అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన "లెనిన్" మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చగా.. మూడేళ్ల గ్యాప్ తర్వాత అయ్య గారు మళ్లీ తెరపై ఎంట్రీ ఇచ్చారు.
కాగా లెనిన్ మూవీ ఫస్ట్ హాఫ్, అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగున్నాయని తొలి షో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్లస్ అయిందని టాక్ వినిపిస్తోంది. ప్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఓ 30 నిమిషాల ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలిచిందని అంటున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీరామపురం గ్రామంలోని సాధారణ యువకుడు ఆ గ్రామంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై ఆ ఊరి పెద్దనే ఎదిరించే పాత్రలో అఖిల్ తన సత్తా చాటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరో కూడా కూడా టాలీవుడ్ హీరోల '7' సెంటిమెంట్ ను కొనసాగిస్తూ.. బ్లాక్ బస్టర్ కొట్టాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ హీరోల "7" సెంటిమెంట్.. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది హీరోలకు 7వ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వారి కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. మహేష్ బాబుకి 'ఒక్కడు'.. పవన్ కళ్యాణ్ 'ఖుషి'.. జూనియర్ ఎన్టీఆర్ 'సింహాద్రి'.. అల్లు అర్జున్ 'ఆర్య 2'.. రామ్ చరణ్ 'ఎవడు'.. నాగ చైతన్య 'మనం'.. విజయ్ దేవరకొండ 'గీత గోవిందం'.. నాని 'పిల్ల జమిందార్'.. ఇలా హీరోలందరి కెరీర్ లో వారి ఏడవ సినిమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పుడు అఖిల్ అక్కినేనికి కూడా ఏడో చిత్రం బాగా కలిసొచ్చిందని అంటున్నారు. కాగా అక్కినేని మూడో తరం వారసుడిగా 'సిసింద్రీ' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఆ తర్వాత 'అఖిల్' మూవీతో హీరోగా పరిచయమయ్యారు. 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఏజెంట్' చిత్రాల్లో నటించారు. మొత్తానికి తొలిసారిగా చేసిన రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ అఖిల్ కి హిట్ ఇవ్వడం పట్ల అక్కినేని అభిమానులు అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ హడావిడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.