ఇడ్లీ పకోడా ఎప్పుడైనా తిన్నారా ? ఇలా చేస్తే మళ్లీ మళ్లీ తినాల్సిందే !!

సాధారణంగా దక్షిణ భారతదేశంలో ఉదయం టిఫిన్ అంటే ఇడ్లీ, దోసె, పూరీ.. ఉప్మా, మైసూర్ బోండా ఇలా పలు వెరైటీలు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది తినే టిఫిన్ అంటే ఇడ్లీలు అనే చెప్పాలి. అయితే ఇడ్లీలు మిగిలిపోయాయా ? వాటిని పారేయకుండా ఎంతో రుచికరమైన స్నాక్‌గా మార్చుకోవచ్చని తెలుసా ? అదే కరకరలాడే ఇడ్లీ పకోడా. బయట కరకరలాడే టెక్స్చర్, లోపల మెత్తగా ఉండే ఈ పకోడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. సాయంత్రం టీ టైమ్‌కు, వర్షాకాలంలో లేదా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు తక్కువ సమయంలో తయారయ్యే ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

Advertisement

అంతే కాకుండా కొంతమందికి జ్వరం తగ్గిన తర్వాత నోటికి రుచి సరిగా అనిపించకపోవచ్చు. అలాంటి సమయంలో ఎక్కువ మసాలా లేకుండా, తేలికగా మసాలాలు తగ్గించి ఈ ఇడ్లీ పకోడా తయారు చేసుకుని తినవచ్చు. అయితే ఇది స్నాక్ లాగా అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వేడివేడిగా ఉన్న ఇడ్లీ పకోడాను టమాటో సాస్, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా పల్లీల పొడితో వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం టీ లేదా కాఫీతో ఈ స్నాక్‌ను ఆస్వాదించవచ్చు.

Advertisement

కావాల్సిన పదార్థాలు..

ఇడ్లీలు - 6
శనగపిండి - 1 కప్పు
బియ్యప్పిండి - 3 టేబుల్ స్పూన్లు
కారం - 1 టేబుల్ స్పూన్ (రుచికి తగ్గట్టు)
పసుపు - చిటికెడు
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 నుంచి 4 (సన్నగా తరిగినవి)
కరివేపాకు - 8 నుంచి 10 ఆకులు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - అర కట్ట (తరిగినది)
ఉప్పు - తగినంత
వంట సోడా - చిటికెడు
నీరు - అవసరమైనంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

పల్లీల కారం పొడి కోసం (ఐచ్చికం)..

Advertisement

పల్లీలు - 1 కప్పు
ఎండుమిర్చి - 4
వెల్లుల్లి - 2 రెబ్బలు
ఉప్పు - తగినంత

తయారీ విధానం..

  • ముందుగా ఇడ్లీలను చిన్న చిన్న క్యూబ్స్‌లా కోసి పక్కన పెట్టాలి. కొంచెం చల్లారిన లేదా ఫ్రిజ్‌లో పెట్టిన ఇడ్లీలతో చేస్తే పకోడా మరింత కరకరలాడుతుంది.
  • ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి మరోసారి కలపాలి.
  • ఇప్పుడు కొద్దికొద్దిగా నీరు పోస్తూ బజ్జీ పిండిలా చిక్కగా కలుపుకోవాలి. చివరగా చిటికెడు వంట సోడా వేసి మెల్లగా కలపాలి. పిండి చాలా పల్చగా కాకుండా, ఇడ్లీ ముక్కలకు బాగా పట్టేలా ఉండాలి.
  • తరువాత ఇడ్లీ ముక్కలను ఈ పిండిలో వేసి అన్ని వైపులా పిండి పట్టేలా కలపాలి.
  • ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మీడియం స్థాయిలో ఉంచి పిండిలో ముంచిన ఇడ్లీ ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు అన్ని వైపులా సమంగా వేయించాలి.
  • వేయించిన తర్వాత టిష్యూ పేపర్‌పై తీసి అదనపు నూనె తొలగించాలి.

పల్లీల పొడి తయారీ..

Advertisement

పల్లీలు, ఎండుమిర్చి స్వల్పంగా వేయించి చల్లారనివ్వాలి. వాటితో పాటు వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీలో కొద్దిగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఇడ్లీ పకోడాపై చల్లి తింటే రుచి మరింత పెరుగుతుంది.

చిట్కాలు..

  • ఫ్రిజ్‌లో పెట్టిన ఇడ్లీలతో చేస్తే పకోడా మరింత క్రిస్పీగా వస్తుంది.
  • బియ్యప్పిండి కొద్దిగా ఎక్కువ వేస్తే బయట పొర మరింత కరకరలాడుతుంది.
  • వంట సోడా ఎక్కువ వేయకండి. చిటికెడు సరిపోతుంది.
  • తక్కువ నూనె పీల్చుకునేందుకు నూనె బాగా వేడయ్యాక మాత్రమే పకోడాలు వేయాలి.
  • పిల్లల కోసం తయారు చేస్తే కారం తగ్గించి, కొద్దిగా మిరియాల పొడి వేయవచ్చు.

English Summary

Generally, in South India, morning tiffin consists of many varieties like idli, dosa, puri, upma, Mysore bonda, etc. Most importantly, the most consumed tiffin is idlis.