పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్..!


ఢీ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్‌ ఈ మధ్యనే రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పండు మాస్టర్ తగరపువలస సమీపంలో జరిగిన ఓ జాతర కార్యక్రమంలో ప్రత్యేక డ్యాన్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం తన డ్యాన్స్ బృందంతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఆనందపురం సమీపంలోకి రాగానే కారులో ఉన్న ఓ డ్యాన్సర్‌కు అకస్మాత్తుగా అస్వస్థత ఏర్పడి వాంతులు కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.

Advertisement

పరిస్థితిని పరిశీలించేందుకు పండు మాస్టర్‌తో పాటు మరికొందరు బృంద సభ్యులు కారు దిగగా.. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వస్తున్న కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి పండు మాస్టర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పూర్తిగా ధ్వంసమవగా, దాని ముందు నిలిపి ఉన్న మరో బొలెరో వాహనం కూడా దెబ్బతింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు, సహచరులు ఆయనను రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

అయితే ఆ దుర్ఘటనలో పండు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో.. డాక్టర్లు వెంటనే అవసరమైన సర్జరీ చేశారు. మొన్నటివరకు ఆస్పత్రిలోనే ఉన్న పండు మాస్టర్ ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. తన నివాసంలోనే పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పండు మాస్టర్ ను పరామర్శించారు. స్వయంగా పండు ఇంటికెళ్లిన శేఖర్ మాస్టర్, అతని ఆరోగ్య పరిస్థితిని, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

ఇక ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే అతను సాధారణ స్థితికి వస్తాడని వైద్యులు కూడా చెబుతున్నారు. అంతకు ముందు నందు, స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు తదితరుల బుల్లితెర సెలబ్రిటీలు పండు మాస్టర్ ను పరామర్శించారు.

English Summary

It is known that Pandu Master, a famous dancer of Dhee fame, was recently involved in a road accident. Pandu Master was attending a special dance event at a fair held near Thagarapuvala.