సంధ్య థియేటర్ కేసు: అల్లు అర్జున్‌కు న్యాయస్థానం ఊరట!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణకు ఆయన భౌతికంగా కాకుండా.. వర్చువల్‌గా హాజరయ్యేందుకు న్యాయస్థానం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ దాఖలు చేసిన మినహాయింపు పిటిషన్‌ను న్యాయస్థానం ఆమోదించింది.

Advertisement

ప్రస్తుతం అల్లు అర్జున్ ఓ పాన్ ఇండియా మూవీ షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ 'రాకా' షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరంతర ప్రయాణాలు, షూటింగ్ టైమ్‌లైన్స్, పాత్ర కోసం మార్చుకున్న గెటప్ మార్పుల కారణంగా ప్రతిసారీ హైదరాబాద్ రావడానికి వీలుపడటం లేదని.. తీవ్రమైన లాజిస్టికల్ ఇబ్బందులు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదలను అంగీకరించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జులై 29, 2026కు వాయిదా వేశారు.

Advertisement

కేసు వివరాలిలా..
2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానుల కారణంగా అక్కడ తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసుపై నెలల తరబడి సమగ్ర దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి.. అల్లు అర్జున్‌ను కూడా 3 గంటల పాటు విచారించారు. అనంతరం థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ బౌన్సర్లు సహా మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. ప్రస్తుతం ప్రాథమిక ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తిస్థాయి విచారణ ప్రారంభం కానుంది. న్యాయస్థానం ఇచ్చిన ఈ తాజా మినహాయింపుతో అల్లు అర్జున్ తన పాన్-ఇండియా చిత్ర షూటింగ్స్ ఆటంకం లేకుండా చూసుకుంటూనే.. మరోవైపు న్యాయపరమైన విచారణకు హాజరయ్యే అవకాశం లభించింది.

English Summary

Sandhya Theatre Case, In a major relief, Nampally Court has permitted Tollywood star Allu Arjun to appear virtually in the Sandhya Theatre stampede case due to his tight shooting schedule for 'RAAKA'.