పలుగు పట్టి.. పారెత్తి.. కరువు పనిలో దిగిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్!

దేశ గ్రామీణ అభివృద్ధి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, జీవనోపాధిని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్" (VBG RAM-JI) దేశవ్యాప్తంగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది.

Advertisement

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో గురువారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కలిసి ఈ మెగా మిషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి, పలుగు పట్టి.. పారెత్తి.. కరువు పనిలో పాల్గొని ఉపాధి కూలీల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

Advertisement

సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటగా సమీపంలో మొక్కలు నాటి పర్యావరణ సందేశాన్ని ఇచ్చారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచేందుకు ఉద్దేశించిన 'మ్యాజిక్ డ్రైన్ల' (Magic Drains) పనితీరును వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి సంరక్షణకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో గ్యాలరీని వారు సందర్శించారు. గ్రామీణ స్వచ్ఛతను పెంపొందించేందుకు సిద్ధం చేసిన 'స్వచ్ఛ రథాలను' సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎంలు నిశితంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisement

జాబ్ కార్డులు, బుక్‌లెట్ల ఆవిష్కరణ

ఈ అట్టహాసమైన కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్తగా రూపొందించిన వీబీజీ రామ్ జీ (VBG RAM-JI) జాబ్ కార్డులను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ పథకానికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక గీతాన్ని (Theme Song) కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ ఆవిష్కరించారు. అలాగే, వీబీజీ రామ్ జీ పథకం సమాచార బుక్‌లెట్‌తో పాటు 'కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్'ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. ఈ మిషన్‌ను డిజిటల్ పరంగా మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవికా మిషన్ పోర్టల్‌"ను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

Advertisement

నరేగా రాయలసీమ నుంచే ప్రారంభమైంది..

ఈ సందర్బంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమం వీబీజీ రామ్ జీ ఏపీ నుంచే ప్రారంభమైనందుకు గర్వపడుతున్నానని తెలిపారు. గతంలో నరేగా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతం అయ్యిందని గుర్తు చేశారు. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్రం మరో రూ.4 వేల కోట్ల వ్యయంతో వీబీజీ రామ్ జీ కింద పనులు చేపడతామని వివరించారు.

ఈ పథకంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సారధ్యంలో గ్రామాల రూపు రేఖలు మారతాయి. 125 రోజుల పనిదినాలతో గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన ఏ పనైనా చేపట్టేందుకు వీబీజీ రామ్ జీ కింద అవకాశం ఉంది. రహదారులు, డ్రైనేజీలు, కాలువలు ఇలా వేర్వేరు ఆస్తుల కల్పనకు ఆస్కారం ఉండేలా ఈ పథకం వినియోగిస్తాం. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ లాంటి సాంకేతికతతో పూర్తి పారదర్శకంగా ఈ పథకం నిర్వహిస్తాం. గాలేరు నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకువస్తాం, జలధార ద్వారా భూగర్భ జలాలను కూడా పెంచుతాం. రాష్ట్రాలు కూడా వ్యయం చేసేలా ఈ కార్యక్రమం చేపట్టటం భారం కాదు బాధ్యత. 13,226 గ్రామాల్లో ఒకే మారు గ్రామసభలు పెట్టి గిన్నీస్ రికార్డు సృష్టించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కే దక్కింది. 7,000 కి.మీ. మేర సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల ఫార్మ్ పాండ్లు, 1,373 కి.మీ మేర గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, 1.66 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు అభివృద్ధి జరిగింది. ఉపాధి హామీ పనుల నిమిత్తం 55.44 కోట్ల పనిదినాలు కల్పించి, రూ.16,695 కోట్ల ఖర్చు చేశాo. ఈ ఏడాది 10 వేల కి.మీ. గ్రావెల్ రోడ్లు, 1,500 కి.మీ. సిమెంట్/బీటీ రోడ్లు, 500 కి.మీ. మేజిక్ డ్రైన్లు, లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యంగా పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా జీ రామ్ జీ పథకం కింద నిర్మించవచ్చు. - ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Advertisement

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, స్థానిక రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, వేలాది మంది గ్రామీణ కూలీలు, లబ్ధిదారులు ఈ మహా సభలో పాల్గొన్నారు.

English Summary

CM Chandrababu Naidu, Deputy CM Pawan Kalyan, and Union Minister Shivraj Singh Chouhan launched the nationwide 'VB-G RAM G' at Railway Koduru, Tirupati, and distributed job cards to beneficiaries.