అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజల కోసం బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి కోసం ఉచిత కాశీ-అయోధ్య దివ్య దర్శన యాత్రను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కొద్దిసేపటి కిందటే అనకాపల్లి స్టేషన్ లో ఈ ప్రత్యేక రైలును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. మొదటి విడతగా మొత్తం 1,400 మంది ఈ యాత్రకు బయలుదేరి వెళ్లారు.
సాధారణ, మధ్యతరగతి ప్రజలకు కూడా దేశంలోని పుణ్యక్షేత్రాలను ఉచితంగా దర్శించుకునే భాగ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం రమేష్. ఈ సుదీర్ఘ యాత్రలో భాగంగా భక్తులు కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకోనున్నారు. అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తారు. బాలరాముడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థాన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి భక్తులను విడతల వారీగా ఈ ప్రయాణం కోసం ఎంపిక చేశారు.
వృద్ధులు, నిరుపేదలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయాణ మార్గంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ తీర్థయాత్ర ప్రారంభం నుంచి తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణ కాలంలో భక్తులకు అవసరమైన రుచికరమైన శాఖాహార భోజనం, సురక్షితమైన వసతి, స్థానిక రవాణా సదుపాయాలన్నింటినీ ఉచితంగా అందిస్తున్నారు. యాత్రలో ఉన్న వారికి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని, అత్యవసర మందులను కూడా ఈ రైలులోనే అందుబాటులో ఉంచడం విశేషం. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ విలేకరులతో మాట్లాడారు. తమ నియోజకవర్గ ప్రజలకు లౌకిక జీవితం నుంచి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించడం సంతోషంగా ఉందని అన్నారు. కాశీ, అయోధ్య వంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించడం ప్రతి హిందువు జీవితకాల స్వప్నమని, ఆ కలను సాకారం చేసే అవకాశం తనకు లభించిందని వ్యాఖ్యానించారు. ఈ వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమం పట్ల స్థానిక ప్రజల నుంచి, హిందూ సంఘాల నుంచి భారీ స్పందన వ్యక్తమవుతోంది. సొంత ఖర్చులతో సుదూర ప్రాంతాలకు వెళ్లలేని ఎందరో పేదలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వృద్ధ దంపతులు ఈ ఉచిత యాత్ర ద్వారా తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంటున్నారు. ప్రయాణం ప్రారంభానికి ముందు భక్తులందరికీ ప్రత్యేక పూజా ద్రవ్యాలు, ప్రయాణ మార్గదర్శకాలతో కూడిన కిట్లను ఆయన అందజేశారు.పసిడి రేట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోన్న ఆ పరిణామాలు- ఈ వారంలో.. !!