తండ్రి కాళ్లపై పడ్డ అఖిల్: ఏడ్చేసిన నాగార్జున


అక్కినేని అభిమానులకు, సినీ ప్రియులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' చిత్రం జూలై 10న థియేటర్లలోకి వచ్చి, బాక్సాఫీస్ వద్ద విజయం దిశగా అడుగులు వేస్తోంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో చిత్తూరు నేపథ్యంతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి కూడా సానుకూల స్పందనను సొంతం చేసుకుంది.

Advertisement

కెరీర్‌లో ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎంతో శ్రమించిన అఖిల్‌కు 'లెనిన్' సినిమాతో ఆ నిరీక్షణ ఫలించడంతో, అక్కినేని కాంపౌండ్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో, దివంగత నటసామ్రాట్ ఏఎన్నార్ విగ్రహం వద్ద సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది.

Advertisement
'అయ్యగారే నెంబర్ వన్ ఫ్యాన్' కు అఖిల్ ఊహించని గిఫ్ట్.. ఇలా ఏ హీరో చేయడేమో..!

నాగార్జున కాళ్లకు మొక్కిన అఖిల్

ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అఖిల్ కలసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే, ఆ సమయంలో అక్కడ చోటుచేసుకున్న ఒక దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించింది. ఎప్పుడూ ఎంతో గంభీరంగా, ప్రశాంతంగా కనిపించే కింగ్ నాగార్జున, తన చిన్న కుమారుడు ఎట్టకేలకు ఘన విజయాన్ని అందుకున్నాడనే ఆనందంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.

తండ్రి పడుతున్న ఆనందాన్ని, ఆయన కళ్లలోని తడిని చూసిన అఖిల్ ఒక్కసారిగా ఏడుస్తూ నాగార్జున కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. కొడుకు ప్రయోజకుడై, కష్టానికి తగిన విజయం సాధించినప్పుడు ఒక తండ్రి పొందే ఆనందం మాటలకు అందదని, ఈ దృశ్యాలు దానికి ప్రత్యక్ష నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement
అఖిల్ 'లెనిన్' మూవీ ఆల్రెడీ బ్లాక్ బస్టర్: సమంత పోస్టు వైరల్

అఖిల్ విశ్వరూపం.. కమర్షియల్ సక్సెస్

చిత్తూరు యాస, అక్కడి సంస్కృతి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో అఖిల్ నటనకు, దర్శకుడు రాసుకున్న సస్పెన్స్ ట్విస్టులకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటించగా, నాగార్జున, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. మొత్తానికి, 'లెనిన్' విజయంతో అఖిల్ అక్కినేని ఖాతాలో ఒక మాస్ కమర్షియల్ హిట్ చేరడమే కాకుండా, అక్కినేని కాంపౌండ్‌లో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు మధురమైన ముగింపు లభించింది!

English Summary

Lenin: A festive atmosphere prevailed at Annapurna Studios following the success of the movie . Akhil fell at his father's feet and was moved to tears.