భారతీయ సంస్కృతిలో ఇతిహాస గాథ అంటే రామాయణం అనే చెప్పాలి. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సైతం ఇప్పటికే ఎన్నో చిత్రాలు తెరకెక్కి ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి బాలీవుడ్ లో భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో "రామాయణ" మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ రాక్‌స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకులుగా హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ వ్యవహరిస్తున్నారు. అలానే శ్రీధర్ రాఘవన్ రచయితగా పని చేస్తుండగా.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2025 దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా బడ్జెట్ రూ. 2,000 కోట్ల నుంచి రూ. 4,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
అయితే కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోందంటే.. ఎంత పగడ్బందీగా థియేటర్లలోకి తీసుకొస్తారో అందరికీ తెలిసిందే. ఎక్కడా ఎటువంటి లీక్ జరగకుండా చిత్ర బృందం అత్యంత కఠినంగా నియమాలను పాటిస్తూ ఉంటుంది. కానీ వేల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రామాయణ మూవీ నుంచి ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది . తాజాగా సినిమాకాన్ ఈవెంట్లో ప్రదర్శించిన అఫీషియల్ ట్రైలర్ నుంచి ఒక 11 సెకండ్ల నిడివి ఉన్న క్లిప్ లీక్ అయ్యింది అంటూ ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఏముందంటే? వీడియోలో.. శ్రీరాముడి అవతారంలో రణబీర్ కపూర్ కనిపిస్తూ.. తన ముందు ఉన్న ఒక భారీ రాక్షసుడిపై బాణం గురిపెట్టి విసరడం కనిపిస్తోంది. కానీ ఈ 11 సెకండ్ల వీడియోలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో అనుకున్నంతగా లేడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆయన ముందు నిలబడిన ఒక భారీ ఆకారం మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ లీక్డ్ వీడియో క్లిప్ పై మీమ్స్ , ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఫేక్ వీడియో ??? మరోవైపు.. ఇది నిజంగానే ట్రైలర్ నుంచి లీకైన 11 సెకండ్ల నిడివి ఉన్న వీడియోనా లేక ఏఐతో సృష్టించిన ఫేక్ వీడియోనా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం పరుస్తున్నారు. మరి ఈ అనుమానాలకు తెరపడాలి అంటే మేకర్స్ అఫీషియల్ గా గ్లింప్స్ రిలీజ్ చేస్తే తప్ప దీని వెనుక ఉన్న అసలు విషయం బయటికి రాదు. ఇలాంటి లీక్డ్ వీడియోల వల్ల సినిమా హైప్ ను నాశనం చేస్తున్నాయని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.