ఒకప్పుడు నేషనల్ అవార్డు నటుడు.. ఇప్పుడు ఆటో డ్రైవర్ !!


విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో.. ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు అందుకున్న ఓ బాలనటుడు.. నేడు కుటుంబాన్ని పోషించేందుకు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతని పేరు షఫిక్ సయ్యద్. ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కించిన చిత్రం 'సలామ్ బాంబే'. 1988లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.

Advertisement

ఎవరీ షఫిక్..

1980వ దశకంలో సాధారణ కుటుంబంలో జన్మించిన షఫిక్ సయ్యద్‌కు సినిమాలంటే అపారమైన ఆసక్తి. బాలీవుడ్ సినిమాల్లో కనిపించే ముంబై నగరాన్ని నిజంగా చూడాలనే కలతో చిన్న వయసులోనే బెంగళూరులోని తన ఇంటి నుంచి పారిపోయాడు. చేతిలో డబ్బుల్లేవు.. టికెట్ కూడా లేదు. అయినా రైలెక్కి ముంబై చేరుకున్నాడు. అక్కడ రోజులు వీధుల్లోనే గడిపాడు. చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆకలితో, ఆశతో జీవించాడు.

Advertisement

ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది. వీధి పిల్లల కోసం నిర్వహిస్తున్న ఓ యాక్టింగ్ వర్క్‌షాప్‌లో పాల్గొంటే రూ.20 ఇస్తామని ఓ మహిళా కాస్టింగ్ ఏజెంట్ చెప్పింది. అది మోసమని భావించిన మిగతా పిల్లలంతా పారిపోయారు. కానీ ఆకలితో ఉన్న షఫిక్ మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ ఒక్క నిర్ణయమే అతని జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది. ఆ సినిమాలో షఫిక్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసల వెల్లువెత్తాయి.

అయితే చిన్న వయసులోనే సహజమైన నటనతో అందరినీ కట్టిపడేసిన అతడికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. ఆ అవార్డుతో తన జీవితమే మారిపోతుందని.. ఇక వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తాయని అతడు కలలు కన్నాడు. కానీ వాస్తవం మాత్రం పూర్తిగా భిన్నంగా మారింది. జాతీయ అవార్డు వచ్చినా కానీ.. బాలీవుడ్‌లో అతనికి ఆశించిన అవకాశాలు రాలేదు. ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగినా.. నిర్మాతలు, దర్శకులను కలిసీనా చివరకు నిరాశే ఎదురైంది.

Advertisement

దాంతో చివరకు ముంబైని విడిచి బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు పెరగడంతో నటన కలలను పక్కనబెట్టి జీవనోపాధి కోసం ఆటో నడపడం ప్రారంభించాడు. ఐదుగురు సభ్యులతో కూడిన కుటుంబాన్ని పోషించేందుకు ఇప్పటికీ ఆటో డ్రైవర్‌గా కష్టపడుతూనే ఉన్నాడు. మొత్తానికి ఈ ఇతని స్టోరీ సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే కెరీర్ ని నిర్ణయించదని.. అదృష్టం కూడా ఉండాలని మరోసారి రుజువు చేస్తోంది.

English Summary

This is the strange drama that fate has played. A child actor who once received a National Award for his brilliant acting, today makes a living as an auto driver to support his family.