వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలకు ఆరు నెలలు: కెసిఆర్ వర్సెస్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్నాయి. తెలంగాణలో కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ఆరు నెలలు ముఖ్యమంత్రులుగా పాలన సాగించారు. విభజన వల్ల తలెత్తిన సమస్యలు ఇప్పటికీ పూర్తి కాకపోవడం పెద్ద ఆటంకంగా మారింది. ప్రతీ విషయంలోనూ చంద్రబాబు, కెసిఆర్ ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖి చర్చించుకున్న తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ స్థితిలో ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరును పరిశీలిద్దాం.

తెలంగాణ

తెలంగాణ ఇప్పటికీ ఉద్వేగాల నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన ఉద్యమం సఫలం కావడంతో రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది. దళిత నేతను ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తానే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. బంగారు తెలంగాణ సాధన కోసం తన నాయకత్వం అవసరమని అనిపించారు. పార్టీ నాయకుల నుంచి ఆయనకు ఏ విధమైన వ్యతిరేకత కూడా ఎదురు కాలేదు. పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు కెసిఆర్ కనిపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏదీ ఆచరణలోకి వచ్చినట్లు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ప్రత్యర్థిగా చూపేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే విధమైన వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నారు. కెసిఆర్‌ను ఆయన ప్రత్యర్థిగా చూపిస్తున్నారు.

Telangana and AP: KCR vs Naidu- 6 months later

వైఫల్యాలు...

చాలా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కొరత, అధికారుల కొరత ఉంది. ఉద్యోగుల విభజన జరగకపోవడంతో అనుకున్నంత వేగంగా పనులు జరగడం లేదు. పరిశ్రమలను పెద్ద యెత్తున ఆకర్షించడానికి కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఏ మేరకు ఆచరణలోకి వస్తాయనేది తెలియడం లేదు. పెట్టుబడిదారులకు ఇస్తున్న హామీలను ఆయన ఏ మేరకు నెరవేరుస్తారనేది తేలాల్సే ఉంది.

రైతుల ఆత్మహత్యలు..

కెసిఆర్ ఎంతగా హామీ ఇచ్చినప్పటికీ, రైతు రుణమాఫీకి ముందుకు వచ్చినప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తీవ్రమైన విద్యుత్తు కోత, వర్షాభావ పరిస్థితులు రైతుకు వ్యతిరేకంగా మారాయి. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి తగిన కార్యాచరణ కొరవడినట్లు కనిపిస్తోంది. రైతుల ఆత్మహత్యలకు గత ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే కారణమని అధికార టిఆర్ఎస్ పార్టీ ఎదురు దాడి చేస్తోంది. మూడేళ్లకు గానీ విద్యుత్తు సమస్య తీరదనే ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నారు. వాస్తవం అదే. కానీ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు.

యువత ఆశలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు పెద్ద యెత్తున ఉద్యోగాలు వస్తాయని యువత ఆశపడింది. కెసిఆర్ కూడా ఉద్యమ కాలంలో ఆ ఆశలు కల్పించారు. కానీ, ఇప్పటి వరకు యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కార్యాచరణ తీసుకున్నట్లు లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే కెసిఆర్ నిర్ణయానికి ఒక వర్గం విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తోంది. వివిధ సంస్థల విభజన జరగకపోవడం వల్ల కూడా ఉద్యోగాల విషయంలో స్పష్టత రావడం లేదు. ఉద్యోగుల విభజన జరిగితే తప్ప ఖాళీలు, అవకాశాల విషయం కొలిక్కి రాదు. వచ్చే ఏడాది మార్చిలో పూర్తవుతుందని చెబుతున్నారు. ఆ తర్వాత యువత ఎంత కాలం వేచి ఉండాలనేది సమస్యే.

