ఒకేసారి 64 చపాతీలు తిన్నా.. వెయిటర్ కూడా షాక్ అయ్యాడన్న స్టార్ హీరో !!

బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు "జాన్ అబ్రహాం". మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 'జిస్మ్' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ధూమ్, న్యూయార్క్, దోస్తానా, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, మద్రాస్ కేఫే, బాట్లా హౌస్, సత్యమేవ జయతే, వేదా, ది డిప్లొమాట్, పఠాన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా కనిపించే జాన్.. తన బాడీ బిల్డింగ్, ఫిట్ నెస్ తో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఇంత ఫిట్‌గా ఉండే జాన్.. ఒకప్పుడు ఏకంగా 64 చపాతీలు తిన్నానంటూ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

ఇక ఇటీవల ప్రముఖ కామెడీ షో 'ది కపిల్ శర్మ షో'లో పాల్గొన్న జాన్ అబ్రహాం తన టీనేజ్ లో జరిగిన ఓ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఫుట్‌బాల్ అంటే తనకు చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టమని, మ్యాచ్‌లు ఆడిన తర్వాత విపరీతమైన ఆకలి వేసేదని చెప్పారు. ఒకసారి ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ఓ గుజరాతీ అన్‌లిమిటెడ్ థాలీ రెస్టారెంట్ కు వెళ్లినట్లు చెప్పారు. అక్కడ చిన్న చిన్న చపాతీలు వరుసగా వడ్డిస్తుండటంతో తింటూ తింటూ ఏకంగా 64 చపాతీలు ముగించేశానని నవ్వుతూ వెల్లడించారు.

Advertisement

అంతలో అక్కడి వెయిటర్ ఆశ్చర్యపోయి.. "సార్.. థాలీలో అన్నం కూడా ఉంది" అని చెప్పాడట. దానికి జాన్ సరదాగా "ముందు చపాతీలు తీసుకురండి.. తర్వాత చూద్దాం" అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. చివరకు 64 చపాతీలు తిన్న తర్వాత కూడా అన్నం వదిలేయకుండా పూర్తి భోజనం చేశానని చెప్పడంతో షోలో ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు. జాన్ చెప్పిన ఈ సంఘటనకు కపిల్ శర్మతో పాటు ఇతర అతిథులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ప్రస్తుతం జాన్ అబ్రహాం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న 'ఫోర్స్ 3' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, తాన్యా మణిక్తల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'ఫోర్స్' ఫ్రాంచైజీని మరింత భారీ స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు జాన్ ఇటీవల వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని యాక్షన్ ఆధారిత చిత్రాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

English Summary

"John Abraham" has earned a special recognition as an action hero in Bollywood. He started his career as a model and made his debut as a hero with the movie 'Jism'.