మోడీతో జగన్ భేటీలో ట్వీస్ట్: చిక్కుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

మోడీతో జగన్ భేటీని తన వార్తాకథనాల ద్వారా చంద్రబాబుకు అనుకూలంగా మార్చాలని చూసిన ఆంధ్రజ్యోతి ఎదురు దెబ్బ తిన్నదా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాశాడని లేఖలంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన వార్తాకథనంతో ఆ పత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ చిక్కుల్లో పడినట్లే. మా అక్షరం మీ ఆయుధం అనే నినాదంతో నడుస్తున్న పత్రికకు బురద అంటుకుంది.

వైయస్ జగన్‌ తప్పును ఎత్తి చూపాలనే ఉద్దేశంతో రాసిన వార్తాకథనంతో రాధాకృష్ణ తప్పులో కాలేసి తనకే మచ్చ తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిష్పాక్షికంగా వ్యవహరిస్తామనే ఆయన మాటలు వట్టివేనని తేలిపోయింది.

సాక్షి మీడియా ఏకపక్షంగా వార్తాకథనాలు రాస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇది ఎదురుదెబ్బనే. సందు దొరికితే జగన్ మీడియాను తప్పు పట్టే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా అది చిక్కులు తెచ్చిపెట్టినట్లే. ఆయన మీడియా నిష్పాక్షికత గురించి మాట్లాడితే నవ్వులు పాలయ్యే స్థితిని రాధాకృష్ణ తెచ్చి పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చంద్రబాబు కోసం ఇలా...

చంద్రబాబును వెనకేసుకుని రావడానికి ఆంధ్రజ్యోతి వార్తాకథనాలు రాస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చాలా కాలంగా విమర్శిస్తూ వస్తున్నారు. జగన్‌ను అప్రతిష్టపాలు చేయడమే దాని ధ్యేయమని కూడా చెబుతూ వస్తున్నారు. దానికి ఎల్లో మీడియా అనే పేరు కూడా పెట్టారు. ఎవరో అందించిన లేఖలను తప్పుగా వ్యాఖ్యానించి ఆంధ్రజ్యోతి పెద్ద తప్పే చేసినట్లు కనిపిస్తోంది.

జగన్ సీరియస్

తన వార్తాకథనం ద్వారా ఆంధ్రజ్యోతి జగన్‌కు పదునైన అస్త్రాన్నే అందించిందని చెప్పాలి. ఆ అవకాశాన్ని ఆయన వదులుకోలేదు. ఆంధ్రజ్యోతిని ఆయన సోమవారం మీడియా సమావేశంలో ఏకిపారేశారు. అంతేకాదు, ఆంధ్రజ్యోతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో ఆయన పడినట్లు చెబుతున్నారు. ఆంధ్రజ్యోతికి సంబంధించిన రహస్య సమాచారాన్ని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి చేరవేసినట్లు ప్రచారం సాగుతోంది.

వారిపై కేంద్రం ఆరాలు...

తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తూ, కావాలని జగన్‌ విషయంలో దూకుడుగా వెళ్తున్న ఇద్దరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులపై కేంద్రం ఆరాలు తీయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు తన అధికారంతో ప్రతిపక్షమే ఉండకూడదన్న దుర్బుద్ధితో నిస్సిగ్గుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అధికారులను ప్రలోభపెట్టి వారితో తప్పులు చేయిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలని అని జగన్ ప్రశ్నిస్తూ రాజ్యాంగ పరిధిలో ఉన్నాం కాబట్టి ట్రంప్‌నకో, గవర్నర్‌కో ఫిర్యాదు చేయలేం కదా ప్రధానికే చేస్తామని అన్నారు. తనపై చంద్రబాబు ప్రోద్బలంతో ఇద్దరు ఈడి అధికారులు తన పట్ల అనవసరమైన దూకుడు ప్రదర్శిస్తున్నారని తాను మోడీకి ఫిర్యాదు చేసిన విషయంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. గాంధీ, ఉమాశంకర్ గౌడ్‌లపై జగన్ ఫిర్యాదు చేశారు.

