దేశ రక్షణలో జవాన్.. ఊరిలో భూమి మాయం?.. సైనికుడు మహేష్ ఆవేదన! (వీడియో)

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న ఓ సైనికుడికి సొంత ఊరిలోనే రక్షణ కరువైంది. జమ్మూకశ్మీర్ లో విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ జవాన్.. తన సొంత భూమిని కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దేశాన్ని రక్షిస్తున్న సైనికుడి ఆస్తికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

బాధిత జవాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ సైనికుడి పేరు భాష్యం మహేష్. నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో సైనికుడిగా దేశానికి సేవలు అందిస్తున్నారు. తమ్మడపల్లి గ్రామంలో ఆయనకు 2 ఎకరాల 38 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. అయితే స్థానిక తెలుగుదేశం పార్టీ మహానంది మండల ఇంఛార్జీ కంచర్ల శివ, ఆయన అనుచరులు కలిసి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆయన నేరుగా ఆరోపించారు.

Advertisement

ఈ భూ ఆక్రమణ యత్నంపై ఇప్పటికే బాధితుడు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి న్యాయం జరగలేదని మహేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. " మేము ఇక్కడ ప్రాణాలు కూడా లెక్కచేయకుండా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో నిలబెడితే.. మా సొంత ఊరిలో మా ఆస్తులకు రక్షణ కరువైంది. అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు" అంటూ ఆ సైనికుడు కన్నీరు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే ఈ విషయమైన జోక్యం చేసుకోవాలని జవాన్ మహేష్ విజ్ఞప్తి చేశారు. కూటమి సర్కారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి.. భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తన భూమిని తనకు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ జవాన్ ఆవేదనతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Advertisement

English Summary

An emotional video of Army Jawan Bhashyam Mahesh has gone viral, where he appeals to AP CM Chandrababu Naidu and Deputy CM Pawan Kalyan to save his land from TDP leaders.