రతాపరెడ్డి, కె.శ్రీనివాస్,అంబటి సురేంద్రరాజు,సిధారెడ్డి కలిసి తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేసినం. దానికో జనరల్ బాడీ ఎన్నుకున్నం. అంబటి సురేంద్రరాజు,నేను,స్కైబాబా,అనిశెట్టి రజిత,మల్లెపల్లి లక్ష్మయ్య జనరల్ బాడీ కమిటీకి ప్రాతినిధ్యం వహించినం.

అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధనే:

తెలంగాణ రాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యంగా తెలంగాణ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేసినం. సాహితీ చరిత్రను పునర్మించాలన్న తీర్మానం, సంకలనం తీసుకురావాలని కూడా తీర్మానం చేసినం. ఇదే క్రమంలో 2002 డిసెంబర్ లో మత్తడి సంకలనాన్ని తీసుకొచ్చినం.

చరిత్ర మీద ఆసక్తి:

నేను డిగ్రీలో ఉన్నప్పటినుంచే చరిత్రమీద విపరీతమైన ఆసక్తి మొదలైంది. 1997లో అనుకుంటా.. అగస్టు/సెప్టెంబర్ లో జరిగిన తెలంగాణ మహాసభలో తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడిన. తెలంగాణ పూర్వరంగం గురించి ఆ ప్రసంగంలో వివరించిన.

జల సాధన సమితిలో ప్రసంగాలు.. వెంచాల జగపతిరావు రచనలు:

ఒకప్పటి కరీంనగర్ ఎమ్మెల్యే వెంచాల జగపతిరావు తెలంగాణకు జరిగిన నీళ్ల అన్యాయం గురించి చదివినంక ఆవేశంతో రగిలిపోయిన. అదే సమయంలో.. జల సాధన సమితితోను పనిచేసిన. దానికి సంబంధించి రచనలు ఏమి చేయలేదు గానీ జలసాధన ఉద్యమంలో ప్రసంగాలు ఇచ్చిన.

ముంగిలి సంకలనం, గనుమ వ్యాసాలు:

క్రీ.శ.1700 వరకు ఉన్న తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ముంగిలి ద్వారా 2009లో తీసుకొచ్చినం. అంతకు సంవత్సరం ముందు నా కవిత్వ సంపుటి దాలి వచ్చింది. అస్తిత్వవాద ఉద్యమాలను బలపరిచేలా 2012లో గనుమ వ్యాసాలను వెలువరించినం.

సాహిత్య చరిత్ర కోసం విపరీతంగా చదవిన..

తెలంగాణకు సొంత చరిత్ర లేదన్న వాదన పరిశీలనాత్మక వాదన కాదని నిరూపించడానికి చరిత్రను పరిశోధించడం మొదలుపెట్టిన. పద్మనాయక యుగం కవులు, కాకతీయుల కాలం నాటి కవులు, కుతుబ్ షాహీ.. అంతకుపూర్వం ఉన్న తెలంగా సాహితి చరిత్ర మొత్తం బయటపెట్టిన.
ఈ క్రమంలోనే క్రీ.శ.1700 వరకు ఉన్న తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ముంగిలిలో.. తెలంగాణ ప్రాచీన కాలం నుంచి 1940 వరకు ఉన్న తెలంగాణ పూర్వ రంగాన్ని.. 'తెలంగాణ చరిత్ర' ద్వారా వెలువరించిన.

తెలంగాణ అస్తిత్వవాదం కేవలం సెంటిమెంట్ కాదని చరిత్ర ఆధారాలు చూపించడంతో.. విమర్శకుల నోళ్లు మూతపడ్డయ్. వాస్తవానికి 69లో మేదావులెవరు రాష్ట్ర పక్షాన లేరు. అరసం వ్యతిరేకించింది.

ఉద్యమ విశ్వరూపం 'దాలి':

తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు-నిధులు-నియమాకాలే ప్రామాణికతగా దాలి దీర్ఘ కవిత వెలువడింది. నీళ్లకు సంబంధించి ఉద్యమ విశ్వరూపం ఇది.

'తెలంగాణ బ్లాంకు చెక్కు
విలువలు రాసేది నీళ్లు
చాటలో పడ్డ బిడ్డకు
రాత రాసే బ్రహ్మ నీళ్లు'

ఇట్లా.. తెలంగాణ నీళ్ల గోస గురించి రాసిన.

