బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. భారీ వర్షాలకు కారణమౌతోంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు వచ్చే కొన్ని గంటల్లో అకస్మాత్తుగా ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Advertisement

తాజా వాతావరణ అంచనాల ప్రకారం.. నేడు అల్పపీడనం ప్రభావంతో అల్లురి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

వీటితో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తాయి. అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి జల్లులు పడొచ్చు.

అకస్మాత్తుగా వర్షం కురిసేటప్పుడు పిడుగుల ముప్పు పొంచి ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాలలో పనులు చేసే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పొలం పనులకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడుతున్నప్పుడు లేదా మేఘాలు గర్జిస్తున్నప్పుడు వృక్షాల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో గానీ ఆశ్రయం పొందకూడదని సూచించింది.

English Summary

APSDMA issued a weather alert for Andhra Pradesh. Low pressure may bring heavy rain at one or two places in Alluri and Eluru districts tomorrow, with thunderstorms elsewhere. Coastal areas could see squally winds of 40 to 50 kmph, prompting residents to stay vigilant.