కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తే అందరికీ నచ్చడం పక్కా..!


కొత్తిమీర పచ్చడి అంటే తెలుగు ఇళ్లలో ఎంతో ఇష్టంగా తయారు చేసుకునే సంప్రదాయ వంటకం. కొత్తిమీర ఆకుల సువాసన, పచ్చిమిర్చి కారం, వెల్లుల్లి ఘాటు.. చింతపండు పులుపు కలిసిన ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. తక్కువ సమయంలో తయారయ్యే ఈ పచ్చడి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరీ ముఖ్యంగా కొత్తిమీరలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

Advertisement
ఆంధ్రా స్టైల్

ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో కూడా కొత్తిమీర కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు కూడా ఆహారంలో కొత్తిమీరను తరచుగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. తాలింపు వేసినా, వేయకపోయినా రుచిలో పెద్దగా తేడా లేకుండా ఉండటం దీని మరో ప్రత్యేకత. అంతేకాదు, ఈ పచ్చడి 2-3 రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

Advertisement

కావలసిన పదార్థాలు..

  • టమోటాలు - 100 గ్రాములు
  • మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర తరుగు (కాడలతో సహా) - 2 కప్పులు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • పచ్చిమిర్చి - 8-10
  • ఎండుమిర్చి - 4
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • చింతపండు - చిన్న ముక్క
  • పసుపు - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - సరిపడా

తయారీ విధానం..

  • ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కాడలతో సహా సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
  • స్టవ్‌పై ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర వేసి మిడియం మంటపై దోరగా వేయించాలి.
  • రంగు మారి మంచి వాసన వచ్చిన వెంటనే ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  • అదే పాన్‌లో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలు, టమోటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. సుమారు ఐదు నిమిషాల తర్వాత టమోటాలు మెత్తబడినప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి.
  • ఆపై చింతపండు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లబరచాలి.
  • మరోసారి పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడిచేసి, తరిగిన కొత్తిమీరను వేసి 2-3 నిమిషాలు మాత్రమే వేయించాలి. ఎక్కువగా వేయించకూడదు, లేకపోతే రంగు, సువాసన తగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  • మిక్సీ జార్‌లో ముందుగా వేయించిన పప్పులు-పల్లీల మిశ్రమాన్ని బరకగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి మిశ్రమం, టమోటా మిశ్రమం, కొత్తిమీర మిశ్రమాన్ని కలిపి పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయాలి.
  • కావాలంటే చివరగా ఒక చిన్న పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు చేసి పచ్చడిపై పోయవచ్చు. తాలింపు లేకుండా కూడా ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది.

English Summary

"Coriander Tomato Chutney" is a great option for those who want a different taste to their regular tomato chutney. The addition of coriander gives it a unique aroma and natural freshness compared to regular tomato chutney.