ఉండవల్లి ఆరోపణలు అర్థరహితం...ఆయన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: కుటుంబరావు


అమరావతి: అమరావతి బాండ్ల విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు.

అమరావతి బాండ్లపై ఉండవల్లి ఆరోపణలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందని ఉండవల్లి అరుణ్ కుమార్ నిరూపిస్తే 24 గంటల్లో రాజీనామా చేస్తానని కుటుంబరావు సవాలు విసిరారు. ఉండవల్లి అనేక అసత్యాలు చెబుతున్నారని, పోలవరం ప్రాజెక్టు పనులు జరగకముందే బిల్లులు చెల్లించామని అవాస్తవాలు మాట్లాడుతున్నారని కుటుంబరావు దుయ్యబట్టారు.

ఉండవల్లితో ఏం అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధమని, ఉండవల్లి కోరిన ఏ సమాచారం అయినా ఇస్తానని కుటుంబరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతకుముందు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అమరావతి బాండ్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని...వాటిపై అధిక వడ్డీ ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. రాజధాని నిర్మిస్తున్నారా? వ్యాపారమా? హడ్కో తక్కువ వడ్డీకి రుణం ఇస్తున్నా ఎందుకు తీసుకోలేదేదో సమాధానం చెప్పాలని అన్నారు.

అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమతో సహా రాష్ట్రంలో జరిగిన పంపింగ్ స్కీమ్స్, బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, సీఎం చెప్పిన 18లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు అనే ఆరు అంశాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తనతో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వీటిపై తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే అక్కడే క్షమాపణలు చెప్పి మళ్లీ ఎన్నికల వరకు మాట్లాడనని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి సవాలుకు ప్రతిస్పందించి కుటుంబరావు ప్రతిసవాలు విసిరారు.

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో 7.64 లక్షల ఎకరాలు ప్రభుత్వం సేకరించిందని, దీనిలో మూడో వంతు భూమిలో కూడా పరిశ్రమలు పెట్టలేదని వెల్లడించారు. ఇదే భూమిని రైతులకు సాగుకోసం ఇచ్చి ఉంటే సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తి జరిగి ఉండేదని, అలాగే దాదాపు పాతిక వేల మందికి ఉపాధి లభించేదని అన్నారు.

అమరావతి బాండ్ల వ్యవహారంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, బాండ్ల కొనుగోళ్లలో అసలు వాస్తవాలు వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 10.5 శాతం వడ్డీ ఎలా ఇస్తారో ప్రజలకు సవివరంగా చెప్పాలని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యను వెంటనే పరిష్కరించాలని మధు డిమాండ్‌ చేశారు.

Have a great day!
Read more...

English Summary

Amaravathi: AP Planning Commission Vice president Kutumba Rao criticised that Former MP Undavalli Arun Kumar is campaigning all lies.