హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో 12 జిల్లాలు కొత్త: హైద్రాబాద్ చుట్టూ 3!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మరో పన్నెండు నుంచి 15 కొత్త జిల్లాలకు ఆస్కారం కనిపిస్తోంది. రాజధాని హైదరాబాద్ చుట్టూ మూడు కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశముంది. ఇందుకు సంబంధించి ముసాయిదా సిద్ధమైందని తెలుస్తోంది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన గల కమిటీ... జిల్లాల భౌగోళిక స్వరూపాలు, ఇతర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించనుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగా మంత్రిమండలి గత నెల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

వచ్చే జూన్‌ రెండో తేదీ నాటికి అంటే తొమ్మిది నెలల వ్యవధిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. గత నెల 29న సీఎస్‌ అధ్యక్షతన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్య్వవస్థీకరణ కమిటీ ఏర్పాటైంది.

ఈ కమిటీ వెంటనే పని చేపట్టింది. రెవెన్యూ శాఖతో పాటు ఇతర శాఖల నుంచి సమాచారం తీసుకొని ఒక ముసాయిదాను కమిటీ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పరిస్థితులు, జనాభా, భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ డివిజన్లు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలకు జిల్లా కేంద్రాల దూరం తదితర అంశాలపై ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ ముసాయిదాను రూపొందించారని తెలుస్తోంది.

జిల్లాలను పెంచితే తెలంగాణలో జిల్లాల సంఖ్య 22 నుంచి 25 వరకు చేరుతుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గద్వాల్‌ను, ఖమ్మం జిల్లాలో భద్రాచలాన్ని, వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి, మహబూబాబాద్‌, జనగామ, ములుగును జిల్లా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Telangana to Have 12 to 15 More Districts

ఇందుకు అనుకూలంగా పరిస్థితులు లేవని అధికారులు చెప్పినట్లుగా సమాచారం. ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్లు ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకుంటే ముసాయిదాలోనే మార్పులు చేసి అదనంగా మరో రెండు కొత్త జిల్లాలకు అవకాశం కల్పించే వీలుందంటున్నారు.

సమాచారం మేరకు... హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల చుట్టూ కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేస్తారు. రాజధాని శివార్లను వాటిలో కలుపుతారు. రంగారెడ్డి కేంద్రంగా వికారాబాద్‌ ఉంటుంది. కొత్తగా చేవెళ్ల, భువనగిరి లేదా బీబీనగర్‌, షాద్ నగర్‌ కేంద్రంగా జిల్లాలను ఏర్పాటు చేసి, నగర శివారు ప్రాంతాలను కలుపుతారు.

హైదరాబాద్‌ పాత జిల్లా కొనసాగుతుంది. నగరాన్ని మరింతగా విస్తరించేందుకు శివారు ప్రాంతాలలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ ఒకే జిల్లాగా ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో... వికారాబాద్‌ (ప్రస్తుత జిల్లా కేంద్రం) గాక, చేవెళ్ల కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయొచ్చు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో... షాద్‌నగర్‌తో పాటు నాగర్‌కర్నూలు, వనపర్తి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చు. నల్గొండ జిల్లాలో... భువనగిరితో పాటు జిల్లాలో సూర్యాపేట కేంద్రంగా మరో కొత్త జిల్లాను లేదా భువనగిరి లేదా బీబీ నగర్‌ను చేయనున్నారు.

కరీంనగర్‌ జిల్లాలో... జగిత్యాల కేంద్రంగా మరో జిల్లా ఏర్పడనుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో... మంచిర్యాల కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. మెదక్‌ జిల్లాలో... ప్రస్తుత జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పేరుతో జిల్లా ఏర్పడుతుంది. మెదక్‌, సిద్ధిపేట కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవచ్చు.

నిజామాబాద్‌ జిల్లాలో... కామారెడ్డి కేంద్రంగా మరో జిల్లాను, ఖమ్మం జిల్లాలో.. కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లాను చేయవచ్చు. వరంగల్‌ జిల్లాలో... మరో కేంద్రానికి జిల్లా స్థాయి కల్పించే పరిస్థితి లేదని భావిస్తున్నారని తెలుస్తోంది. జనగామను సిద్ధిపేట జిల్లాలో, లేదా భువనగిరి జిల్లాలో, డోర్నకల్‌ను ఖమ్మం జిల్లాలో కలిపి, మిగిలిన ప్రాంతాలతో వరంగల్‌ జిల్లాను కొనసాగించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు.

English summary
Telangana to Have 12 to 15 More Districts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X