యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించి యూత్ కు బాగా కనెక్ట్ అయిన హీరో మౌళి. ఆ తర్వాత #90s వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అలా తొలి వెబ్ సిరీస్ తోనే హిట్ కొట్టాడు. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్ మూవీతో తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాంతో మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు మౌళి. ఈ సినిమాకు 'దొంగ నా కొడుకు' అనే క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు.
అయితే ఈ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ ను తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రం పూర్తిగా దొంగతనం నేపథ్యంతో సాగుతుందని.. ఇది ఒక పూర్తిస్థాయి క్రైమ్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను అలరించబోతోందని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ టైటిల్, ఫస్ట్ లుక్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ ను చూస్తే ఈ మూవీలో మౌళి దొంగ పాత్రలో నటించనున్నట్లు సమాచారం అందుతోంది.
పోస్టర్ లో హీరో మౌళి బంగారు నగలను దోపిడీ చేసి తన బ్యాగులో నింపుకుని వేగంగా పరిగెత్తుతూ కనిపిస్తాడు. అయితే ఆ బ్యాగ్ నుంచి నగలు కింద పడిపోతున్నట్లుగా చూపించారు. ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
'దొంగ నా కొడుకు' చిత్రానికి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే లిటిల్ హార్ట్స్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మౌళి ఇప్పుడు దొంగ నా కొడుకు చిత్రంతోనూ మరో హిట్టు కొట్టడం గ్యారంటీ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ కూడా కామెడీ ప్రధానంగా సాగుతున్న నేపథ్యంలో మౌళి మార్క్ టైమింగ్ కామెడీతో ప్రేక్షకులను అలరించే అవకాశాలే అధికంగా ఉన్నాయి.