తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 7వ తేదీన ఆడికృత్తిక పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోన్నారు. ఈ పండుగను పురస్కరించుకుని ఈ ఆలయంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా 7వ తేదీన ఉదయం నుంచే ఆలయంలో వైదిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు అర్చకులు. ఉదయం 9:30 నుండి 10.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు వంటి విభిన్న రకాల ద్రవ్యాలతో స్వామివార్లకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.
అభిషేక పూజల అనంతరం సాయంత్రం వేళల్లో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు తిరువీధుల్లో ఊరేగుతారు. అశేష భక్తులను కటాక్షిస్తారు. ఈ తిరువీధి ఉత్సవం ఆలయ వీధుల్లో కనులపండువగా సాగనుంది. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల మధ్య సాగే ఈ ఊరేగింపు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది. శివపార్వతుల పుత్రుడైన కార్తికేయుడికి జన్మదినోత్సవంగా భావించే ఆడికృత్తిక రోజున కపిలతీర్థ క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామిని దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరమని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేకించి జాతకంలో కుజదోష నివారణ, సంతాన ప్రాప్తి కోసం ఈ రోజున భక్తులు విశేషంగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ కోరుతోంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోన్నారు. ఆలయ పరిసరాలను సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయం నుంచి అలిపిరి వరకు విద్యుద్దీపాలను అమర్చనున్నారు. భక్తుల కోసం క్యూలైన్లు, మంచినీటి సౌకర్యాలు, భద్రతా చర్యలను అధికారులు ముందస్తుగానే సమీక్షిస్తున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేలా ప్రత్యేక సిబ్బందిని నియమించనున్నారు.రానున్న నెలలో తిరుమలలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు