పోలవరంకు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు...ఇస్తున్నాం:టిడిపి మంత్రి,బిజెపి ఎమ్మెల్యే మధ్య సంవాదం


టిడిపిపై ప్రశ్నలను సంధించిన బిజెపి పై విరుచుకుపడ్డ అధికార పార్టీ...!

విజయవాడ:నిన్నటివరకు పాలు పంచదారలా కలసి పోయిన టిడిపి-బిజెపి ఇప్పుడు నిప్పు ఉప్పులా మారిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఎక్కడ ఏ సందర్భంలో ఈ రెండు పార్టీల నేతలు ఎదురుపడినా మాటల యుద్దం చోటుచేసుకుంటోంది.

తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే తీరు కొనసాగుతుండగా...సభ వెలుపల సైతం ఈ ఇరుపార్టీల నేతలు వాగ్వాదానికి దిగుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మంత్రి అయ్యన్నపాత్రుడికి, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుకి మధ్య విలేకరుల సమక్షంలో చోటుచేసుకున్న సంవాదం టిడిపి-బిజెపి మధ్య పెరిగిన అంతరం స్థాయిని సూచిస్తున్నాయని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.

బుధవారం అమరావతి అసెంబ్లీ లాబీలో మంత్రి అయ్యన్నపాత్రుడు, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును విలేకరులు చుట్టుమట్టారు. నేడు పోలవరం గ్యాలరీ వాక్ ప్రారంభం సందర్భంగా ఈ ప్రాజెక్టు విషయం చర్చకు రాగా చంద్రబాబు వల్లే పోలవరం ప్రాజెక్ట్ సాధ్యమైందని, పోలవరం పురోగతిని చూసి కేంద్రం నిధులివ్వాలని అయ్యన్నపాత్రుడు పక్కనే ఉన్న బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును కోరారు.

గ్యాలరీ వాక్‌ అంటే ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దగ్గరగా వచ్చినట్టే అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. అయితే కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే ప్రాజెక్టు ఎలా నిర్మిస్తారని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. టిడిపికి బిజెపి మిత్రపక్షంగా ఉన్నప్పుడు పోలవరం ఎపి ప్రజల జీవనాడి అని, పట్టిసీమ, పోలవరాన్ని పొగిడారని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు మంత్రి అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు.

మంత్రి అయ్యన్నపాత్రుడి మాటలపై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ స్పందిస్తూ మంత్రి వాదనను తిప్పికొట్టారు. పోలవరం, పట్టిసీమను తాము పొగిడిన మాట వాస్తవమే అని, అయితే పట్టిసీమలో అవినీతి జరిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు ఇస్తే కేంద్రం నుంచి ఎందుకు డబ్బులు ఇవ్వరని ప్రశ్నించారు. బిల్లులు పెట్టినా డబ్బులు ఇవ్వకపోతే తాము ప్రయత్నం చేసి ఇప్పిస్తామని అన్నారు.

అయితే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం డబ్బులు ఇవ్వలేదనడం టిడిపి నేతలు మాట్లాడటం దుర్మార్గమని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, కేంద్రమే మొత్తం డబ్బు ఇస్తోందని ఆయన స్పష్టంచేశారు. తానెప్పుడూ ఒకే మాటపై ఉంటానని, అప్పుడొక మాట...ఇప్పుడొక మాట ఉండదని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు తేల్చిచెప్పారు.

Have a great day!
Read more...

English Summary

Amaravathi:BJP MLA Vishnukumar Raju today dismissed as “propaganda” claims by TDP Minister Ayyannapathrudu that the Centre has not giving funds to Polavaram Project.