వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాసం: దాశరథి అభివ్యక్తి రీతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Veludanda Nithyananda Rao on Dasarathi
దాశరథి (జ : 22.7.1925, మ:5.11.1987) నవ్యకవితాశరధి. సంప్రదాయం ప్రయోగాలవారిధి. భూతభవిష్యద్వర్తమానాల సమన్వయవారధి. సంస్కృతాంధ్రాంగ్ల ఉర్దూ భాషల సముచిత సరససమ్మేళనా నిధి. దోపిడీపీడనలపట్ల, పరిపాలకుల దౌష్ట్యాలపట్ల ఆయన కవిత్వం ఒక అగ్నిధార. ఒక జ్వాలాలేఖిని. ఆనంద విషాదాలు, అంగార శృంగారాలు, అభినందనం, చైతన్యం, సాంత్వనం, ప్రబోధం, ప్రజాహితం ఆయన కవిత్వపు దినుసులు. పద్యం, గేయం, వచనకవిత, రుబాయి, గజల్‌, ఖవ్వాలి, సినిమాగీతం ఆయన కవితకు వాహికలైన ప్రక్రియలు. నవల, నాటకం, యాత్రా చరిత్ర, బాలసాహిత్యం, అనువాదం వ్యాసం లాంటి గద్య ప్రక్రియలు వారి సృజన పౌరుషానికి ఎత్తిన జయపతాకలు ప్రక్రియ ఏదైనా, పరమార్థమేదైనా చెప్పే విధానం కవితాత్మకం, లయాత్మకం, నవ్యాత్మకం. మనోహరమైన భావుకత, అభివ్యక్తి నవ్యత అడుగడుగున అలరిస్తాయి. దాశరథి అభివ్యక్తి నవ్యత పదప్రయోగంలో, వాక్య నిర్మాణంలో, అన్యభాషా ప్రయోగాల్లో, సమాస చాలనంలో అంత్యప్రాసల్లో, శైలీవిన్యాసంలో, భిన్నభాషల కలగలుపులో వ్యంగ్య అధిక్షేపరీతిలో గమనించవచ్చు.

పాండిత్య ప్రాభవాలు, భావుకత, స్వీయశైలి ఉన్న ప్రతి కవికీ ఒక ప్రత్యేకమైన పదజాలం (ణఱష్‌ఱశీఅ) ఉంటుంది. కొన్ని పదాలమీద వ్యామోహం ఉంటుంది. లేదా ఆ పదాలు అలవాటయిపోతాయి. కొన్ని పదబంధాలను వినూతనంగా కూర్చి శభాషనిపించుకుంటాడు. ఇది ఎంతో సహజం. హృదయాన్ని చకచ్చకితం చేసే దోసెడు కొత్తపదాలను పాఠకుల ఒడిలో పోయగలిగిన వాడే నిజమైన కవి.
పదప్రయోగాలు

దాశరథికి రుధిర శబ్దం అంటే ఎంతో ప్రీతి. రుధిరం దాని పర్యాయపదాలను ఎన్నోసార్లు వాడినట్లు గమనించవచ్చు,

మధువులు పారేచోట రుధిరాలను ధారబోస్తున్నారంటాడు (దా.సా.2పుట.115)
రుధిర సుమాలు క్షుధాజ్వలిత మానవ వ్యధను చెబుతున్నాయట (దా.సా.2 పుట 157)
వ్యధిత జనావళి రుధిరాధరముల చివురించిన యెర్రటి నవ్వుల (దా.సా.2 పుట 206)
ఇంకా రుధిర గంగ, రుధిరపక్షులు, రుధిర నాళాలు, రుధిర సుమమాలిక, త్యాగరుధిర నదీజలాలు, ఎర్రని రుధిరాలపారాణి ఇలాంటివే.

రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్‌ (దా.సా.2పుట 217)
ముక్కలైన గుండెను రక్తంతో అతుకుతున్నట్ట (దా.సా.2 పుట 92)
రక్తాన్ని పీల్చు ధనికే ముక్తాఫలాల మూటా (దా.సా.2 పుట 176)
నర రక్తంలో జలకాలాడే దురాత్ములు (దా.సా.2 పుట 111)
అమాయకుల రక్తధార అధికారుల గళాలపై వజ్రధార (దా.సా.2 పుట 113)
రక్తవాదాలు లేకుండా రక్తపాతాలు రాకుండా చూడాలట (దా.సా.2 పుట 111)
సాంధ్యకాల రక్తారుణచ్ఛటలు
అదా రక్తగంగాతరంగమా

అడుగడుగుకూ మడుగులు కట్టిన యెడద నెత్తురులు వడబోయించి
పక్కుకట్టిన గాయాన్ని నొక్కి నెత్తురు చుక్కలు పిండి పక్కున నవ్వే ఆ నక్కలు...
పాడు నెత్రు, నెత్తుటివరదలు, లక్షగళాల నెత్రు, నెత్తుటి రాగం లాంటి వెన్నో ప్రయోగించాడు.
అనలకేతనం చేతగొని అరుదెంచేదే భవితవ్యం (దా.సా.2 పుట 159)
జ్వాలాసుందరి పెదవిని హాలాచషకంగా భావించుకో (దా.సా.పుట 58)

నల్లవాణ్ణి హత్యచేసే తెల్లవాని ప్రల్లదంవలె

చీకటి నా మీద దాడిచేస్తున్నదా (దా.సా.2 పుట 91)

అంధకారధూమం, తిమిరంతో సమరం, తిమిరలత, కారుచీకటి, పెనుచీకటి, చీకటిచీర, చీకటిదయ్యం, చీకటిరోకలి, చీకటిపొగలు కాంతిపుష్పాలు, అగ్నికుసుమాలు, క్రొవ్వెలుగు, జ్వాలాముఖి, జ్వాలిక, విరహజ్వాల, మధుకీలిక, జ్వాలాలేఖిని వెలుతురుమొగ్గ, వెలుతురులబాకు, జ్యోతిర్నయనాలు, కాంతికవాటం, కాంతినేత్రం, కాంతిరేఖ, కాంతి ప్రాకారాలు, తృష్ణాగ్ని, అగ్నిచేలం లాంటివెన్నో. ఇక ప్రళయాగ్ని, విప్లవాగ్ని, త్రేతాగ్ని, బడబాగ్ని, విలయాగ్ని, అగ్నిసంస్కారం లాంటి పాతపడ్డ ప్రయోగాలను కూడా దాశరథి ఎన్నోసార్లు ప్రయోగించాడు.

విప్లవం అన్నపదం ఆధునిక కవిత్వంలో కొన్ని వందలసార్లు ప్రయోగింపబడి వుంటుంది. కాని ఆ పదానికి ముందు విశేషణాలు వేసి ఏ తీరుగా ప్రయోగించారో వెతకవలసి వుంది. దాశరథి ‘దుర్విప్లవ భుజంగాలు' అని ప్రయోగించాడు. దానిపక్కనే ‘ప్రశాంత కురంగాలు' అని ప్రయోగించి జిగేల్మనిపించాడు. మరోచోట ‘అరుణారుణ విప్లవమేఘం' అని మాట ప్రయోగించారు. విప్లవాగ్ని అని కవులు ప్రయోగించి వుంటారు. కాని దాశరథి విశ్వరుద్ర ఫాలంలో విప్లవాగ్ని విరిసిందన్నాడు.

ప్రజాస్వామ్య సామ్యవాద ధ్వజం ఎగురగలగాలి
ఉగ్రవాద నగ్ననాద రుగ్నబాధ తొలగాలి
శాంతి వేద సౌమ్యవాద కాంతిరేఖ వెలగాలి
అన్నదానిలోను సమాన పద పునరావృత్తి వల్ల కవితా సౌందర్యం సిద్ధించింది.
క్రాంతిపేరిట భ్రాంతిని వ్యాపింపజేస్తూ
శాంతి కపోతాన్ని హంతకులకు చిరుతిండిగా పెడుతూ
మండిపడుతూ జీవిత తటాకాలకు గండికొడుతూ రాశాడు భవిష్యత్తు
ఒకే రకమైన శత్రర్థక క్రియలను పరంపరగా వాడి కవిత్వీకరించడం ఇక్కడ చేసినపని.
అనుప్రాసాత్మకమైన పదాలు వాడి దాశరథి కవిత్వీకరించడం చాలాచోట్ల గుర్తించవచ్చు.
నాకు కావలసింది రెండు కళ్ళు
కరగగల కళ్లు
వెలగగల కళ్ళు
వెలిగించగల కళ్ళు
గుడ్డవిడిచి నడ్డి విరిచి రోడ్డుమీద నడవకు, కవితా తేజోవలయం అవనికాంతికిది నిలయం
కాంతివలయం శాంతివలయం లాంటి వెన్నెంటినో ఉదాహరణలుగా చూపుకోవచ్చు.
రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్‌!
బుర్రలు బుర్రలు పగులక సమస్యకు లేదా సొల్యూషన్‌?
హింసాయుద్ధం ఔట్‌డేటెడ్‌ అని నేనంటాను
శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్‌
సమమాత్రాకంగా సాగిందనడం కన్నా పాఠకునకు ఒకే తీరుగా ఉన్న రెవల్యూషన్‌, సొల్యూషన్‌, సాల్వేషన్‌ అన్న ఆంగ్ల పదాల మీద దృష్టి కేంద్రీకరించబడుతుంది. దాశరథి కవితా కాసారంలో ఆంగ్లపదాలే కాదు ఉర్దూపదాలు సైతం యథేచ్ఛగా విహరిస్తాయి.
ఇవి మచ్చుకు మాత్రమే. దాశరథి పదప్రయోగ సూచిక తయారుచేయవచ్చు.
సమాసచాలనం
నిర్మల నవనీల శంకర శిరశ్శిఖరీకృత జాట జూట ని
ర్గళిత సురాపగా జలతరంగ పరంపర దోగ జాలినన్‌
కలల పొలాలు పండును, సుఖమ్ములు నిండును మానవాళికిన్‌ (దా.సా.2 పుట 146)
ఇక్కడి సుదీర్ఘ సమాస నిర్మాణం కవి పాండిత్య ప్రకర్షకు నిదర్శనం కావచ్చు. అంతటితో అయిపోలేదు. కలల పొలాలు పండును. సుఖాలు నిండువు అని వ్యస్తపదాలతో రాశాడు. కలల పొలాలు పండడం అన్నది ఫలితం. కలలు మనోభీష్టాలకు ప్రతీక. ఆ ప్రతీక అనుభవంలోకి వచ్చింది. ఈ అనుభవం సాకారం ధరించడానికి ముందెంతో ప్రసవవేదన జరిగిందన్నది సూచించడానికే సుదీర్ఘ సమాస ప్రయోగం అన్నది గుర్తించాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 15 ఆగష్టున భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది అనేది ఒకమాట. కాని దానికి ముందు ఒక నూరేళ్ళ సుదీర్ఘ పోరాటం వుంది. సుదీర్ఘశ్రమానంతరమే మనోభీష్టాలు నెరవేరగలవు అని చెప్పడమే ఈ సమాస నిర్మాణం ద్వారా కవి వాంఛించింది.

భావుకత

కవిత్వానికి భావుకత ప్రాణధాతువు. దాశరథి భావుకతను పట్టించే దృష్టాంతాలు ఆయన కవిత్వంలో కోకొల్లలు.

నీవు వంగి రంగవల్లికలు దిద్దుతుంటే
నింగి నేలకు వాలినట్లుంటుంది (దా.సా. 2 పుట 91)
విషయం నిసర్గ సుందరం. చాలా సరళమైంది. నింగినేలకు వాలడం అనే ఉపమాన ప్రయోగంతో కవితలో సౌందర్యం సిద్ధించింది. నేలకు అందరానంత ఎత్తులో నింగి వుంటుంది. కాని తన ఉన్నతస్థాయిని తొలగించుకొని ప్రేమపూర్వకంగా నేలతో కలుస్తుంది. భూమ్యాకాశాలు ఏకం కావడం వల్ల కలుగుతున్న ఫలితం సంతానం రంగవల్లికలు అవి దీపాల రంగవల్లికలు అంటే వెలుగులు వెలుగులు ప్రసరిస్తున్నాయి. చైతన్య వెల్లి విరుస్తుంది అని చెప్పడం.

