పొగాకు కొనాల్సిందే..! టొబాకో బోర్డు, కంపెనీలకు సీఎం వార్నింగ్

రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బందిపెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే... తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. సచివాలయంలో బుధవారం పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు రూ.200 తగ్గకుండా, మొత్తం కొనుగోళ్లు జరిపితీరాలన్నారు.

Advertisement

ముఖ్యంగా అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్, గాడ్ ఫ్రే ఫిలిప్స్ (ఐ) లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్ 95.50 మిలియన్ కేజీల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా... ఇప్పటివరకు కేవలం 17.6 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ సీజన్లో ఐదవ సారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రైతులు డిమాండ్‌కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని... దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. దీంతో ధర పతనం కావడం, కొనుగోళ్లు లేకపోవడం జరిగిందని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

English Summary

AP CM Chandrababu Naidu has warned tobacco companies and expressed dissatisfaction with the Tobacco Board over delayed procurement. He ordered immediate purchases at a minimum of ₹200 per kg.