శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు: ఆ సేవలన్నీ రద్దు

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 71,668 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,975 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది.

Advertisement

టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే నాలుగు లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.49 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,332 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నారు.

Advertisement

కాగా.. ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. దీనికి ఏర్పాట్లు చురుగ్గా చేపట్టింది టీటీడీ. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజున తెల్లవారు జామున 6 గంటలకు శుద్ధి కార్యక్రమం ఆరంభమౌతుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ఇందులో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా ఆనందనిలయం, ధ్వజస్తంభం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, విమాన వేంకటేశ్వరుడు, పూజాసామగ్రి.. తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.

Advertisement

ఈ కారణంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు వీఐపీ బ్రేక్ దర్శనం లభించదు. 13, 16వ తేదిల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. అలాగే.. ఆణివార ఆస్థానం జరిగే 17వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలన్నీ రద్దయ్యాయి.

English Summary

Anivara Asthanam Grandly Set for July 17 at Srivari Temple, Planned Koil Alwar Tirumanjanam on 14. Following these two events, TTD has cancelled VIP Break Darshans on these two days except for protocol dignitaries. Recommendation letters for VIP Break Darshans will not be accepted.