116 ఏళ్ల వృద్ధురాలికి టీటీడీ బంపర్ ఆఫర్! దొరకునా ఇటువంటి సేవ

శ్రీనివాసుని స్వామి పిలుపు రావాలంటే అదృష్టం ఉండాలి.. ఏడు కొండలు ఎక్కాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. వయసు మళ్లిన వారు సైతం స్వామి దర్శన భాగ్యం కోసం పరితపిస్తుంటారు. అది ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం. ఆ ఏడుకొండలవాడిని దర్శించుకోవాలని ఆ స్వామి అనుగ్రహం ఉంటే చాలు.. వయసు, శారీరక బలహీనతలు అన్నీ కేవలం అంకెలుగానే మిగిలిపోతాయని మరోసారి నిరూపితమైంది. భక్తి పారవశ్యంతో, గుండె నిండా గోవింద నామస్మరణతో 116 ఏళ్ల వృద్ధురాలు కాలినడకన తిరుమల కొండెక్కిన అద్భుత ఘట్టం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. భగవంతునిపై ఆమెకున్న అచంచలమైన భక్తి, పట్టుదల దేశవ్యాప్తంగా లక్షలాది మంది నెటిజన్లను, భక్తులను ముగ్ధులను చేస్తోంది.

Advertisement

ముందుగా అందరూ ఆమె కర్ణాటకకు చెందిన లక్ష్మవ్వ (భీమవ్వగా కూడా పిలుస్తారు)గా భావించారు. అయితే ఈ వృద్ధురాలి గురించి వారి కుటుంబం గురించి వివరాలు తెలుసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు.. టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని గుర్తించారు, ప్రస్తుతం తిరుపతి జీవకోనలోని బంధువుల వద్ద ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

శుక్రవారం నాడు 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. సాధారణంగా యువకులే నడవడానికి ఆయాసపడే చారిత్రాత్మక అలిపిరి కాలినడక మార్గాన్ని ఆమె ఎంచుకున్నారు. చేతిలో ఒక చిన్న కర్రను పట్టుకుని, కుటుంబ సభ్యుల అండతో, అడుగడుగునా 'గోవిందా.. గోవిందా..' అంటూ దాదాపు 11 కిలోమీటర్ల పొడవైన కఠినమైన దారిని ఆమె అధిగమించారు. శేషాచలం కొండల్లోని సుమారు 3,550 నిటారైన రాతి మెట్లను ఎలాంటి అలసట లేకుండా, కేవలం స్వామిపై ఉన్న నమ్మకంతోనే ఆమె ఎక్కి తిరుమలకు చేరుకున్నారు.

Advertisement

సోషల్ మీడియాను ఊపేసిన వీడియో.. సీఎం చంద్రబాబు ఫిదా!

సహచర భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ అసాధారణమైన భక్తి ప్రయాణాన్ని చూసి నెటిజన్లు జోహార్లు అర్పిస్తున్నారు. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. "నిజమైన భక్తి ముందు వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమేనని ఈ అవ్వ నిరూపించింది" అంటూ ప్రశంసించారు.

Advertisement

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బంపర్ ఆఫర్!

ఈ వైరల్ వీడియోపై తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే స్పందించారు. ఈ 116 ఏళ్ల వృద్ధురాలి భక్తిపారవశ్యం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. శ్రీనివాసునిపై ఆమెకున్న అపారమైన ప్రేమను గౌరవిస్తూ.. ఆ వృద్ధురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ తరఫున ప్రత్యేక వీఐపీ దర్శనం కల్పిస్తామని అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం (సోమవారం) వీరంతా శ్రీ వేంకటేశ్వర స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే భాగ్యం తనకు దక్కడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శ్రీవారి అనుగ్రహం ఆమెకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా కోరుకున్నారు.

English Summary

TTD Chairman BR Naidu announced a special darshan for a 116-year-old devotee from Karnataka who climbed the steep 3,550 Alipiri steps to Tirumala on foot.