#### #### ####

ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో?
ఆ నల్లని ఆకాశంలో కానరాని భానువులెందరో
భూగోళం పుట్టుకకోసం కూలిన సురగోళాలెన్నో
ఈ మానవరూపం కోసం జరిగిన పరిణామాలెన్నో

...........
పసిపాపల నిదురకనులలో
ముసిరిన భవితవ్యం యెంతో
గాయపడిన కవిగుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో
ఈ కవిత ఒక్కటి చాలు దాశరథిని చిరంజీవిని చేయడానికి. మానవ నాగరికతా పరిణామంతా ఈ గేయంలో అందంగా పొదగబడిరది. భావుకుడైన పాఠకుడు, పండితుడైన విమర్శకుడు ఎంతైనా వ్యాఖ్యానించుకోగలిగిన అవకాశం ఉన్న గేయం ఇది. ఇది దీర్ఘగేయం
నిర్భయంగా వచ్చాను నిర్భయంగా వెళతాను
ఉచ్ఛ్వసిస్తూ వచ్చాను. నిశ్వసిస్తూ వెళతాను
మృత్యువు నృత్యం చూపి జడిపిస్తా రెందుకని
భయమెందుకు? నా ఇంటికి నే వెళతాను (జ్వాలాలేఖిని)
అల్పమైన రుబాయిలో అనల్పమైన వేదాంతభావనను ఇమిడ్చాడు.

కవిత్వం ఎప్పుడూ ఉన్నతస్థాయిలోనే ఉండదు. మనస్సు అన్ని పొరల్లోను స్పందించే లక్షణం, పరవశించే గుణం ఉన్నట్లే కవిత్వానికి అన్ని పొరల్లోను నిర్మాణం జరుగుతుంది. పైన పేర్కొన్న ఆ చల్లని సముద్రగర్భం కవిత ఎంత గంభీరంగా సాగిందో ఇప్పుడు ఉదాహరిస్తున్న కవిత అంత సాదాసీదాగా సాగుతుంది.

కన్యకామణులకు కాన్వెంటు చదువు
కొడుకులకు విదేశీబడుల చదువు
ఆంగ్ల విద్య మనకు అక్కరలేదని
బోధసేయుచుండు పొద్దుమాపు (దా.సా.2 పుట 214)
మన పిల్లలు విదేశాల్లో చదవాలి. ఆంగ్లమాధ్యమంలో చదవాలి. అయినా తెలుగును ఉద్ధరించాలి అని ఉపన్యాసాలు దంచుతుంటాం. మనలో ఉన్న ఈ ద్వంద్వప్రవృత్తిని అధిక్షేపించడంద్వారా కవిత్వం రూపం ధరించింది.

కాపి కొట్టు హక్కు కలదని విద్యార్థి
జాగ్రఫీని తెచ్చె సైన్సునాడు
ప్రశ్నకేమి వ్రాయు ప్రత్యుత్తరమ్మును?
మార్క్సు ననుసరించె మార్క్సురాక
లాంటివి సరదాగా తీసుకోవలసిన కవితలు అంతే.

ఇవి యే జవ్వని నవ్వులు వెదజల్లిన పగడాల పెదవులో
ఇవి యే చక్కని కన్నియ చెక్కిళ్ళ మెరసిన మెరుపులో
ఇవి యే యోధుని నరాలలో పరువెత్తిన
త్యాగరుధిర నదీ జలాల తరగలో
ఇవి యే స్వాతంత్య్ర దాహగ్రస్తుల
నిస్తుల మస్తిష్కాలలోని మంటల మారురూపాలో
నిరాశాంధకారంలో
నిగనిగ మెరిసే క్రాంతి దీపాలో
అంటూ మోదుగు పూలను దాశరథి ఉత్ప్రేక్షించడంలో చిక్కని భావుకత దర్శనమిస్తుంది (తి.స.పుట 87)
బ్రిటిష్‌వారు వెళ్ళిపోయారు గాంధీ స్వాతంత్య్రం తెచ్చాడు అన్న భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తాడో గమనిద్దాం.

