టీటీడీలో నూతన స్లాట్ బుకింగ్- 488 మంది పేర్లు రిజిస్టర్: మీరూ ట్రై చేయవచ్చు

తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతనంగా ప్రారంభమైన చిన శ్రీవారి వైద్యసేవకు అపూర్వ స్పందన లభిస్తోంది. దేశ, విదేశాల నుంచి డాక్టర్లు, స్పెషలిస్టులు తమ పేర్లను నమోదు చేసుకుంటోన్నారు. హెల్త్ స్పెషలిస్టులకు మూడు రోజులు, ఇతర డాక్టర్లకు వారం రోజుల పాటు సేవను అందించే అవకాశాన్ని కల్పించింది టీటీడీ ఈ పథకం ద్వారా. ఆసక్తి ఉన్నవారు నెలరోజులు, ఆరు నెలలు లేదా ఏడాది పాటు కూడా స్వచ్ఛందంగా పని చేయవచ్చు.

Advertisement

టీటీడీ పరిధిలోని అన్ని ఆసుపత్రులు, గోశాల అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాధిపతుల ద్వారా సేవా స్లాట్లు కేటాయిస్తోంది. జూన్ 20 నుంచి స్లాట్ బుకింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే 488 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, వివిధ విభాగాల నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. ఎస్వీ గోసంరక్షణశాలలో జరుగుతున్న వైద్యసేవలను ఆయన పరిశీలించారు.

Advertisement

స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద కళాశాల, గోశాల, వైద్య విభాగం తదితర సంస్థల అధిపతులతో పలు సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సమగ్ర కార్యాచరణ రూపొందించిన అనంతరం ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మూడు నెలల ట్రయల్ రన్‌గా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీవారి వైద్యసేవలో భాగంగా ప్రారంభించిన గోసేవ కార్యక్రమానికి కూడా విశేష ఆదరణ లభిస్తోందని జేఈవో తెలిపారు. ఇప్పటివరకు మూడు బ్యాచ్‌ల సేవా స్లాట్లు పూర్తిగా భర్తీ కావడం ఈ కార్యక్రమానికి లభిస్తున్న విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. శ్రీవారి వైద్యసేవలో భాగంగా ఎస్వీ గోసంరక్షణశాలలో గోవులకు నిపుణులైన పశువైద్యులు సేవలందిస్తున్నారు. జూన్ 22- 28 వరకు మొదటి బ్యాచ్, జూన్ 29-జూలై 5 మధ్య రెండో బ్యాచ్ ముగిసింది. 6వ తేదీన మూడో బ్యాచ్ సేవలు ఆరంభం అయ్యాయి.

Advertisement

గోశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. వాటికి అవసరమైన దాణా, వైద్యం, శస్త్రచికిత్సలు, పోషకాహారం, రోజువారీ సంరక్షణపై గోశాల సిబ్బందికి నిపుణులు ప్రత్యేక సూచనలు అందిస్తున్నారు.

శ్రీవారి వైద్యసేవలో పాల్గొనడానికి మరింత మంది భాగస్వామ్యులు కావాలని జేఈవో ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మూడు నెలల ట్రయల్ రన్‌లో భాగంగా వైద్యులు, సేవకులు అందించే సూచనలు, సలహాలను స్వీకరించి అవసరమైన మార్పులు చేసి, శ్రీవారి వైద్యసేవను పూర్తిస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

English Summary

488 Medical Specialists Join Voluntary Care SV Gosamrakshana Shala Delivers Advanced Cow Healthcare. TTD Joint Executive Officer Dr A Sharath said the Srivari Medical Seva programme has received an overwhelming response from specialist doctors in India and abroad.