ప్రధాని మోదీ సందర్శించిన 9వ శతాబ్దం నాటి ఆలయం- మనమూ ఓ లుక్కేద్దామా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో కలిసి చారిత్రక ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల నేతలు ప్రాచీన ఆలయ పరిరక్షణకు చొరవ చూపారు. సముద్రాలు దాటినా చెక్కు చెదరని భారతీయ సంస్కృతికి, హిందూ సంప్రదాయాలకు ఈ ప్రంబనన్ దేవాలయం ఒక ప్రత్యక్ష సాక్ష్యం.

Advertisement

ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా పేరొందిన ఈ ప్రదేశం ఓ పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు..శతాబ్దాలుగా భారత్, ఇండోనేషియాకు మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం, చారిత్రక వారసత్వ సంపదను సజీవ సాక్ష్యం.

Advertisement

ప్రంబనన్ ఆలయ సుదీర్ఘ చరిత్ర

ఈ ప్రంబనన్ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. తొమ్మిదో శతాబ్దంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఇండోనేషియా జావా ద్వీపంలో ఉందీ ఆలయం. దీని నిర్మాణాన్ని సంజయ వంశానికి చెందిన రాజులు ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. నాటి శిల్పకారుల నైపుణ్యానికి ఈ ఆలయం అఖండ జ్యోతిలా నిలిచింది. వందల సంఖ్యలో చిన్న చిన్న అనుబంధ దేవాలయాలతో నిర్మితమైన ఈ సువిశాల సముదాయం అప్పట్లోనే గొప్ప వాస్తుకళా అద్భుతంగా పేరుగాంచింది.

కాలక్రమేణా ఇండోనేషియాలో సంభవించిన పెను భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రభావం వల్ల అవి ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలవ్వడంతో నాటి పాలకులు తమ రాజధాని నగరాన్ని తూర్పు జావాకు మార్చారు. ఆ తర్వాత కాలంలో ఈ ఆలయం ఆదరణ కోల్పోయింది. శతాబ్దాల పాటు దట్టమైన అడవుల పచ్చదనాన్ని కప్పుకొని ఉండిపోయింది.

Advertisement

ఆ తర్వాతి కాలంలో జరిగిన ఎన్నో అన్వేషణల వల్ల అక్కడి ఆలయాలన్నీ కూడా తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న చొరవ, ఇతర అంతర్జాతీయ సంస్థల పునరుద్ధరణ పనుల వల్ల ఈ ఆలయాలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. యునెస్కో 1991లో ప్రంబనన్ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది కూడా.

ఆర్కిటెక్చర్, శిల్పకళా వైభవం

త్రిమూర్తులు- శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడికి ఇక్కడ ప్రత్యేక గుడులు ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే ఎత్తుగా ఉండే ప్రధాన ఆలయం లయకారుడైన శివుడికి అంకితం అయింది. ఈ ప్రధాన శివాలయం దాదాపు 47 మీటర్ల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉంటుంది. నిర్మాణ శైలి నాటి భారత వాస్తుకళను పోలి ఉంటుంది. ఆలయ గోడలపై చెక్కిన రామాయణ మహాకావ్యానికి సంబంధించిన కథా శిల్పాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

Advertisement

సీతాపహరణం, హనుమంతుడి లంకాదహనం, శ్రీరాముడి విజయ గాథల వంటి ఘట్టాలను రాతిపై అత్యంత అందంగా చెక్కారు నాటి శిల్పులు. శతాబ్దాల క్రితమే ఇండోనేషియా ప్రజలు రామాయణాన్ని ఎంతగా గౌరవించారో తెలుసుకోవడానికి ఈ శిల్పకళా రూపాలు మనకు అద్భుతమైన ఆధారాలు. ఈ ఆలయ ప్రాంగణం శివాలయానికే పరిమితం కాలేదు. దీని చుట్టూ వందలాది చిన్న దేవాలయాల అవశేషాలు ఉన్నాయి.

ఈ సముదాయం సమీపంలోనే ఉన్న సేవూ బౌద్ధ ఆలయం చూసి తీరాల్సిన ప్రదేశం. హిందూ, బౌద్ధ మతాలు ఇండోనేషియాలో ఎంత సామరస్యంగా విలసిల్లాయో చెప్పడానికి ఈ రెండు కట్టడాల కలయిక గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. హిందూ పురాణాల ప్రభావాన్ని ఇండోనేషియా సంస్కృతి ఎప్పటికీ మరచిపోలేదని నిరూపించడానికి ఇక్కడి సంప్రదాయ నృత్యాలే నిదర్శనం.

Advertisement

ప్రంబనన్ ఆలయ ప్రాంగణంలో రాత్రి వేళ 'రామాయణ బ్యాలెట్' ను ప్రదర్శిస్తారు. పర్యాటకులలో ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుందీ కళా ప్రద్శన. వందలాది మంది నృత్యకారులు రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తున్నప్పుడు రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. దీన్ని వీక్షించడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించే పర్యాటకుల గైడ్

ఇండోనేషియాకు వెళ్లాలనుకునే ప్రతి పర్యాటకుడూ దీన్నే ప్రధానంగా సందర్శిస్తుంటాడు. యోగ్యకర్త సిటీ నుండి ప్రంబనన్ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. యోగ్యకార్తకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు అనేకం అందుబాటులో ఉన్నాయి. బస్సులు, ట్యాక్సీలతో పాటు రైలు మార్గం ద్వారా సులభంగా ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చు.

Advertisement

ఈ చారిత్రక రాజసం కలిగిన ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి ఏటా మే నెల నుండి అక్టోబర్ నెలల మధ్య కాలం అనుకూలమైనది. ఈ సమయంలో ఇండోనేషియాలో రుతుపవనాల ప్రభావం చాలా తక్కువ. పొడి వాతావరణం ఉంటుంది. దీనివల్ల పచ్చటి ఉద్యానవనాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయ కొండలను ఎటువంటి ఇబ్బంది లేకుండా సందర్శించవచ్చు.

సూర్యోదయ సమయంలో వాతావరణం చల్లగా ఉండటంతో పాటు పర్యాటకుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి మాత్రం సాయంత్రపు సమయం అనుకూలంగా ఉంటుంది. నారింజ రంగు సూర్యకిరణాలు రాతి ఆలయ శిఖరాలపై పడినప్పుడు ఆ దృశ్యం అత్యంత రమణీయంగా కనిపిస్తుంది. విశాలమైన మైదానాల్లో ఈ ఆలయ నీడలు ఫోటోగ్రాఫర్లకు ఎన్నో అద్భుతమైన ఫ్రేములను అందిస్తాయి.

ఈ ఆలయ సముదాయాన్ని సౌకర్యవంతంగా సందర్శించడానికి కనీసం నాలుగు గంటల సమయమైనా పడుతుంది. అందువల్ల పర్యాటకులు కాటన్ దుస్తులను, నడవడానికి అనువైన పాదరక్షలను ఎంచుకోవడం చాలా అవసరం. ఎండ వేడి నుండి తగిన ఉపశమనం కోసం సన్ స్క్రీన్ లోషన్లు, వాటర్ బాటిళ్ళు, గొడుగు వంటి వస్తువులను వెంట తీసుకెళ్లడం మంచిది.

English Summary

During his official visit to Indonesia, Indian Prime Minister Narendra Modi, accompanied by President Prabowo Subianto, explored the ancient Prambanan Temple. This visit highlights the centuries-old cultural ties between India and Indonesia, while cementing a new joint initiative to preserve this historic UNESCO World Heritage site for future generations to cherish.