అనుకూలంగా మార్చుకున్న జగన్

ఆంధ్రజ్యోతి రాసిన వార్తాకథనాన్ని జగన్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తప్పు చేశాడని రుజువు కాకుండా తనను జెల్లో పెట్టడమే తప్పు, రాజ్యాంగం ప్రకారం 3 నెలల లోపు విడుదల చేయాలని అని అంటూ తనను అంతకు మించి జైల్లో ఉంచడాన్ని తప్పు పట్టారు. దానికితోడు, చంద్రబాబును, కాంగ్రెసును విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయి కేసులు పెట్టారని, అక్కడి నుంచి కేసులు నడిపించేవరకు అంతా వాళ్లేని ఆయన అన్నారు. అప్పుడు చంద్రబాబు ఫోన్లలోనే అధికారులను నడిపించారని, వాళ్లు మీడియాకు సెలెక్టివ్ లీకులు ఇచ్చారని ఆయన చెప్పారు. ఎంత వరకు చెప్పాలి, ఏ రకంగా తనకు చెడ్డ పేరు తేవాలని చూశారని ఆయన చెప్పారు. దర్యాప్తు అధికారులు కూడా గానీ వాళ్లతో చంద్రబాబు చేయించారని ఆయన ఆరోపించారు. ఆ రకమైన వాదన ద్వారా తాను కాంగ్రెసుకు పూర్తిగా దూరంగా ఉంటాననే సంకేతాలను బిజెపికి ఇవ్వడమే కాకుండా తనపై రాజకీయ కోణంలోనే కేసులో పెట్టారనే విషయాన్ని నర్మగర్భంగా చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు తీరుపై బిజెపికి అనుమానాలు రేకెత్తించే పని కూడా చేశారు.

సుజనా చౌదరియేనా...

ఇప్పుడు మళ్లీ తనకున్న మంత్రిని కేంద్రంలో కూర్చోబెట్టుకుని ఆయనతోనూ, తనకు మద్దతు ఇస్తున్న మంత్రులను ఉపయోగించుకుని అదే కార్యక్రమాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారని జగన్ విమర్శించారు. తనకున్న కేంద్ర మంత్రి ఎవరనే విషయంపై చర్చ సాగుతోంది. ఆయన సుజనా చౌదరి కావచ్చునని భావిస్తున్నారు. అదే సమయంలో తనకు మద్దతు ఇస్తున్న మంత్రులతో అని జగన్ అన్నారు. వీరు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ కావచ్చునని భావిస్తున్నారు. చంద్రబాబుకు వెంకయ్య నాయుడు ఎప్పటికప్పు అండగా నిలబడుతున్నారనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పసగట్టిన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతంగా ఎదగాలని భావిస్తుండడంతో వెంకయ్య నాయుడిని అంతగా విశ్వసించడం లేదనే మాట వినిపిస్తోంది.

 

 

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఇలా...

చంద్రబాబు మీడియాను ఎలా మేనేజ్ చేస్తారంటే చివరకు ఓ మీడియా హౌస్ న్యాయం తరఫున మాట్లాడాల్సింది పోయి జరగనిది జరగనట్లుగా కుకప్ చేసిందని జగన్ ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి అన్నారు. తాను ఫిబ్రవరి 17వ తేదీన లేఖ రాస్తే, తనకు అక్కడి నుంచి సమాధానం కూడా వచ్చిందని, తాను మే 10వ తేదీన ప్రధానిని కలిశాని, బుద్ది ఉన్నవాడెవడైనా పాత లెటర్ తీసుకెళ్లి ఇస్తాడా అని ఆయ న్నారు. తాను మే 10వ తేదీన ఇచ్చిన లేఖను పక్కన పెట్టిన ఫిబ్రవరి 17వ తేదీన రాసిన లేఖను ప్రస్తావించారని జగన్ ఆంధ్రజ్యోతి చేసిన తప్పును ఎత్తి చూపారు. మొదటి పేజీ చూపిస్తే తేదీ చూపించాల్సి వస్తుందని చివరి పేజీ వేశారని కూడా చెప్పారు. ఇదే లేఖ పెట్టి మీడియా అబద్ధాలు చెబుతుంటే ఎవరైనా బతకగలరా అని ఆయన అడిగారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానిని కలిసి సమస్యలు చెప్పడం తప్పా అని అడిగారు.

బయటపెట్టడంతో ఇలా....

