కూటమి నుంచి ఆ ఇద్దరికీ ఎమ్మెల్సీ పదవులు ఖరారు..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అసెంబ్లీలో 164 మంది సభ్యుల మద్దతు కూటమికి ఉంది. మండలిలో మాత్రం వైసీపీకి ఆధిక్యత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వైసీపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కూటమి నుంచి ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Advertisement

వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నమండలి డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పదవీకాలం పూర్తికానుంది. ఇప్పటికే జాకియా ఖానం బీజేపీకి దగ్గరయ్యారు. ఈ ఇద్దరి పదవీ కాలం ముగియటంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో రెండు సీట్లు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. అందులో భాగంగా ఈ రెండు స్థానాల భర్తీ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో భాగంగా రాజ్యసభ సీటు కోసం పలు మార్లు ఆశించి.. నిరాశ చెందిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈ సారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని సమాచారం. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పూర్తి కావటంతో.. ఇప్పుడు మండలికి వర్ల రామయ్యను పంపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

రెండు ఎమ్మెల్సీ పదవుల పైనా కసరత్తు

ఇక, రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు. పార్టీకి చెందిన సీనియర్ నేత లేదా బీసీ వర్గానికి ఈ సీటు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్య‌స‌భ స్థానం ద‌క్క‌లేద‌ని రెడ్డ‌ప్ప‌గారి శ్రీనివాసుల రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య పేరు ఫైనల్ అయితే.. శ్రీనివాసుల రెడ్డికి అవకాశం ఉంటుందనే చర్చ సాగుతోంది. అయితే, మాధవీ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో.. శ్రీనివాసుల రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా అనేది మరో సందేహంగా మారింది. అయితే, రాయలసీమ నుంచి బీసీ వర్గానికి సీటు ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం. వైసీపీ నుంచి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు ఈ నెల 28న పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీకి షెడ్యూల్ విడుదల తరువాత కూటమి నుంచి ఇద్దరి పేర్లు అధికారింగా ప్రకటించనున్నారు.

English Summary

CM Chandra Babu likely to finalize Varla Ramaiah and Rayalaseem leader for Govrnor quota MLC seats