టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. సినీ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత

తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగులో విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ సింగ్ రావత్(74) గుండెపోటుతో కన్నుమూశారు. ప్రదీప్ రావత్ అంటే చాలామందికి తెలియదు. కానీ భిక్షూ యాదవ్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. 2004 లో వచ్చిన సై సినిమాలో విలన్ భిక్షూ యాదవ్‌ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా ఆయన తెలుగులో తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' లో కనిపించారు. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించిన ఆయన టాలీవుడ్ లో మోస్ట్ ఫేమస్ విలన్ గా ప్రశంసలు అందుకున్నారు.

Advertisement

ప్రదీప్ రావత్ తెలుగుతోపాటు హిందీ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించారు. తెరపై విలన్ అంటే ప్రదీప్ రావత్ మాత్రమే గుర్తుకువచ్చేలా ఆయన తన నటనతో మెప్పించారు. బీఆర్ చోప్రా మహాభారత్ లో అశ్వత్థామ పాత్రలో తొలిసారిగా చిత్ర సీమకు పరిచయం అయ్యారు. అలా తెలుగులో తొలిసారిగా సై సినిమాలో నటించారు ప్రదీప్ రావత్. ఆ తర్వాత తమిళంలో గజిని(2005) చిత్రంలో నటించారు. సై తర్వాత భద్ర, ఛత్రపతి, లక్ష్మి, స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం తదితర చిత్రాల్లో నటించారు.

Advertisement

ఆ తర్వాత రెబల్, నాయకుడు, బాద్ షా, వన్ నేనొక్కడినే, అల్లుడు శీను, లయన్, సౌఖ్యం, నేను శైలజ, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, కాటమరాయుడు, జై లవకుశ, వాల్తేరు వీరయ్య, గాయపడ్డ సింహం తదితర చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. 2004 లో సై సినిమాకు గానూ బెస్ట్ విలన్ ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. అలాగే సంతోషం బెస్ట్ విలన్ అవార్డు కూడా సై సినిమాకు దక్కింది. అలాగే సై సినిమాకు నంది అవార్డు కూడా ప్రదీప్ రావత్ ను వరించింది. ఇక ప్రదీప్ రావత్ మరణం ఇండస్ట్రీకు తీరని లోటుగా భావించవచ్చు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అటు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.