సానుకూలాంశాలు

అమరవీరుల కుటుంబాలకు పది లక్షల ప్యాకేజీ ప్రకటించడం కెసిఆర్‌కు సానుకూలంగా మారింది. రూ.4250 కోట్ల రైతు రుణాల మాఫీ జరిగింది. పోలీసు వ్యవస్థను ఆధునీకరించాడనికి, పటిష్టం చేయడానికి రూ.300 కోట్లు కెసిఆర్ ఖర్చు పెట్టారు. వితంతువులకు పింఛన్ల సొమ్ము పెంచారు. వికలాంగులకు కూడా దాన్ని వర్తిపజేశారు. క్రీడాకారులకు విశేషమైన ప్రోత్సాహం కల్పిస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన తర్వాతనే సానియా మీర్డా గణనీయమైన విజయాలు సాధిస్తున్నారు. దాన్ని ప్రచారం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం చిక్కింది. అయితే, ప్రజల్లో కెసిఆర్ పట్ల ఇంకా సానుకూల వైఖరి ఉంది. ప్రతిపక్షాల పట్ల వారికి నమ్మకం లేదు. ఇది టిఆర్ఎస్‌కు కలిసి వచ్చే అంశం

చంద్రబాబు నాయుడు

కెసిఆర్‌తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద సవాళ్లను ఎదుర్కుంటున్నారు. రాజధాని లేదు. హైదరాబాద్ నుంచి పాలన సాగించాల్సిన పరిస్థితి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మాణం 2019నాటికి పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. అయితే, రాజధాని నిర్మాణానికి భూసేకరణ విషయంలో రైతుల నుంచి ప్రతిఘటన ఎదరువుతోంది. దానికి ఖర్చులు సమీకరించడం కూడా సమస్యగానే ఉంది. పైగా, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తీవ్రమైన విమర్శల దాడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతిపక్షం బలంగా ఉండడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందికరమైన విషయమే. చంద్రబాబుపై ప్రజలు పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను నెరవేర్చడం చంద్రబాబుకు పెద్ద సవాల్.

పెట్టుబడుల కోసం వేట..

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద యెత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. జపాన్, సింగపూర్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రాజధాని నిర్మాణానికి కూడా జపాన్, సింగపూర్ సాయం అర్థించారు. వ్యవసాయ రంగమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన రంగమవుతుంది. కానీ, జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో నిత్యం పోరాటం చేయక తప్పని పరిస్థితి.

హుధుద్ తుఫాను

హుధుద్ తుఫాను చంద్రబాబుకు కొత్త సవాళ్లను విసిరింది. విశాఖపట్నం వంటి తీర ప్రాంతం తుఫాను తాకిడులను ఎదుర్కుంటుందనే సంకేతం ఆ తుఫాను పంపించింది. అందువల్ల విశాఖఫట్నం వంటి తీర ప్రాంతాలు ఐటి రంగానికి ఎంత మేరకు సురక్షితమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సినిమా పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తరలి వచ్చే అవకాశాలు లేవు. ప్రభుత్వ కార్యక్రమాలు హైదరాబాద్ నుంచి జరిగినంత వరకు ఫరవా లేదు గానీ రాజధాని తరలిపోయిన తర్వాత హైదరాబాదులో స్థిరపడిన ఐటి, సినీ తదితర పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలి వస్తాయనే గ్యారంటీ లేదు. బడ్జెట్ లోటు కూడా చంద్రబాబుకు పెద్ద సమస్యనే.

సానుకూలాంశాలు..

చంద్రబాబుకు పాలనాదక్షుడనే పేరుంది. హైదరాబాద్‌ను ఐటికి కేంద్రంగా మార్చారనే ఖ్యాతి కూడా ఉంది. హైదరాబాద్ అభివృద్ధిని చూపించి ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా నమ్ముతున్నారు. 2022 నాటికి ఎపిని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇస్తున్నారు. పైగా, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉంది. మిత్రపక్షం కావడంతో కేంద్రంలోని బిజెపి అన్ని రకాలుగా చంద్రబాబుకు సహకరించడానికి సిద్ధంగా ఉంది.

English summary
The bifurcation of Andhra Pradesh was probably one of the worst battles that India had witnessed in recent times. However after a lot of ill will between Telangana and Andhra Pradesh the state was finally bifurcated and in no time both Chief Ministers K Chandrasekara Rao and Chandrababu Naidu had to move on and face the practical difficulties and challenges ahead of them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X