పరశాసకుల పదాలు
సరిహద్దు దాటి నేడు
ఈ దివ్యధాత్రి మరల
నా దేశమాయె నేడు
మన బోసినోటి తాత
అని గెల్చుకొన్న వేళ
అసి లేని సైనికాళి
ఖుసి చేసుకొన్న వేళ
అని చెప్తూ
తిన తిండిలేనివాడు
కనిపించబోనివాడు
ఆర్జించుకున్న స్వేచ్ఛ
అసలైన స్వేచ్ఛ మనకు
అని ఖండితంగా చెప్తాడు (ఆలోచనాలోచనాలు పుట 176)
ఇలా భిన్న భిన్న కోణాల్లో దాశరథి కవితాభాండారం నుండి ఎన్నెన్నో దృష్టాంతాలను ఉదాహరించుకోవచ్చు.

మానవీకరణం

మానవేతరాలను మానవీకరించి జీవచైతన్యాన్ని కలిగించి రాయడం కవిత్వంలో ఎప్పటి నుండో ఉన్నదే. దానివల్ల చెప్పదలచిన భావాన్ని మరింత ప్రస్ఫుటంగా కవి చెప్పగలుగుతాడు. దాశరథి ఈ పద్ధతిని కూడా బాగా ఎన్నుకొన్నాడు.

వియాత్నాంలో పేలిన ప్రతిబాంబు నా హృదయం అంచుల్లో మంచం వాల్చుకుని పడుకుంది (దా.సా.2 పుట 107)

బాంబు జీవంలేని పదార్థం. కాని అది పేలి శరీరాన్ని గాయపరచడంద్వారా హృదయాన్ని గాయపరుస్తుంది. చలింపచేస్తుంది. హృదయంలోంచి దూరంగా వెళ్ళిపోలేదు. ‘పక్కనే మంచం వాల్చుకొని పడుకుంది' అనడం ఆ హింస, ఆ ఉన్మాదం నిరంతరం హృదయాన్ని కెలుకుతుందన్నది అంతరార్థం.

అణ్వస్త్రం వివస్త్ర్రయై అవమానం పొందాలి. (దా.సా) అని ఒకచోట అంటాడు దాశరథి. మారణహోమాలను సృష్టించే అణుబాంబులను నిర్వీర్యం చేయాలన్నది కవి చెప్పదలుచుకొన్న అంశం. అణ్వస్త్రాల సహజ ధర్మం పేలడం. అది జరగకపోతే దానికి అవమానం కలిగినట్లే. స్త్రీకి ఘోరమైన అవమానం వివస్త్రను చేయడం, దాన్ని గ్రహించి అణ్వస్త్రానికి స్త్రీత్వాన్ని ఆరోపించడంద్వారా దాశరథి కవిత్వీకరిస్తున్నాడు. ఇంతకు ఇది ఎలా కవికి స్ఫురించిఉంటుంది. ‘అణ్వస్త్రం' ‘స్త్రీ'లలో ‘స్త్ర' వర్ణం వివస్త్ర పదప్రయోగానికి దోహదంచేసి ఉండుందనడంలో అసహజమేమీ లేదు.

తుపాకుల నోళ్ళు మూయిస్తాను
బాంబుల చెంపలు వాయిస్తాను

తుపాకులు, బాంబులు ధ్వంసకారకాలు. వాటికి నోళ్లు చెంపలు ఉండవు. కాని వాటికి అవి ఉన్నట్లు చెప్పి వాటిని శిక్షిస్తాననటంద్వారా తుపాకుల మోత బాంబుల మోత లేని ఒక ప్రశాంత సమాజ నిర్మాణం చేస్తానని చెప్తున్నాడు.

శాంతి విలసిల్లాలని ఆకాంక్షిస్తూ దాశరథి ‘రావమ్మా! శాంతమ్మా!' అని కవిత రాశాడు.

