తెలంగాణ బోనాలు ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా బోనాల పండగ నిర్వహించనున్నారు. ఈ పండగ నేపథ్యంలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. మరి ఈ బోనం తయారీలో చాలామంది మహిళలు తడబడుతుంటారు. ఈ పవిత్రమైన బోనం ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
బోనం తయారీకి కావాల్సిన పదార్థాలు బియ్యం ఒక గ్లాస్, పెసరపప్పు పావు గ్లాస్, బెల్లం ముప్పావు కప్పు, పాలు అర కప్పు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్ లు, యాలకుల పొడి చిటికెడు, నీళ్లు సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మట్టికుండ లేదా రాగి పాత్రలో తగినన్ని నీళ్లు పోయాలి. అలా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం, పప్పు వేసి అన్నం మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి.
అలా అన్నం ఉడికిన తర్వాత పాలు, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో చివరగా బెల్లం తురుము వేసి బెల్లం కరిగిపోయేంత వరకూ స్ట్రప్ చిన్నమంట మీద ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దించేయాలి. అంతే బోనం రెడీ అయినట్టే.. ఇక బోనం అలంకరణ చూస్తే.. అన్నం ఉడికిన పాత్ర(కుండ) బయటి భాగాన్ని పసుపు, కుంకుమ, సున్నంతో బొట్లు పెట్టాలి. అలా అలంకరించాలి. కుండ మెడకు వేప మండలు చుట్టాలి. పైన ఉన్న మట్టి ప్రమిదలో దీపం పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. మీరు కూడా ఈ బోనం తయారు చేయండి..