ఆషాఢ మాసం: పెద్దలు చెప్పని రహస్యాలు, వైజ్ఞానిక నిజాలు

సనాతన ధర్మంలో కాల గణన కేవలం ఒక తేదీల పట్టిక కాదు.. ప్రకృతి గమనంతో, మానవ జీవన సరళితో ముడిపడిన ఒక అద్భుత వైజ్ఞానిక విజ్ఞానం. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ, కార్తీక మాసాల వలె విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన 'ఆషాఢ మాసం'పై నేటి తరానికి అనేక సందేహాలు, అపోహలు. అసలు ఆషాఢం.. ఆధ్యాత్మిక శక్తికి చైతన్య ద్వారంగా ఎలా మారిందో వివరిస్తుంది వన్ ఇండియా తెలుగు.

Advertisement

భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత, పరమార్థం ఉన్నాయి. సనాతన ధర్మంలో చాంద్రమాసాల పేర్లు ఆయా నెలల్లో వచ్చే పౌర్ణమి నాటి చంద్రుడి నక్షత్ర సంచారాన్ని బట్టి నిర్ణయించబడతాయి. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే విశిష్టమైన కాలమే 'ఆషాఢ మాసం'. సంస్కృత పరిభాషలో 'ఆషాఢ' అనే పదానికి 'అజేయమైనది', 'అపరాజితమైనది' (ఎన్నటికీ ఓటమి లేనిది) అని అర్థం. అందుకే ఈ మాసాన్ని విజయానికి, మానసిక దృఢత్వానికి, అంతర్గత ఆధ్యాత్మిక స్థైర్యానికి ప్రతీకగా పెద్దలు భావిస్తారు. అయితే, సమాజంలో కొందరిలో ఆషాఢం పట్ల ఉన్న అపోహలను పటాపంచలు చేస్తూ, ఈ మాసంలోని వైజ్ఞానిక, సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవడం నేటి తరం ఎంతైనా అవసరం.

Advertisement

శూన్యమాసం అంటే అశుభం కాదు..

ఈ ఏడాది ఆషాఢ మాసం జులై 15న ప్రారంభమై ఆగస్టు 12న చుక్కల అమావాస్యతో ముగుస్తుంది. జ్యోతిష శాస్త్ర నియమాల ప్రకారం సూర్యుడు మిథునరాశిలో సంచరిస్తున్నప్పుడు వచ్చే ఈ మాసాన్ని 'శూన్యమాసం' అంటారు. ఇక్కడ శూన్యం అంటే అశుభం అని అపార్థం చేసుకోకూడదు. లౌకికపరమైన వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి.. దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురుపూజలకు ప్రాధాన్యతనివ్వాలని శాస్త్రం చెబుతోంది.

పూరీ జగన్నాథ రథయాత్ర, శ్రీమహావిష్ణువు శయన స్థితికి చేరుకునే తొలి ఏకాదశి, మునుల అంతర్ముఖ సాధన చాతుర్మాస్య వ్రతారంభం, జ్ఞానాన్ని ప్రసాదించే గురుపౌర్ణిమ, అలాగే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బోనాల వంటి ఎన్నో మహత్తర పర్వదినాలు ఈ మాసంలోనే సంభవిస్తాయి.

Advertisement

గోరింటాకు అలంకరణ.. ఆయుర్వేద ఆరోగ్య రహస్యం

ఆషాఢంలో మహిళలు, పిల్లలు చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఒక గొప్ప ఆరోగ్య సూత్రం దాగి ఉంది. ఆయుర్వేద గ్రంథాలలో గోరింటాకును 'మదయంతిక' అని పిలుస్తారు. వర్షాకాల ప్రారంభంలో వచ్చే ఈ మాసంలో వాతావరణ మార్పుల వల్ల శరీరంలో పిత్తదోషం పెరుగుతుంది. గోరింటాకుకు శరీరంలోని అధిక ఉష్ణాన్ని తగ్గించి, చల్లదనాన్నిచ్చే అద్భుత గుణం ఉంది. వర్షాల వల్ల కాళ్లు, చేతులు తడవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి ఇది చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాలక్రమేణా ఈ ఆరోగ్య నియమం మన సంస్కృతిలో సౌభాగ్యానికి ప్రతీకగా, ఒక శుభప్రదమైన ఆచారంగా రూపాంతరం చెందింది.

Advertisement

కొత్త జంటల వియోగం.. సామాజిక, జీవన సమతుల్యత!

కొత్తగా వివాహమైన వధువును ఆషాఢంలో పుట్టింటికి పంపే సంప్రదాయం వెనుక మూఢనమ్మకాలు లేవు, కేవలం సామాజిక, ఆరోగ్యపరమైన కారణాలు మాత్రమే ఉన్నాయి. పూర్వకాలంలో భారతదేశం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. ఆషాఢ, శ్రావణ మాసాలు తొలి వర్షాలతో వ్యవసాయ పనులకు అత్యంత కీలకమైన సమయం. కొత్త జంటలు తమ వైవాహిక జీవితంలోనే మునిగిపోకుండా, ఉమ్మడి కుటుంబ వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని పెట్టారు. అంతేకాదు, ఈ మాసంలో గర్భధారణ జరిగితే ప్రసవ సమయం తీవ్రమైన వేసవికాలంలో (మార్చి, ఏప్రిల్) వస్తుంది. పూర్వకాలంలో వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం వల్ల, పుట్టిన బిడ్డకు, తల్లి ఆరోగ్యాన్ని కాపాడేందుకు దూరదృష్టితో మన పూర్వీకులు ఈ సామాజిక నియమాన్ని నిర్దేశించారు.

Advertisement

ఆహార నియమాలు.. కొనుగోళ్లపై అంచనాలు!

వర్షాకాలంలో జీర్ణశక్తి సహజంగానే మందగిస్తుంది. అందువల్ల ఈ కాలంలో త్వరగా అరగని మాంసాహారానికి దూరంగా ఉండి, సాత్వికాహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ఇక పెట్టుబడులు, కొనుగోళ్ల విషయానికి వస్తే.. పూర్వం రైతులు తమ ధనాన్ని పూర్తిగా వ్యవసాయ పెట్టుబడులకే పరిమితం చేసేవారు కాబట్టి విలాస వస్తువులకు దూరంగా ఉండేవారు. నేటి ఆధునిక కాలంలో సాధారణ కొనుగోళ్లకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ ఏడాది జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు 'గురు మౌఢ్యమి' కూడా ఉన్నందున, వివాహాది కార్యాలను, కొత్త వ్యాపార ప్రారంభాలను మౌఢ్యమి ముగిసిన తర్వాత వచ్చే శుభముహూర్తాల్లో నిర్వహించుకోవడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

English Summary

Explore the deep spiritual and scientific significance of Ashada Masam 2026. Learn why it is not an inauspicious month and discover the facts behind rituals like newlyweds staying apart and applying Gorintaku.