నీవు రావన్నాయి మ్రోళ్లు
నీవు లేవన్నాయి ముళ్ళు
నిజం నిజమన్నాయి రాళ్ళు
మ్రోళ్ళు, ముళ్ళు రాళ్ళు మానవేతరాలు. వీటికి కవి ‘నోరు' ప్రసాదించాడు. మాట్లాడ కలిగే ‘శక్తి' ప్రసాదించాడు. అంటే మానవీకరించాడని భావం.

1. నీవు రావని అబద్ధాలాడిన మ్రోడుకు
ప్రౌఢాంగనా పాదతాడనంతో దోహదంచేయించి
పూలుపూయించి
నీవున్నా వనిపిస్తాను.

2. నీవు లేవని బుకాయించిన కరకు కంటకాలకు

నా హృదయ కమల సహస్రదళాలను ఒక్కటొక్కటిగా చెక్కి
చక్కని కుసుమాలవలె భాసింపజేస్తాను.
నీవున్నా వనిపిస్తాను.

3. నీవు రావన్న మాటకు
నిజం నిజమని వంతపాడిన
ప్రతి రాతిని నాతిగా మలచి
నవజీవనం నాట్యమాడిరచి
నీవున్నావనిపిస్తాను.

మ్రోడు ఎండిన చెట్టుకు, ముళ్ళు కురుకుతనానికి, రాయి జడత్వానికి సూచనగా కవి ప్రయోగించాడని అర్థమవుతుంది. వాటికే సజీవత్వాన్ని చైతన్యాన్ని కల్పిస్తే సానుకూల దృక్పథమేర్పడుతుంది.
ఎండిన చెట్లు కావడంవల్ల వాటి మనస్తత్వాని కనుగుణంగా ‘శాంతి' రాదన్నాయి. ప్రౌఢాంగనా పాదతాడనంతో చెట్లు చిగురుస్తాయన్న కవి సమయాన్ని ఊతగా తీసుకొని చికిత్స చేశాడు. అంటే చైతన్యాన్ని నింపాడు. దాని ఫలితం కవి వాంఛించిన లక్ష్యానికనుగుణంగా శాంతి వుందనిపిస్తానన్న విశ్వాసాన్ని ప్రకటించాడు. కరుకుముళ్ళు కావడంవల్ల వాటి మనస్తత్వానికనుగుణంగా శాంతి లేదన్నాయి. మెత్తటి కవి హృదయ కమల దళాలను చెక్కించి మార్దవాన్ని కలిగించాడు. దాంతో శాంతివుందని అంటాయి. చైతన్యంలేని స్థితిలో రాయి ‘శాంతి' లేదని వంతపాడిరది, కాని కవి ఆ రాతిని రక్తమాంసాలు, ప్రాణం ఉన్న ‘నాతి'ని చేశాడు. ఫలితంగా శాంతి వుందంటుంది.
నిజానికి కవి మ్రోడు, ముల్లు, రాయి చేత ‘శాంతి ఉందనిపిస్తాను' అంటూ స్వీయ విశ్వాస ప్రకటనే చేశాడు. నిజంగా అవి అన్నవా లేదా స్పష్టపరచకపోయినా కవి ఆశయం నెరవేరింది ‘అవి అన్నాయి.'

చైతన్యరహిత పదార్థాలను (మ్రోడు, ముల్లు, రాయి) మానవీకరించి మాట్లాడిరచినట్లు చేసి ఒక తప్పుచెప్పించి దాని సరిచేసినట్లుగా రాయడం ఈ కవితలో గమనించవచ్చు.
ఈ విధంగా దాశరథి కవిత్వాన్ని గురించి ఎంతగానైన చెప్పుకోవడానికి అవకాశముంది. మూర్తిలో వామనత్వమున్నా ఆధునిక కవిత్వచరిత్రలో అత్యున్నతస్థానాన్ని సాధించుకొన్న నిత్య తేజోమూర్తి దాశరథి.

- ఆచార్య వెలుదండ నిత్యానంద రావు

English summary

 Proffessor, Telugu department, Osmania University Dr Veludanda Nithyananda Rao analizes Dasarathi's poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X