మోడీకి జగన్ ఇచ్చిన లేఖ ప్రతులు తమ వద్ద ఉన్నాయంటూ చెప్పిన ఆంధ్రజ్యోతి వైయస్సార్ కాంగ్రెసు ఆ లేఖల గుట్టును బయటపెట్టడంతో మర్నాటికి కథనాన్ని మార్చేసింది. లేఖపై తేదీ ఏమిటన్నది కాదు, నువ్వు సొంత సమస్యలను మోడీకి సొంత సమస్యలను చెప్పుకున్నావా లేదా అంటూ నిలదీసినట్లు బీరాలు పలికింది. అంటే, మొదట ప్రస్తావించిన లేఖ సరైంది కాదని అంగీకరించినట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు. దీని ద్వారా జగన్‌కు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి వార్తాకథనాలను రాస్తుందనే విషయం తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. దానివల్ల జగన్‌పై ఆంధ్రజ్యోతి రాసే వార్తాకథనాలను పట్టించుకోని పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు జగన్ తమపై అక్కసు వెళ్లబోసుకుంటున్నారని వాదిస్తూ సమర్థించుకునే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేస్తూ వచ్చింది. ఇప్పుడు అలా చెప్పినా పాఠకులు నమ్మే పరిస్థితి ఉండదు. ఇది ఆంధ్రజ్యోతి విశ్వసనీయతకు దెబ్బనే.

ఆంధ్రజ్యోతిపై కీలకమైన ఆరోపణ..

ఆంధ్రజ్యోతిపై జగన్ కీలకమైన ఆరోపణ చేశారు. నోట్ల రద్దు సమయంలో ఆంధ్రజ్యోతి నుంచి ఒకే బ్యాంకులో ఒకే బ్యాంకులో భారీగా జమ చేసినట్లు కొన్ని ఆధారాలతో ఆనుమానాలను కలిగే విధంగా జగన్ కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్న ఇద్దరు అధికారులను బదిలీ చేసి, కొత్త వారిని నియమించాలని జగన్ మోడీని కోరినట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆంధ్రజ్యోతి డిపాజిట్లపై కూడా దర్యాప్తు జరగాలని జగన్ కోరుకుంటున్నట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి చిక్కుల్లో పడుతుందా అనేది భవిష్యత్తు మాత్రమే తేలుస్తోంది. అయితే, ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా ఇతరేతర విషయాలపై చంద్రబాబుకు అండగా నిలుస్తూ ఆయా ఆంశాలపై తమ పార్టీని, కేంద్రాన్ని తప్పు పట్టే విధంగా ఆంధ్రజ్యోతి వార్తాకథనాలు రాస్తోందని బిజెపి నాయకులు గుర్రుగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

 

 

ఆంధ్రజ్యోతిపై నిషేధం

పాత్రికే విలువలకు తిలోదకాలిచ్చి ఫిబ్రవరి 17న ప్రధానికి రాసిన లేఖను మే 10న ఇచ్చినట్లు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ప్రెస్ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి వైఎస్ జగన్ ఇచ్చిన వినతిపత్రంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రజ్యోతి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాలపై తమ పార్టీ నిషేధం విధిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

జగన్‌కు చిక్కిన చంద్రబాబు

మోడీతో జగన్ భేటీపై అనుమానాలు రేకెత్తించే విధంగా ఆంధ్రజ్యోతి రాసిన వార్తాకథనం చంద్రబాబు నాయుడికి చిక్కులు తెచ్చిపెట్టినట్లే ఉంది. దాన్ని ఆసరా చేసుకుని జగన్ చంద్రబాబును ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు. ప్రధానితో తాను భేటీ అయిన తీరును, తన షెడ్యూల్‌ను జగన్ వివరిస్తూ తాము అన్నీ పారదర్శకంగా చేశామని చెప్పారు. ఆ విషయాలు చెబుతూ చంద్రబాబు 2-3 గంటలకు వచ్చిన 11 గంటల వరకు ఎవరికీ కనిపించలేదని, చంద్రబాబు ఈ మధ్య సమయంలో ఎక్కడికి వెళ్లారని, ఎవరిని కలిశారని, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని అన్నారు. ఎవరు చీకట్లో చిదంబరాన్ని కలిశారు, ఎవరు కాంగ్రెసుతో కలిసి తనమీద కేసులు పెట్టారు, ఎవరు విప్ జారీ చేసి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడారని ఆయన చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది చంద్రబాబుకు ఎక్కువ కాకాపోయినా ఏదో మేరకు ఇబ్బందులు కలిగించేదే.

English summary
YSR Congress party president YS Jagan attacked Andhryajyothi reports and blamed Andhra Padesh CM Nara Chnadrababu Naidu.
Please Wait while comments are loading...