హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్ర నెలలో వచ్చే అత్యంత ముఖ్య పండుగలలో ఒకటి.. నాగుల చవితి, నాగపంచమి. ఈ సంవత్సరం నాగపంచమి ఈ నెల 17వ తేదీ సోమవారం నాడు భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రావణ సోమవారం కూడా రావడంతో ఈ పండగకు మరింత ప్రత్యేకత ఏర్పడింది. అదే సమయంలో ఈ ఏడాది నాగపంచమి నాడు అరుదైన యోగాలు కలిసి రావడం విశేషం. రవి, శుభ, శుక్ల యోగాల కలయికతో నాగపంచమి రాబోతోంది.
జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం, ఇటువంటి శుభ యోగాల సమయంలో చేసే పూజలు, పుణ్యకార్యాలు త్వరగా ఫలిస్తాయి. పరమేశ్వరుడి మెడలో సదా ఆభరణంగా ఉండే నాగదేవతను పూజించడం ద్వారా శివపార్వతుల అనుగ్రహం కూడా భక్తులకు కలుగుతుందని విశ్వసిస్తారు.
పంచాంగం ప్రకారం.. శ్రావణ శుక్ల పంచమి తిథి ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1: 22 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1: 30 నిమిషాలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ఉన్న సమయాన్నే పూజలకు ప్రామాణికంగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోన్నందున.. సోమవారం నాడే నాగపంచమి పండగను జరుపుకోవాలి. ఈ పర్వదినం నాడు నాగులను ఆరాధించడానికి అత్యంత అనుకూలమైన పూజా ముహూర్తం 17వ తేదీ తెల్లవారు జామున 6: 46 నిమిషాల నుంచి ఉదయం 9: 37 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వ్యవధిలో పూజలు పూర్తి చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ సమయంలో పుట్టలో పాలుపోయడం, విగ్రహాలకు పాలాభిషేకం చేయడం వల్ల ఫలితాలు లభిస్తాయని, జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పండగ రోజున తెల్లవారు జామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. నాగదేవత విగ్రహానికి గానీ, పుట్టకు గానీ పసుపు, చందనం, పువ్వులు, తేనె, కుంకుమతో పాటు పాలతో అభిషేకం చేయాలి. ఇంటికి రక్షణ చిహ్నాలుగా ద్వారాల దగ్గర పసుపు లేదా చందనాన్ని ఉపయోగించి పాము ఆకృతులను వేయాలి. నాగ మంత్రాలను జపించండం, నాగ పంచమి వ్రత కథను పఠించండం అత్యంత శ్రేయస్కరం. పురాణాల ప్రకారం.. అనంత, వాసుకి, పద్మ, మహాపద్మ, తక్షక, కులీర, కర్కట, శంఖ.. అనే పాములు పూజలు అందుకోవడం అనాదిగా వస్తోన్న ఆచారం. జాతకంలో రాహు, కేతు ప్రభావాలు లేదా కాళసర్ప దోషాలు ఉన్నవారు నాగపంచమి రోజున నాగదేవతను ఆరాధిస్తే వాటి తీవ్రత తగ్గుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. సర్పభయం నశించి, గృహంలో సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని విశ్వసిస్తారు. ఓ సంప్రదాయంగా మాత్రమే కాకుండా మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే పవిత్రమైన రోజుగా దీన్ని భావిస్తారు.పెట్రోల్, డీజిల్ సెస్ లను సవరించిన కేంద్రం- ఇకపై.. !!
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు