ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నంపెట్టే చేతులకు సంకెళ్లు: మరోసారి టార్గెటైన కేసీఆర్(పిక్చర్స్)

అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లు వేయడం ఇప్పుడు పెను దుమారంగా మారింది. ఖమ్మం పోలీసుల అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలకు లక్ష్యంగా మారారు.

|
Google Oneindia TeluguNews

ఖమ్మ: అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లు వేయడం ఇప్పుడు పెను దుమారంగా మారింది. ఖమ్మం పోలీసుల అత్యుత్సాహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలకు లక్ష్యంగా మారారు. దుక్కులు దున్నే రైతన్నల చేతులకే బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తీసుకురావడంపై సర్వత్రా నిరసనలు వ్యవక్తమవుతున్నాయి.

 కుటుంబసభ్యుల ఆందోళన

కుటుంబసభ్యుల ఆందోళన

సరిగ్గా 15రోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఘటనలో అరెస్టయిన 10మంది రైతులను గురువారం న్యాయస్థానానికి సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. రైతులపై మూడు కేసులు నమోదు చేయగా రెండు కేసుల్లో వాయిదాకు రైతులను తీసుకువస్తున్నారని తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు కోర్టువద్దకు భారీగా చేరుకున్నారు. పోలీస్ వాహనం నుండి రైతులు దిగుతున్న సమయంలో బేడీలు వేసి ఉండటాన్ని చూసి వారి కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఇంత దారుణమా..

ఇంత దారుణమా..

రైతులపై పెట్టిన కేసులే దేశద్రోహులపై పెట్టే కేసులని, ఇప్పుడు సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావడం పట్ల మరీ దారుణమని మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు వెంటనే తిరిగి జైలుకు తరలించారు. కాగా, తమ పంటను అమ్ముకునేందుకు వచ్చి గిట్టుబాటుధర కావాలని అడిగిన రైతులను అరెస్టు చేయడమే కాకుండా సంకెళ్ళు వేసి కోర్టుకు తీసుకురావటాన్ని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంఘ విద్రోహ శక్తులకే బేడీలు వేయాలని న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై మానవహక్కుల సంఘానికి వెళ్తామని, ఉన్నత న్యాయస్థానంలో కూడా కేసు వేస్తామని ప్రకటించారు.

ఉగ్రవాదులా? తీవ్రగవాదులా?

ఉగ్రవాదులా? తీవ్రగవాదులా?

‘నిందితులుగా ఉన్న రైతులను ఉగ్రవాదులు, తీవ్రవాదులను తీసుకొచ్చినట్లు చేతులకు బేడీలు వేసి తీసుకొస్తారా!? మా వాళ్లు హత్యలు చేశారా? దోపిడీలు చేశారా? ఇలా ఖూనీకోరుల్లా, దొంగల్లా బేడీలు వేసి తీసుకొస్తారా? ఇదేనా రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాకు దక్కిన గౌరవం' అంటూ రైతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అన్నం పెట్టే చేతులకు కేసీఆర్ సర్కారు సత్కారం ఇదేనా?

అన్నం పెట్టే చేతులకు కేసీఆర్ సర్కారు సత్కారం ఇదేనా?

మిర్చిని విక్రయించేందుకు మార్కెట్‌కు వెళ్లిన తమవారిపై అన్యాయంగా కేసులు పెట్టారని, ఇప్పుడు బేడీలేసి కోర్టుకు తెచ్చారని, దేశానికి అన్నం పెట్టే రైతులకు కేసీఆర్ సర్కార్‌ చేసే సత్కారం ఇదేనా? అని మండిపడ్డారు. మిర్చి క్వింటాకు రూ.1500-2000 లోపులోనే ధర ఇస్తామన్న వ్యాపారులపై ఆగ్రహంతో ఖమ్మం మార్కెట్‌ యార్డులో ఏప్రిల్‌ 28న కొంతమంది రైతులు కాంటాలను, ఫర్నిచర్‌ను, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీంతో 10 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.

 రైతులకు బెయిల్

రైతులకు బెయిల్

అయితే, రైతుల తరఫు న్యాయవాదులు మంగళవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా రైతుల రిమాండ్‌ పొడిగించాలని పోలీసులు విన్నవించారు. గురువారం నాటి విచారణకు వారికి బేడీలు, గొలుసులు వేసి కోర్టుకు తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ బి.జ్ఞానేశ్వరరావు ఇరు వర్గాల వాదనలు విని, రైతులు మండెపూడి ఆనందరావు, నెల్లూరి వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, ఇస్లావత్ బాలు, భూక్యా అశోక్‌, భూక్యా నర్సింహారావు, భూక్యా శ్రీను, బానోతు సైదులు, తేజావత్ బావ్‌సింగ్‌, బానోతు ఉపేందర్‌లకు బెయిల్‌ మంజూరు చేశారు. వీరంతా 90 రోజులపాటు ప్రతీ ఆదివారం ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్ లో సంతకాలు చేయాలనే షరతు విధించారు. బెయిల్‌ పత్రాలను ఖమ్మం జిల్లా జైలులో సమర్పించడంతో రైతులు విడుదలయ్యారు.

 రైతులకు ఘన సన్మానం

రైతులకు ఘన సన్మానం

రైతులు జైలు నుంచి విడుదల అవుతుండడంతో గురువారం సాయంత్రం జైలుకు రైతుల బంధువులు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. 12 రోజుల తర్వాత విడుదలైన రైతులకు ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో సన్మానించారు. రైతులను ఎత్తుకుని, జైలు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విడుదలైన రైతులను చూసి వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కన్నీళ్లతో ఒకరిని మరొకరు హత్తుకున్నారు.

 మద్దతు ధర అడిగితే జైలులో పెడతారా?

మద్దతు ధర అడిగితే జైలులో పెడతారా?

‘మిర్చి పంటకు మద్దతు ధర అడిగిన పాపానికి ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టడం ఏంటి? పత్తి పంటను సాగు చేయొద్దు, మిర్చి, అపరాలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతోనే మిర్చి పంటను సాగు చేశా. మద్దతు ధర అడిగినందుకు జైలుకు పంపిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూశాం' అంటూ అరెస్టైన ఓ రైతు తెలిపారు.

 ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్‌

ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్‌

రైతుల చేతులకు పోలీస్‌ సిబ్బంది బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడంపై డీజీపీ అనురాగ్‌ శర్మ సీరియస్‌గా స్పందించారు. పోలీసుల తీరుపై రైతులు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలకు దిగడంతో వెంటనే ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ ఇక్బాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులైన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆయన అడిషనల్‌ డీసీపీ సాయికృష్ణను విచారణాధికారిగా నియమించారు. ఆయన ఇచ్చిన నివేదికను ఐజీ నాగిరెడ్డికి పంపించి, ఆర్మ్‌డ్‌ రిజర్వుకు చెందిన ఇద్దరు ఎస్సైలు వెంకటేశ్వరరావు, పూర్ణనాయక్‌లను సస్పెండ్‌ చేశారు.

English summary
Ten farmers who had been arrested for creating a ruckus at the Khammam market yard were produced in a local court on Thursday, in handcuffs, triggering instant outrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X