గాయంపై ర‌ష్మిక మంద‌న్న క్లారిటీ.. దేవుడే ఇలా బ్రేక్ ఇచ్చాడంటూ..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణబాలి, మైసా, రాకా తదితర సినిమాలు ఆమె చేస్తున్నారు. అయితే ఇటీవల మైసా షూటింగ్ స్పాట్ లో కీలకమైన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అయితే వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచనలు చేశారు. అయితే తాజాగా తనకు తగిలిన గాయంపై రష్మిక కీలక పోస్టు పెట్టారు. ఈ మేరకు గాయంపై తొలిసారిగా స్పందించారు.

మైసా మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు రైట్ హిప్ ఏరియాలో టెండన్ డిటాచ్ మెంట్ జరిగిందని పేర్కొన్నారు. ఇలా జరగడం ఇది మూడోసారని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. శరీరాన్ని మెషిన్ లా కాకుండా మనిషి శరీరంలా చూసుకోవడం ముఖ్యమని వివరించారు. ఈ సెలవుల్లో పజిల్స్ పూర్తి చేస్తున్నానని అలాగే బరువు పెరగకుండా ఉండటానికి ట్రై చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఇన్ స్టా పోస్టులో పేర్కొన్నారు. దేవుడే తనకు ఇలా బ్రేక్ ఇచ్చాడని అంటూ పోస్ట్ పెట్టారు.

గాయం కారణంగా మంచానికే పరిమితం కావడంతో తనకు బోర్ కొడుతుందని.. టైమ్ పాస్ కోసం ఇలా పజిల్స్ ను సాల్వింగ్ చేస్తున్నట్లు రష్మిక స్పష్టం చేశారు. ప్రతి రోజూ గంటల తరబడి వర్క్ అవుట్స్.. రన్నింగ్ చేసేదానినని.. ఎక్కువగా తింటే ఎక్కడ బరువు పెరుగుతానోనని భయంగా ఉంది.. అని పేర్కొంది. ఈ మేరకు రష్మిక పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రష్మిక.. తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో టాక్సీవాలా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్​ పై వై. రవిశంకర్, నవీన్ యెర్నేని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్- రష్మిక ఇరువురికీ పెళ్లి అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.