భోగాపురం విమానాశ్రయం ప్రారంభ వేళ కేంద్రం కీలక ప్రకటన..!!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్దం అయింది. ఏరోడ్రోమ్‌ లైసెన్స్‌ మంజూరుతో వంద శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్‌పోర్టును ప్రారంభించి, జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏడాదికి నాలుగు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. టైర్‌-1 (మొదటి శ్రేణి) నగరాలకు దీటుగా వసతులు ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం..తాజా అనుమతులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Advertisement

ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. విమానాశ్రయ నిర్మాణ పనులను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు మంగళవారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. విమానాశ్రయానికి సంబంధించిన ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్, రన్‌వే మరియు ఎయిర్‌పోర్ట్‌ గ్రీనరీ పనులను ఆయన నిశితంగా వీక్షించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన సివిల్ మరియు సాంకేతిక పనులు 100 శాతం పూర్తయ్యాయని, విమానాల రాకపోకలు ప్రారంభించడా నికి ఎయిర్‌పోర్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని వెల్లడించారు. అత్యంత కీలకమైన విమానాశ్రయ నిర్వహణ లైసెన్స్ కూడా మంజూరైందని మంత్రి ప్రకటించారు.

Advertisement

ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఉత్తరాంధ్ర.. సముద్ర తీర ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ టెర్మినల్‌ను 'చేప ఆకారంలో' ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. రెండేళ్ల రికార్డు కాలంలోనే ఈ మెగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలిగామని స్పష్టం చేశారు. ఈ నిర్మాణానికి భూములిచ్చి పూర్తి సహకారం అందించిన స్థానిక రైతులు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విమానాశ్రయం అన్ని రకాలుగా సిద్ధమైనందున, ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరనున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ తన పర్యటన తేదీని ఖరారు చేయగానే భోగాపురం ఎయిర్‌పోర్టును అధికారికంగా లాంఛనంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో పెరగబోయే ప్రయాణికుల రద్దీ, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్ట్ లోపల మరియు వెలుపల అన్ని రకాల అధునాతన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

English Summary

Bhogapuram International Airport has achieved 100 per cent completion with the issuance of its aerodrome licence by the Ministry of Civil Aviation