'వయాగ్రా' సూపర్ పవర్.. సైంటిస్టులు చెప్పిన కొత్త విషయం ఇదే!

ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యల నివారణకు ఉపయోగించే 'వయాగ్రా' గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఔషధం కేవలం ఆ ఒక్క సమస్యకే పరిమితం కాకుండా అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవడంలోనూ కీలకంగా మారే అవకాశం ఉందని సైంటిస్టులు గుర్తించారు. వయాగ్రాలోని క్రియాశీల పదార్థం 'సిల్డెనాఫిల్' క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర అవయవాలకు పాకే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని సరికొత్త పరిశోధనలో తేలింది. అయితే క్యాన్సర్ చికిత్సకు వయాగ్రాను వాడటంపై మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెప్పారు.

బూడిద గుమ్మడికాయ హల్వా ఇలా చేసి తిని చూడండి.. దాంపత్య జీవితం జింగా లాలా!

గుండె మందు నుంచి క్యాన్సర్ నివారణ దాకా..
'సిల్డెనాఫిల్'ను మొదట గుండె సంబంధిత సమస్యల చికిత్స కోసం అభివృద్ధి చేశారట. ఆ తర్వాత 1998లో ఇది 'వయాగ్రా' పేరుతో అంగస్తంభన సమస్యల నివారణకు గుర్తింపు పొందింది. ఆపై ఊపిరితిత్తులలో అధిక రక్తపోటు తగ్గించడానికి కూడా దీనిని వాడడం ప్రారంభించారు. ఈ రెండు విధానాల్లోనూ సిల్డెనాఫిల్ 'పీడీఈ5' అనే ఎంజైమ్ ను అడ్డుకోవడం ద్వారా రక్తనాళాలను సడలిస్తుంది. అయితే ఇదే ఎంజైమ్ నిరోధం 'cGMP' అనే సిగ్నలింగ్ అణువును పెంచుతుందని.. అది క్యాన్సర్ కణాల్లోని కొలెస్ట్రాల్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సైంటిస్టులు తాజాగా కనుగొన్నారు.

ఇజ్రాయెల్‌లోని 'వీజ్‌మన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం.. సిల్డెనాఫిల్ వల్ల పెరిగే 'cGMP'.. క్యాన్సర్ కణాలలో ఉన్న కొలెస్ట్రాల్‌ను రీసైక్లింగ్ విభాగాల్లోనే లాక్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు ఒక చోటు నుంచి మరో చోటుకు కదిలేందుకు, రక్తం ద్వారా వేరే అవయవాలపై దాడి చేసేందుకు తమ బయటి పొరలను మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి కొలెస్ట్రాల్ అత్యంత అవసరం. సిల్డెనాఫిల్ ఈ కొలెస్ట్రాల్ ను కణాల పొరలకు అందకుండా అడ్డుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు కదిలే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఇది సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాలపైనే ఎక్కువ ప్రభావం చూపినట్లు నిర్ధారణ అయింది.

స్టాటిన్స్ తో కలిపి రెట్టింపు దాడి
క్యాన్సర్ కణాల్లో కొలెస్ట్రాల్ కొరత ఏర్పడినప్పుడు అవి స్వయంచాలకంగా మరిన్ని కొలెస్ట్రాల్ కణాలను తయారు చేసుకునేందుకు 'SREBP2' అనే వ్యవస్థను ప్రేరేపిస్తాయి. దీనికి కూడా అడ్డుకట్ట వేసేందుకు సైంటిస్టులు రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించే 'స్టాటిన్స్' ఔషధాన్ని సిల్డెనాఫిల్ తో కలిపి ప్రయోగించారు.

ఆ సమాచారం ఇస్తే 50వేల రూపాయల నగదు ప్రోత్సాహకం!

అంటే సంక్షిప్తంగా..
సిల్డెనాఫిల్: దాచి ఉంచిన కొలెస్ట్రాల్ బయటకు రాకుండా అడ్డుకుంటుంది.
స్టాటిన్స్: కొత్తగా కొలెస్ట్రాల్ తయారవ్వకుండా నిరోధిస్తాయి.

ఈ రెండు మందులను కలిపి వాడటం ద్వారా క్యాన్సర్ కణాల తయారీ, సరఫరా వ్యవస్థ రెండూ ఒకేసారి దెబ్బతిని, క్యాన్సర్ వ్యాప్తి గణనీయంగా తగ్గినట్లు ప్రయోగాల్లో తేలింది.

మానవుల్లో ఈ చికిత్స ఎంతవరకు సాధ్యం?
పరిశోధకులు ఇంకా నేరుగా క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనప్పటికీ.. ఇజ్రాయెల్ కు చెందిన 'క్లాలిట్ హెల్త్ సర్వీసెస్' లోని 20 ఏళ్ల ఆరోగ్య డేటాను విశ్లేషించారు. సిల్డెనాఫిల్, స్టాటిన్స్ రెండింటినీ క్రమం తప్పకుండా వాడిన క్యాన్సర్ బాధితుల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయని.. క్యాన్సర్ తిరగబెట్టడం తగ్గిందని గుర్తించారు. ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. సైంటిస్టులు వెంటనే క్యాన్సర్ కోసం వయాగ్రా వాడకూడదని హెచ్చరిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది.

English Summary

Sildenafil, the active ingredient in Viagra, traps cholesterol in cancer cells to prevent metastasis. Learn how combining Viagra with statins fights tumor growth.