అంతకుముందున్న అన్ని కావ్యాలను పూర్తిగా చదివిన కాన్షియస్ నుంచే ఈ దీర్ఘ కవిత తీసుకొచ్చిన. దీర్ఘ కావ్య లక్షణం, అంత:ఏకసూత్ర ఇందులో కనిపిస్తయ్. వివక్షను ప్రతిబింబించేలా రాసిన ఉద్యమ కవిత్వం..

పరిశోధన-విమర్శ:

తెలంగాణ కవులకు సంబంధించిన విమర్శ లేదు. లబ్దప్రతిష్టులైన సినారె, దాశరథి, వంటి అతికొద్దిమంది కవిత్వ విమర్శ మాత్రమే ఎక్కువగా కనిపిస్తది. ఆధునిక కవులు చాలామంది విస్మృతికి గురయ్యిన్రు. కాబట్టి ఆ దృక్పథం నుంచి కొత్తగా ఏమైనా చెయ్యాలె.

దళిత కవిత్వంలో గుర్రం జాషువా గబ్బిలం తరహాలో.. తెలంగాణలో దేవేందర్ అనే తొలి దళిత కవి 'తొండం' అనే కవితా సంపుటి తీసుకొచ్చిన్రు. ఇలాంటి పరిశోధనలను ఇంకా చేయాల్సి ఉంది.

ఉద్యమం తర్వాత తెలంగాణలో
కవులు-రచయితలకు ఒక శూన్య స్థితి ఏర్పడిందా?

ఉద్యమమే ఒక్కటే కాదు.. అట్లనే రాజ్యాన్ని ఎదిరించటం ఒక్కటే కాదు.. జీవిత సంఘర్షణ కూడా కవిత్వ, రచనలుగా మలచబడాలె. మిగతా సాహిత్య ప్రక్రియలకు సంబంధించి చేయాల్సినంత పని ఉంది. ఒకరకంగా సంక్షోభాన్ని ఎదుర్కొనేది కవులు మాత్రమే. అయితే తెలంగాణలో ఇప్పుడు సమస్యలు లేవని కాదు.. అంత విస్తృతిలో లేవు. వాటిని నిశిత దక్కోణంతో గమనించాలె.

ఇప్పటిదాకా, చరిత్ర పరిశోధన, కవిత్వ రచనతో ముందుకు సాగిన్రు.. ఇకముందు..?

పరిశోధన కొనసాగుతూనే ఉంటది. సృజనాత్మక వైరుధ్యం.. ముఖ్యంగా ఆధునిక-అత్యాధునిక విలువల మధ్య ఘర్షణ వైచిత్రిని చిత్రికరించాల్సిన అవసరముంది.

గనుమ తర్వాత రాసిన వ్యాసాలు పుస్తకరూపంలో రాలేదు. వాటిని పుస్తక రూపంలోతీసుకురావాలె.

ఇష్టమైన రచనలు.. ?

శరత్ అనువాద నవల శేషప్రశ్న.. రష్యన్ సాహిత్యం, ది రూట్స్, స్పార్టకస్.. ఇవన్నీ కొంత ఇన్స్పైరింగ్..

చరిత్రకు సంబంధించిన పరిశోధనల గురించి మీరు చాలానే శ్రమిస్తున్నారు. ఇప్పటి యువతరంలో చరిత్ర పరిశోధన గురించి ఆసక్తి ఉందా?

ఇప్పటి తరానికి అసలా ఇంట్రెస్టే లేదు. ఈజీ మనీ తత్వానికి అలవాటుపడిపోయారు కాబట్టి..కష్టపడే తత్వం కన్నా రాత్రికి రాత్రే ఎదగిపోవాలన్న ఆతృతలో ఇప్పటి తరం ఉంది. ఇది కరెక్ట్ కాదు.

కవులకు, రచయితలకు నిర్దేశిత లక్ష్యం ఉండాలా?

ఉండాలన్న నియమం ఏమి లేదు. ఉంటే తప్పులేదు.. కవిత్వం అనేది వేదన నుంచి పుట్టేది..

చివరిగా తెలంగాణ గురించి ఒక్కమాటలో..

రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. కోల్పోయినదాన్ని పూడ్చుకుంటున్నాం..

ప్రభుత్వ గుర్తింపును కోరుకోవడం.. రాజ్యానికి జీర్ణమైపోవడమేనా?

కవులు, రచయితలు కొంత మెత్తబడే ప్రమాదముంది. అయితే అవార్డు తీసుకుని రాజ్యానికి జీర్ణం కాకుండా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. కొంత జాగరుకతతో దాన్ని అధిగమించాలి.

-Inteview by: శ్రీనివాస్ సాహి

English summary
Sunkireddy Narayana Reddy, A well known telangana poet was shared his entire literary journey with oneindia.com
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X