పాకిస్థానీ డ్రామాలో ఇస్లాంకు అవమానం: నటిపై భగ్గుమన్న జనం!

పాకిస్థానీ డ్రామా సీరియల్ 'జబ్త్' ప్రస్తుతం ఓ వివాదాస్పద దృశ్యం కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పాకిస్థానీ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ 'జియో టీవీ'లో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీరియల్‌లోని ఓ సీన్ ముస్లింల ధార్మిక భావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఛానెల్ యాజమాన్యంపై, సదరు నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో ఛానెల్ యాజమాన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.

Advertisement

అసలు వివాదం ఏమిటంటే?
ఈ వివాదమంతా జబ్త్ డ్రామా 20వ ఎపిసోడ్లోని ఓ నిర్దిష్ట దృశ్యం చుట్టూ తిరుగుతోంది. ఈ సీన్‌లో నటి సారా ఐజాజ్ పోషించిన పాత్ర తీవ్రమైన కోపంతో, మానసిక ఆందోళనతో ఉన్నట్లు చూపిస్తారు. తన కోపాన్ని ప్రదర్శించే క్రమంలో ఆమె గదిలోని బుక్ షెల్ఫ్ నుంచి పుస్తకాలను ఒక ఒకదాని తర్వాత ఒకటి కిందకు విసిరేయడం ప్రారంభిస్తుంది. ఈ ఎపిసోడ్ ప్రసారమైన వెంటనే కొందరు అప్రమత్తమైన సోషల్ మీడియా వినియోగదారులు ఆ సీన్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, వీడియో క్లిప్‌లను నెట్టింట షేర్ చేయడంతో ఈ వివాదం వేగంగా వ్యాపించింది.

Advertisement

ఆ దృశ్యంలో అంత అభ్యంతరకరం ఏముంది?
నెటిజన్లు షేర్ చేసిన వీడియోలు, ఫోటోల ప్రకారం.. నటి కోపంతో నేలపైకి విసిరేసిన పుస్తకాలలో ఓ పుస్తకం "ఇస్లామిక్ స్టడీస్"కు సంబంధించినదిగా ఉంది. ఆ పుస్తకం కవర్ పేజీపై పవిత్రమైన కాబా చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అంతటితో ఆగకుండా ఆ పుస్తకాలు నేలపై పడినప్పుడు కొన్ని పేజీలు తెరుచుకుని కనిపించాయి. వాటిపై పవిత్ర ఖురాన్ ఆయత్‌లు, హదీస్‌లు రాసి ఉన్నాయి. పవిత్రమైన మత గ్రంథాలను ఈ విధంగా నేలపైకి విసిరేయడం చూసి ముస్లిం సమాజం భగ్గుమంది. రేటింగులు, వ్యూల్ కోసమే ఇలాంటి చౌకబారు స్టంట్లు చేస్తున్నారంటూ మండిపడింది.

Advertisement

యూట్యూబ్ నుంచి ఎపిసోడ్ తొలగింపు
వివాదం ముదరడం, ప్రజల ఆగ్రహం కట్టులు తెంచుకోవడంతో జియో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తక్షణమే స్పందించింది. తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్ నుంచి జబ్త్ డ్రామాకు సంబంధించిన ఆ 20వ ఎపిసోడ్‌ను వెంటనే తొలగించింది. అయితే కేవలం ఎపిసోడ్‌ను తొలగించినంత మాత్రాన ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఈ ఘోర తప్పిదానికి జియో టీవీ ఉన్నతాధికారులు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని సాంప్రదాయ సంస్థలు ఈ వ్యవహారంపై దేశీయ నియంత్రణ సంస్థ చేత చట్టపరమైన విచారణ జరిపించాలని కోరుతున్నాయి.

Advertisement

ఎవరీ సారా ఐజాజ్?
ఈ వివాదాస్పద సీన్‌లో నటించిన సారా ఐజాజ్ పాకిస్థానీ టెలివిజన్ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న నటి. ఆమె ఇండస్ట్రీలో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. 'జబ్త్' సీరియల్‌లో కూడా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఇప్పుడు మతపరమైన సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఇంతటి సున్నితమైన వివాదంలో చిక్కుకోవడం వల్ల, ఆమె ఎదుగుతున్న నటన కెరీర్‌పై దీని ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

English Summary

Pakistani Drama serial Zabt on Geo TV faces severe backlash for a controversial scene. The 20th episode was removed from YouTube after social media users called it an insult to Islam.